సర్కారుకు షాక్! | Sakshi
Sakshi News home page

సర్కారుకు షాక్!

Published Thu, Oct 27 2016 1:36 AM

సర్కారుకు షాక్! - Sakshi

సాక్షి, చెన్నై : రాష్ట్ర ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు షాక్ ఇచ్చింది. కొత్త న్యాయ కళాశాలల ఏర్పాటుకు అడ్డంకిగా ఉన్న చట్టాన్ని కోర్టు రద్దు చేసింది. కొత్త కళాశాలలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ, ఇందుకుగాను వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అనుమతుల నిర్ణయం తీసుకోవాలని న్యాయమూర్తులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, ఇరవై వేలు జరిమానా విధించడం గమనార్హం. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ప్రధాన బెంచ్ పలు కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి తరచూ అక్షింతలు, మొట్టికాయలు, జరిమానాలు విధిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.
 
 తాజాగా మరో మారు అక్షింతలు వేయడంతో పాటు చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గత నెల న్యాయమూర్తి కృపాకరణ్ నేతృత్వంలోని బెంచ్ ఏకంగా స్థానిక ఎన్నికలకు తగ్గ ఉత్తర్వుల్నే రద్దు చేస్తే, ప్రస్తుతం న్యాయ కళాశాలలకు మోకాలొడ్డే విధంగా ఉన్న చట్టాన్ని ప్రధాన న్యాయమూర్తి  సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి మహాదేవన్ నేతృత్వంలోని బెంచ్ రద్దు చేయడం న్యాయ శాస్త్రం  చదువుకోవాలన్న ఆశతో ఎదురు చూపు ల్లో ఉన్న యువతకు ఆనందమే.
 
 పిటిషన్ : రాష్ట్ర ప్రభుత్వం తరఫున అంబేద్కర్‌వర్సిటీ పరిధిలో పది న్యాయ కళాశాలలు  ఉన్నాయి. మొత్తం సీట్ల సంఖ్య ఐదు వేలలోపే. ప్రైవేటు విద్యా సంస్థలు న్యాయశాస్త్రం బోధించే విధంగా కొత్త కళాశాలలకు ముందుకు వచ్చినా ప్రభుత్వ చట్టం అడ్డంకిగా మారక తప్పడం లేదు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ  సమూహ నీధి పేరవై నేత బాలు హైకోర్టులో పిటిషన్ వేశారు. రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరంలో న్యాయ శాస్త్రం చదువుకునేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారని గుర్తు చేశారు. అయితే, సీట్ల సంఖ్య మరీ తక్కువగా ఉండడంతో ఇతర రాష్ట్రాలను ఆశ్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు.
 
 ఆరు వేల మందికి పైగా విద్యార్థులు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలోని న్యాయ కళాశాలల్లో చదువుకుని, ఇక్కడ న్యాయవాదులుగా ప్రాక్టీసు చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నట్టు పేర్కొన్నారు. ఇందుకు కారణం, రాష్ట్రంలో కొత్తగా న్యాయ కళాశాలల ఏర్పాటుకు తగ్గ అనుమతులు లేక పోవడమేనని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన చట్టం మేరకు ఇక్కడ ప్రైవేటు న్యాయ కళాశాలలకు అనుమతులు లేదు అని, ఆ చట్టాన్ని రద్దు చేస్తే, కొత్త కళాశాలలు ఏర్పాటు అవుతాయని, ఇక్కడి విద్యార్థులకు న్యాయ శాస్త్రం మరింత దగ్గరగా అవుతుందని కోర్టు దృష్టికి తెచ్చారు.
 
 అలాగే, వన్నియర్ ట్రస్టు నేతృత్వంలో పీఎంకే అధ్యక్షుడు జీకే మణి న్యాయ కళాశాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకుని ఎనిమిదేళ్లు అవుతున్నా,ప్రభుత్వంలో స్పందన లేదని పేర్కొంటూ, మరో పిటిషన్ కోర్టులో దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్ల మీద విచారణ ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి ఆర్ మహాదేవన్ నేతృత్వంలోని బెంచ్ ముందు సాగుతూ వచ్చింది. గత వారం విచారణ ముగిసింది. తీర్పును బెంచ్ వాయిదా వేసింది.
 
 చట్టం రద్దు : బుధవారం న్యాయమూర్తులు తీర్పును వెలువరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చే తీర్పును ఇవ్వడంతోపాటుగా రూ. 20 వేలు జరిమానా విధించారు. రాష్ట్రంలో న్యాయ విద్యను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ, కొత్త కళాశాలలు, ప్రైవేటు న్యాయ కళాశాలల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఎనిమిది సంవత్సరాలుగా దరఖాస్తును పరిశీలనలో ఉంచి, జాప్యం చేసినందుకు గాను రూ. 20 వేలు జరిమానా విధిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని  వన్నియర్ విద్యా ట్రస్టుకు చెల్లించాలని సూచించారు. కొత్త కళాశాలల ఏర్పాటుకు తగ్గ దరఖాస్తులను పరిశీలించి, అన్ని రకాల సౌకర్యాలు, విద్యా పరంగా చేపట్టాల్సిన ఏర్పాట్ల మేరకు అనుమతుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement