దీపావళి నుంచి ఎల్‌టీటీ-నిజామాబాద్ రైలు | Sakshi
Sakshi News home page

దీపావళి నుంచి ఎల్‌టీటీ-నిజామాబాద్ రైలు

Published Fri, Oct 25 2013 11:31 PM

LTT - Nizamabad rail start from diwali

సాక్షి, ముంబై: ముంబైతోపాటు ఠాణే చుట్టుపక్కల ప్రాం తాల్లో నివసించే తెలుగు ప్రజల కల ఎట్టకేలకు నెరవేరబోతోంది. 2013-14 రైల్వే బడ్జెట్‌లో ప్రకటించిన వారానికి ఒకసారి నడిచే లోక్‌మాన్యతిలక్ టెర్మినస్ (ఎల్ టీటీ)- నిజామాబాద్ రైలు దీపావళి నుంచి అందుబాటులోకి రానుంది. 11205 నంబర్‌గల ఎల్‌టీటీ - నిజామాబాద్ ఎక్స్‌ప్రెస్ నవంబర్‌రెండో తేదీ శనివారం సాయంత్రం 4.40 గంటలకు కుర్లా నుంచి నిజామాబాద్‌కు బయల్దేరనుంది. ఈ రైలు మరుసటిరోజు ఆదివారం ఉదయం 9.15 గంటలకు నిజామాబాద్ చేరుకుంటుంది.
 
 అదే విధంగా 11206 నంబర్ నిజామాబాద్ - ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ రైలు నవంబర్ మూడో తేదీ ఆదివారం రాత్రి 11.15 గంటలకు నిజామాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు సోమవారం మధ్యాహ్నం 1.55 గంటలకు  ఎల్‌టీటీ చేరుకుంటుందని సెం ట్రల్ రైల్వే శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దీంతోపాటు ముంబై-షోలాపూర్, ఎల్‌టీటీ- అజ్నీ, ఎల్‌టీటీ-కరైకల్ రైళ్లను కూడా ఈ వారంలో ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. రాష్ట్రంలో నివసించే తెలుగు ప్రజల్లో ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని జిల్లాలకు చెందినవారున్నప్పటికీ... కరీంనగర్, నిజామాబాద్, మెదక్ తదితర తెలంగాణ జిల్లాలకు చెందిన ప్రజల సంఖ్యే అధికం.
 
 తమ స్వగ్రామాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నడిపే ఏపీస్‌ఆర్‌టీసీ బస్సులతోపాటు ప్రైవేట్ బస్సులు ఉన్నప్పటికీ రైళ్ల చార్జీల (స్లీపర్, జనరల్ క్లాస్)తో పోలిస్తే బస్సులకు దాదాపు రెండు నుంచి నాలుగింతలు అధికంగా చెల్లించాల్సి వస్తోంది. దీంతో అనేకమంది రైలు ప్రయాణానికి మొగ్గుచూపుతున్నారు. ముంబై, ఠాణే, భివండీ, కళ్యాణ్ తదితర చుట్టుపక్కల నివసించే కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలతోపాటు అదిలాబాద్ జిల్లాలోని లక్సెట్టిపేట,  మంచిర్యాల తదితర ప్రాంతాల తెలుగు ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ముంబై నుంచి దేవగరి ఎక్స్‌ప్రెస్ ఒకటే ఆధారం. దీంతో పైన పేర్కొన్న జిల్లాల్లోని తెలుగు ప్రజలంతా ఈ రైలుపైనే ఆధారపడేవారు. అదే విధంగా ఈ రైలులో నిజామాబాద్‌కు ప్రత్యేక కోటా లేకపోయినా నాందేడ్ ప్రజలకు మాత్రం ఈ రైలులో ప్రత్యేక కోటా కల్పించారు. దీంతో సీజన్, అన్ సీజన్ అని తేడాలేకుండా దాదాపు సంవత్సరం పొడవునా ఈ రైలులో టికెట్ లభించడం అంత సులువేమీ కాదు. ఈ నేపధ్యంలో తెలుగు సంఘాలన్నీ ఆందోళనలు చే శాయి. దీంతో ఈసారి బడ్జెట్‌లో నిజామాబాద్ రైలును ప్రకటించారు. కొత్త రైలు రాకతో ఈ మార్గంలోరాకపోకలు సాగించే తెలుగు ప్రజలకు ఊరట లభించనుంది.   
 
 ఠాణేలో హాల్ట్ ఇవ్వాలి...
 కొత్తగా ప్రవేశపెట్టనున్న నిజామాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఠాణేలో హాల్ట్ లేకపోవడంపై తెలుగు ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. భాండుప్, ములుండ్, ఠాణే, కల్వా, ముంబ్రా,తోపాటు చుట్టుపక్కల నివసించే అనేక మంది ప్రజలకు ఠాణే రైల్వేస్టేషన్ ఎంతో సౌకర్యంగా ఉంటుంది. దేవగిరి రైలుకు ఠాణేలో హాల్ట్‌ఉన్నప్పటికీ కొత్తగా ప్రారంభించనున్న ఎల్‌టీటీ-నిజామాబాద్ రైలుకు ఠాణేలో లేకపోవడంపై  నిరసన వ్యక్తమవుతోంది. ఈ రైలుకు కూడా ఠాణేలో హాల్ట్ ఇవ్వాలని స్థానిక తెలుగు ప్రజలు డిమాండ్‌చేస్తున్నారు.  
 
 తెలుగు సంఘాల కృషితో...
 నిజామాబాద్ రైలు కోసం అనేక తెలుగు సంఘాలు తీవ్రంగా కృషి చేశాయి. వీటిలో అనేక సంఘాలున్నాయి. ఎట్టకేలకు తమ కల సాకారం కానుందని తెలిసి ఈ తెలుగు సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఈ రైలు కళ్యాణ్, ఇగత్‌పురి, దేవలాలి, నాసిక్‌రోడ్డు, మన్మాడ్, రోటేగావ్, లసూర్, ఔరంగాబాద్, జాల్నా, పర్తూర్, సేలూ, పర్భణి, పూర్ణా, నాందేడ్, ముద్‌ఖేడ్, ఉమ్రీ, ధర్మాబాద్, బాసరలలో ఆగుతుంది. 

Advertisement
Advertisement