నేటి నుంచి కామెడ్ కే పీజీ కౌన్సెలింగ్ | Sakshi
Sakshi News home page

నేటి నుంచి కామెడ్ కే పీజీ కౌన్సెలింగ్

Published Mon, Apr 21 2014 2:23 AM

Kay kamed PG counseling from toda

  • అందుబాటులో 387 వైద్య, 234 దంత వైద్య సీట్లు
  •  బెంగళూరులోని ఎన్‌ఎంకేఆర్‌వీ కల్యాణ మంటపంలో ఏర్పాట్లు
  •  సాక్షి, బెంగళూరు : కన్సార్టియం ఆఫ్ మెడికల్, ఇంజనీరింగ్, అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక (కామెడ్-కే) ఆధ్వర్యంలో వైద్య, దంత వైద్య పీజీ కోర్సుల మొదటి దశ ప్రవేశ ప్రక్రియ నేటి నుంచి (సోమవారం) ప్రారంభం కానుంది. బెంగళూరులోని ఎన్‌ఎంకేఆర్‌వీ కల్యాణ మంటపంలో ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకూ మూడు రోజుల పాటు జరుగనుంది. మొత్తం 621 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి.

    ఇందులో 387 వైద్య విద్యకు సంబంధించినవి కాగా, మిగిలిన 234 సీట్లు దంత వైద్యానికి సంబంధించినవి. ప్రవేశ ప్రక్రియ తొలిరోజు (సోమవారం) దంత వైద్య కోర్సుకు, మంగళ, బుధవారాలు వైద్య విద్యకు సంబంధించి ప్రవేశ ప్రక్రియ జరగనుంది. కాగా, రెండో దశ కౌన్సెలింగ్ మేలో జరగనుంది. ఆ సమయానికి మరికొన్ని పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చే అవ కాశం ఉంది. కాగా, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మెడికల్, డెంటల్ పీజీ కోర్సు కౌన్సెలింగ్ మొదటిదశ ప్రక్రియను ఈనెల 25న పూర్తి చేయాల్సి ఉందని కామెడ్ కే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఏ.ఎస్ శ్రీకంఠయ్య తెలిపారు.
     
    అందువల్లే ప్రభుత్వ కోటా సీట్ల భర్తీ కంటే ముందుగా ప్రైవేటు కళాశాలల్లో అందుబాటులో ఉన్న సీట్లకు ప్రవేశ ప్రక్రియ పూర్తి చేయాల్సి వస్తోందని ఆయన వివరించారు. కాగా, స్థానికతకు సంబంధించి ప్రభుత్వానికి, విద్యార్థులకు మధ్య నడుస్తున్న కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. అందువల్లే ప్రభుత్వం వైద్య, దంత వైద్య పీజీ కోర్సులకు సంబంధించిన ప్రక్రియ నిర్వహించలేకపోతోందని వైద్య విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

    ఫిబ్రవరిలో జరిగిన కామెడ్-కే పీజీ ఎంటెన్స్ పరీక్షకు 16,856 మంది అభ్యర్థులు హాజరుకాగా, అందులో 7,587 మంది (55 శాతం) పీజీ కోర్సులో ప్రవేశానికి అర్హత సాధించారు. మరిన్ని వివరాల కోసం www.comedk.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు
     

Advertisement
Advertisement