‘పవర్’ స్కాం! | Sakshi
Sakshi News home page

‘పవర్’ స్కాం!

Published Wed, Dec 24 2014 1:58 AM

‘పవర్’ స్కాం! - Sakshi

 విద్యుత్ కొనుగోళ్లలో రూ.లక్ష కోట్ల మేరకు అవినీతి జరిగిందన్న ఆరోపణలు బయలు దేరాయి. విద్యుత్ శాఖలో భారీ అవినీతి జరిగిందంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పూర్తి వివరాలతో పిటిషన్ సమర్పించాలని హైకోర్టు సూచించింది.  పాలకులే ప్రజా ధనాన్ని మింగేశారని పీఎంకే నేత రాందాసు ఆరోపించారు.  
 
 సాక్షి, చెన్నై: రాష్ట్రంలో రోజుకు 12వేల మెగా వాట్ల మేరకు విద్యుత్ అవసరం. కొన్నేళ్లుగా సరిపడా విద్యుత్ ఉత్పత్తి కావడం లేదు. ఇక్కడి వనరులను అభివృద్ధి చేసుకుం టూనే, బయటి నుంచి వేలాది మెగావాట్లను కొనుగోలు చేస్తున్నారు. బయటి కొనుగోళ్లను సాకుగా చూపుతూ, రెండేళ్ల వ్యవధిలో రెండు సార్లు విద్యుత్ చార్జీల్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ప్రజల నెత్తిన భారాన్ని రుద్దిన పాలకులు, విద్యుత్ రంగ సంస్థల బలోపేతం మీద దృష్టి పెట్టక పోగా, కొనుగోళ్ల పేరుతో అవినీతికి పాల్పడడం వెలుగులోకి వచ్చింది.
 
 అవినీతి :  రాష్ట్ర విద్యుత్ బోర్డు నేతృత్వంలో విద్యుత్ కొనుగోళ్ల పేరుతో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకున్నట్టు సామాజిక కార్యకర్త సెల్వరాజ్  మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2001 -2014 మధ్య కాలంలో బయటి వ్యక్తుల నుంచి విద్యుత్ కొనుగోళ్ల పేరిట లక్ష కోట్ల అవినీతి చోటుచేసుకుందని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జ్ఞాన దేశికన్ ఇది వరకు విద్యుత్ బోర్డు చైర్మన్‌గా వ్యవహరించారని వివరించారు. ఆయన హయూంలో ఈ అవినీతి చోటు చేసుకుందని, దీనిపై సమగ్ర విచారణ జరిపి, కేంద్ర గణాంకాల విభాగం నేతృత్వంలో తనిఖీలకు ఆదేశాలు ఇవ్వాలని, విద్యుత్ బోర్డులో ప్రక్షాళనకు చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ పిటిషన్ మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణ నేతృత్వంలోని బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. అయితే, లక్ష కోట్ల అవినీతికి సంబంధించిన వివరాలను పొందు పరచాలని, సమగ్ర వివరాలతో కొత్త పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్‌కు సూచించారు. తదుపరి విచారణనను జనవరి ఆరో తేదీకి వాయిదా వేశారు.
 
 పాలకులే మింగేశారు: ఓ వైపు మద్రాసు హైకోర్టులో విద్యుత్ అవినీతిపై పిటిషన్ దాఖలు అయితే, మరో వైపు సమాచార హక్కు చట్టం మేరకు స్వీకరించిన వివరాలతో పీఎంకే అధినేత రాందాసు ఓ ప్రకటనను విడుదల చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా లక్షకోట్ల మేరకు అవినీతి వెలుగు చూసిందని పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోళ్ల పేరిట భారీ దోపిడీ జరిగిందని ఆరోపించారు. విద్యుత్ బోర్డు నష్టాల్లో ఉందని పేర్కొంటూ, ప్రజల మీద భారాన్ని వేస్తున్నారని మండి పడ్డారు. అయితే, ఆ శాఖలో చోటు చేసుకున్న అవినీతిని బయటకు లాగితే, ఆ సంస్థ లాభాల దిశలో పయనించేందుకు వీలుందన్నారు. విద్యుత్ పథకాలను ప్రకటించారేగానీ, అవి సక్రమంగా అమలు కాలేదని వివరించారు. కొత్త పథకాలను అమల్లోకి తెస్తున్నామని ఓ వైపు ప్రకటిస్తూనే, మరో వైపు బయటి నుంచి అధిక మొత్తంలో విద్యుత్‌ను కొనుగోలు చేసిన తమ జేబుల్ని నింపుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పుల కంటే, విద్యుత్ బోర్డు అప్పులు అధికంగా ఉండడం అనుమానాలకు తావిస్తున్నదన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి అవినీతి సొమ్మును కక్కించాలని డిమాండ్ చేశారు.  

 

Advertisement
Advertisement