వీడిన సందిగ్ధం | Sakshi
Sakshi News home page

వీడిన సందిగ్ధం

Published Thu, Sep 11 2014 1:48 AM

వీడిన సందిగ్ధం

  • మైసూరు దర్బార్ యథాతథం రాజుకు బదులు సింహాసనంపై పట్టాకత్తి
  • మైసూరు : విశ్వ విఖ్యాత మైసూరు దసరా ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచే ప్రైవేట్ దర్బారును ఈ ఏడాది కూడా సంప్రదాయ పద్ధతిలోనే నిర్వహించనున్నారు. గత డిసెంబరులో మైసూరు సంస్థానాధీశుల చివరి వారసుడు శ్రీకంఠదత్త నరసింహ రాజ ఒడయార్ మరణంతో ఈ దర్బారు నిర్వహణపై అనుమానాలు చోటు చేసుకున్నాయి. ఆయన వారసుడు ఎవరు అనే విషయం ఇంకా ప్రకటించక పోవడం, కోర్టు వ్యాజ్యాల్లో ప్రభుత్వ వైఖరిపై రాణి ప్రమోదా దేవి అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈసారి ప్రైవేట్ దర్బారు ఉండదనే అందరూ అనుకున్నారు.

    అయితే 400 సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని పక్కన పెట్టి, ప్రైవేట్ దర్బారును రద్దు చేయడం సరికాదని ప్రమోదా దేవికి పలువురు సూచించిన నేపథ్యంలో, ఆమె ఆలోచనలో మార్పు వచ్చింది. ఎప్పటిలాగే దర్బారును నిర్వహించాలని నిర్ణయించారు. వారసుడు లేనందున, పట్టా కత్తిని అలంకరించి, సింహాసనంపై ఉంచి పూజించడం ద్వారా దర్బారును నిర్వహించనున్నారు. ఏటా దసరా సందర్భంగా లోక కళ్యాణార్థం నిర్వహించే పూజా, విధి విధానాలను అర్చకులు పూర్తి చేయనున్నారు.

    అదే విధంగా ఏనుగు దంతాలను ఆయుధాలుగా చేసుకుని సాగే యుద్ధం (వజ్రముష్టి కాళగ)ను కూడా నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి జట్టి సామాజిక వర్గం వారు ప్రమోదా దేవితో చర్చించారు. మొత్తానికి దసరా సందర్భంగా ప్రైవేట్ దర్బారు నిర్వహణపై ఉన్న నీలి నీడలు తొలగిపోయాయి. మహా భారత కాలంలో ధర్మరాజు ఉపయోగించినదిగా చెబుతున్న 275 కిలోల స్వర్ణ సింహాసనంపై పట్టా కత్తిని ఉంచడం ద్వారా ప్రైవేట్ దర్బారు నిర్వహణకు మార్గం సుగమమైంది.
     

Advertisement
Advertisement