ఓటమిపై వామపక్షాల సమీక్ష | Sakshi
Sakshi News home page

ఓటమిపై వామపక్షాల సమీక్ష

Published Mon, May 19 2014 12:57 AM

ఓటమిపై వామపక్షాల సమీక్ష - Sakshi

సీపీఎం పొలిట్‌బ్యూరో, సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గం వేర్వేరు భేటీలు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో వామపక్షాల దారుణ పరాజయంపై సీపీఎం, సీపీఐ అగ్ర నాయకత్వాలు ఆదివారం ఢిల్లీలో తమ తమ కార్యాలయాల్లో సమావేశమై ప్రాథమికంగా సమీక్షించుకున్నాయి. ఎన్నికల్లో తమ తమ పార్టీలు ఆశించిన ఫలితాలు సాధించలేకపోగా మరింతగా దిగజారటానికి గల కారణాలు, తమ తమ పార్టీల్లో సంస్థాగతంగా చేపట్టాల్సిన మార్పుచేర్పులు, ఎన్నికల అనంతర రాజకీయ పరిస్థితులు, బీజేపీ భారీ విజయంతో జరగనున్న పరిణామాలు, ఆ క్రమంలో తమ పాత్ర తదితర అంశాలపై అగ్రనేతలు చర్చించుకున్నారు.

 సీపీఎం పొలిట్‌బ్యూరో భేటీలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్‌తోపాటు అగ్ర నేతలు సీతారాం ఏచూరి, బిమన్‌బసు, పినరయి విజయన్, బృందాకారత్, తదితరులు పాల్గొన్నారు. జూన్ 7, 8 తేదీల్లో పార్టీ కేంద్ర కమిటీ సమావేశమై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించి పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలను, నివేదికను ఆమోదించనుంది. మరోవైపు సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గం సమావేశంలో పార్టీ సీనియర్ నేత ఎ.బి.బర్ధన్, ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, జాతీయ కార్యదర్శి డి.రాజా తదితరులు పాల్గొన్నారు. జూన్‌లో పార్టీ జాతీయ మండలి సమావేశమై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తుందని రాజా తెలిపారు.

Advertisement
Advertisement