క్లీన్ స్వీప్ ఖాయం | Sakshi
Sakshi News home page

క్లీన్ స్వీప్ ఖాయం

Published Wed, Apr 16 2014 11:04 PM

Lok Sabha elections 2014: Clean sweep for BJP in Delhi

ఏడింటికి ఏడు సీట్లూ గెలుస్తామంటున్న బీజేపీ నేతలు
     తమ వ్యతిరేక ఓట్లు చీలడం లాభిస్తుందని జోస్యం
     రెండో స్థానంలో ఆప్, కాంగ్రెస్ మూడో స్థానానికే..
     పార్టీ అంతర్గత సర్వేలో వెల్లడైందంటున్న కమలనాథులు
 
 సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికలలో ఇన్నాళ్లుగా కాంగ్రెస్, బీజేపీలలో ఏదో ఒక పార్టీనే  ఏకపక్షంగా గెలిపించే ఢిల్లీవాసులు ఈసారి ముక్కోణపు పోటీ జరిగినా ఏకపక్షంగానే ఓట్లు వేశారని తమ పార్టీ అంతర్గత సర్వేల్లో స్పష్టమైందని బీజేపీ నేతలు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికలలో ఢిల్లీలోని ఏడు స్థానాలు తమకే దక్కుతాయని సర్వేల్లో తేలడంతో బీజేపీ నేతలు ఆనందంతో పొంగిపోతున్నారు. ఆప్ కారణంగా తమ వ్యతిరేక ఓట్లు చీలడం తమకు లాభిస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ పోటీలో కాంగ్రెస్ అభ్యర్థులు చాలా వెనుకబడిపోతారని, ఏడు నియోజకవర్గాల్లో ప్రధాన పోటీ తమకు, ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్యనే ఉంటుందన్నది కూడా  బీజేపీ నేతలకు ఆనందం కలిగిస్తోంది. ప్రతి లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థులు నాలుగు లక్షల ఓట్లతో మొదటి స్థానంలో, దాదాపు 3 లక్షల ఓట్లతో ఆప్ అభ్యర్థులు రెండవస్థానంలో ఉంటారని, కాంగ్రెస్ అభ్యర్థులకు రెండు లక్షల ఓట్లకు మించి రావని సర్వేలో తేలినట్లు ఆ పార్టీవర్గాలు వెల్లడించాయి.
 
 పోలింగ్ తరువాత బీజేపీ ప్రతి నియోజకకవర్గం నుంచి  ఓటింగ్ సరళికి సంబంధించిన నివేదికలను సేకరించి పరిశీలించింది. దీని ప్రకారం నగరంలో ముస్లిం ఓట్లు చీలాయని, 40 శాతం ఓట్లు కాంగ్రెస్‌కు, మిగతా ఓట్లు ఆప్‌కు లభించాయని బీజేపీ అంచనా వేసింది. అదేవిధంగా దళితులు, పునరావాసకాలనీ వాసుల ఓట్లు, ఇతర నిమ్నజాతుల ఓట్లు ఆప్ ఖాతాలోకే చేరాయని బీజేపీ భావిస్తోంది. దాంతో కాంగ్రెస్ ఓట్ల రేసులో వెనుకబడిపోయిందని వారు  భావిస్తున్నారు. మధ్య తరగతి ఓటర్లు మళ్లీ తమ వైపునకు మళ్లారని బీజేపీ అంచనా వేస్తోంది. న్యూఢిల్లీలో మోడీ ప్రభంజనం బీజేపీని గెలిపిస్తుంందని పార్టీ సర్వేలో స్పష్టమైందని చెబుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి తాము నిలబెట్టిన మీనాక్షీ లేఖికి ప్రజాదరణ పెద్దగా లేకపోయినా నరేంద్రమోడీ ప్రభావంతో ఆమె  కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ మాకెన్‌కు గట్టి పోటీ ఇచ్చారని అక్కడ పార్టీ కార్యకర్తలు నిర్వహించిన సర్వేలో తేలిందన్నారు.
 
 కరోల్‌బాగ్, రాజేంద్రనగర్‌లలో కాంగ్రెస్‌కు తక్కువ, ఆప్‌కు ఎక్కువ ఓట్లు వస్తాయని దాని వల్ల తమకు ప్రయోజనం చేకూరుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వెస్ట్ ఢిల్లీలో ఆప్ నిలబెట్టిన జర్నైల్ సింగ్ కారణంగా సిక్కుల ఓట్లు ఆ పార్టీ ఖాతాలో చే రతాయని, అయితే కాంగ్రెస్ అభ్యర్థి మహాబల్ మిశ్రాకు గతంలో ఓటేసిన పూర్వాంచలీ, బ్రాహ్మణ ఓటర్లు ఈ సారి బీజేపీ వైపు మొగ్గు చూపుతారని, దాంతోపాటు  ద్వారకాలోని మధ్యతరగతి ఓటర్లు, నజఫ్‌గఢ్ గ్రామీణ ఓటర్లు కూడా తమకే ఓటేస్తారని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. చాందినీచౌక్‌లో ముస్లిం ఓట్లు ఆప్‌కు దక్కినప్పటికీ గెలుపు తమదే అన్న ధీమాతో బీజేపీ ఉంది. డాక్టర్ హర్షవర్ధన్ ఇక్కడ నుంచి భారీ మెజారీటీతో గెలుస్తారని, ఆప్ అభ్యర్థి ఆశుతోష్ రెండవ స్థానంలో, కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ కపిల్ సిబల్ మూడో స్థానంలో ఉం టారని బీజేపీ అంచనా వేస్తోంది. నార్త్ ఈస్ట్,  నార్త్ వెస్ట్, ఈస్ట్ ఢిల్లీల్లో గెలుపు తమదేనని, తమ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్, ఆప్‌ల మధ్య చీలడం ఈ నియోజకవర్గాలలో తమకు లాభిస్తుందని బీజేపీ ఆశిస్తోంది. ఏడు సీట్లలో అన్నింటికన్నా గట్టి పోటీ సౌత్ ఢిల్లీ నియోజకవర్గంలో  ఎదురవుతుందని, అయితే  కాంగ్రెస్, ఆప్ అభ్యర్థులు ఇద్దరు జాట్లు కావడం వల్ల ఆప్ ఓట్లు చీలడం తమకు అనుకూలిస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement