లీజ్ గడువు తగ్గింపు | Sakshi
Sakshi News home page

లీజ్ గడువు తగ్గింపు

Published Wed, Dec 24 2014 1:08 AM

లీజ్ గడువు తగ్గింపు - Sakshi

‘కేఎస్‌ఎస్‌ఐడీసీ’ సువర్ణమహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
 
బెంగళూరు: రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందజేసే భూమికి సంబంధించిన ‘లీజ్’ సమయాన్ని 99ఏళ్ల కంటే తక్కువ చేసే యోచన ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చలు జరిపి త్వరలోనే తుది నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు తెలిపారు. మంగళవారమిక్కడి సెంట్రల్ కాలేజ్ ఆవరణలో నిర్వహించిన కర్ణాటక స్టేట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(కేఎస్‌ఎస్‌ఐడీసీ) సువర్ణ మహోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ప్రస్తుతం రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమలకు ఇస్తున్న భూమి లీజు వ్యవధి 99 ఏళ్లుగా ఉంది. దీన్ని మరో 10 సంవత్సరాలు తగ్గిస్తూ(అంటే 89ఏళ్ల వ్యవధి)నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అంటూ కేఎస్‌ఎస్‌ఐడీసీ అధ్యక్షుడు గురప్ప నాయుడు చేసిన విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి పై విధంగా స్పందించారు.  పొరుగు రాష్ట్రాల్లో ఉన్న విధానాలను అనుసరించి తాము కూడా లీజ్ వ్యవధిని తగ్గించే దిశగా ప్రణాళికలు రచిస్తామని పారిశ్రామిక వేత్తలకు హామీ ఇచ్చారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పరిశ్రమల స్థాపనకు సహాయ సహకారాలు అందించడంలో కర్ణాటక ప్రభుత్వం ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుందని సిద్ధరామయ్య పేర్కొన్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలకు ట్రేడ్ లెసైన్స్ పొందడం నుంచి రాయితీలు కల్పించామని, త్వరలోనే ఈ  అంశానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుందని తెలిపారు. ఏ పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలిపెట్టి పోలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హీరో సంస్థ తెలంగాణకు తరలిపోవడంపై ముఖ్యమంత్రి స్పందిస్తూ... కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలో ప్రారంభమయ్యే పరిశ్రమలకు వివిధ రాయితీలను కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీలు ఇచ్చిన నేపథ్యంలోనే ఆ కంపెనీ ఇక్కడి నుంచి తరలిపోయిందని తెలిపారు. కాగా ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించనందున తిరిగి ఆ సంస్థ కర్ణాటకకే వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక మహారాష్ట్రలోని కొల్హాపురకు చెందిన కొన్ని పరిశ్రమలు బెళగావిలో తమ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు
 
 
 పరిశ్రమలకు నిరంతర విద్యుత్
 మంత్రి డి.కె.శివకుమార్ వెల్లడి
 సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలోని పరిశ్రమలకు 24గంటల పాటు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ప్రత్యేక ఫీడర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ఇం దన శాఖ మంత్రి డి.కె.శివకుమార్ వెల్లడించారు. మంగళవారమిక్కడి కేఎస్‌ఎస్‌ఐడీసీ సువర్ణమహోత్సవలో ఆయన మాట్లాడారు. రానున్న ఆరు నెలల్లో రాష్ట్రంలో విద్యుత్ కొరతను పూర్తిగా నివారించనున్నట్లు తెలిపారు. అనంతరం పరిశ్రమలకు నిరంతర విద్యుత్‌ను అందించేందుకు ప్రత్యేక ఫీడర్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌ను అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కాగా, బెంగళూరులోని జిగణి పారిశ్రామిక ప్రాంతానికి విద్యుత్ సరఫరా చేసే తీగల ఏర్పాటుకు స్థలాభావం ఎదురవుతోందని, సొరంగ మార్గంలో విద్యుత్ తీగలను ఏర్పాటు చేయాలంటే సాధారణ ఖర్చుతో పోలిస్తే 800రెట్లు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోందని అన్నారు. అయినా కూడా అన్ని సమస్యలను అధిగమించి పరిశ్రమలకు 24గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను అందజేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement