కోర్టుకు హాజరైన ప్రేమజంట | Sakshi
Sakshi News home page

కోర్టుకు హాజరైన ప్రేమజంట

Published Thu, Oct 31 2013 4:14 AM

Love couple appear before district court

తిరువళ్లూరు, న్యూస్‌లైన్: తిరువళ్లూరు జిల్లా పూసానిమేడు ప్రాంతానికి చెందిన వినాయకం కుమార్తె సూర్యకుమారి(23) పదవ తరగతి వరకు చదువుకుంది. ప్రస్తుతం వెంగల్ సమీపంలోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వెంగల్ సమీపంలోని పనపాక్కం గ్రామానికి చెందిన మునస్వామి కుమారుడు కార్తీక్ మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇద్దరిది వేర్వేరు కులాలు కావడంతో పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఇద్దరు ఈ నెల 23న ఇంటి నుంచి పారిపోయి రాయపేట రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. సూర్యకుమారిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఆమె తమ్ముడు శంకర్ వెంగల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
 పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న సూర్యకుమారి, కార్తీక్ బుధవారం తిరువళ్లూరు కోర్టులో న్యాయమూర్తి తమిళ్‌సెల్వి ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి తమిళ్‌సెల్వి సూర్యకుమారిని ప్రత్యేకంగా విచారించారు. తనను ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదని, తాను మూడేళ్ల నుంచి కార్తీక్‌ను ప్రేమిస్తున్నానని పేర్కొంది. తన ఇష్ట ప్రకారమే వివాహం చేసుకున్నట్టు చెప్పింది. పెద్దల నుంచి ప్రాణహాని ఉందని తెలిపింది. దీంతో న్యాయమూర్తి తమిళ్ సెల్వి తీర్పు వెలువరిస్తూ సూర్యకుమారి కార్తీక్‌తో వెళ్లవచ్చని పేర్కొన్నారు. ప్రేమ వివాహానికి మద్దతుగా, వ్యతిరే కంగా పెద్ద ఎత్తున యువకులు కోర్టుకు హాజరుకావడంతో ఉద్రిక్తత నెలకొంది. కోర్టు ఆవరణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. 
 

Advertisement
Advertisement