ప్లే స్కూల్స్ ఆటకట్టు | Sakshi
Sakshi News home page

ప్లే స్కూల్స్ ఆటకట్టు

Published Fri, Aug 15 2014 12:02 AM

ప్లే స్కూల్స్ ఆటకట్టు - Sakshi

 చెన్నై, సాక్షి ప్రతినిధి: అనధికారికంగా వెలసిన ప్లేస్కూల్స్ ఆటకట్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్లేస్కూల్స్ పేరుతో పెద్దమొత్తంలో సొమ్ము చేసుకుంటున్న అనుమతిలేని పాఠశాలలను జనవరిలోగా మూయిస్తామని మద్రాసు హైకోర్టుకు గురువారం ప్రభుత్వం హామీ ఇచ్చింది. అధికారిక చర్యల్లో భాగంగా వాటికి వెంటనే సంజాయిషీ నోటీసులు జారీచేస్తామని చెప్పింది. ప్రస్తుత సమాజంలో విద్య ఒక వ్యాపారంగా మారిపోయింది. రెండు గదులుంటే చాలు అదో పాఠశాలగా మార్చివేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వేలాది ప్లేస్కూళ్లు వెలిశాయి. వాటిల్లో అనేకం అనధికార స్కూల్స్‌గా ఆరోపణలు వచ్చాయి.
 
 ప్లేస్కూల్ ఉన్న ప్రాంతాన్ని బట్టి ఒక్కో విద్యార్థి నుంచి రూ.30వేలు మొదలుకుని రూ.50వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ ఫీజులకు తగినట్లుగా పాఠశాలల్లో ప్రాథమిక, మౌళిక సదుపాయాలు లేవ ంటూ సీనియర్ న్యాయవాది సుబ్రమణియన్ రెండు నెలల క్రితం మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వాజ్యం గత నెలలో విచారణకు వచ్చింది. నెలరోజుల్లోగా బదులివ్వాల్సిందిగా హైకోర్టు అదేశించింది. ఇందులో భాగంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి ఎమ్.సత్యనారాయణన్ వద్దకు గురువారం విచారణకు వచ్చింది. ప్రాథమిక విద్య డెప్యూటీ డైరక్టర్ సెల్వరాజ్ పిల్‌లో చేసిన ఆరోపణలకు బదులిచ్చారు. ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా వెలసిన ప్లే స్కూల్స్‌పై అన్నిరకాల చర్యలను తీసుకోవాలని కింది స్థాయి అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
 
 సెప్టెంబర్ 14వ తేదీలోగా వారందరికీ సంజాయిషీ నోటీసులు జారీచేయాలని, అక్టోబర్ 15వ తేదీలోగా బదులిచ్చేలా చూడాలని ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. నవంబర్ 30వ తేదీలోగా ఆయా పాఠశాలల నిర్వాహకులను హాజరుపరిచి తమ అధికారులు విచారిస్తారని చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీలోగా అనధికార ప్లేస్కూల్స్‌పై ఏమి చర్యలు తీసుకోవాలో నిర్ణయించుకుంటామని ఆయన కోర్టుకు విన్నవించుకున్నారు. 2011-12 విద్యా సంవత్సరంలో 1459 అనధికార ప్లేస్కూల్స్ ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. డెప్యూటీ డైరక్టర్ వాదనను కోర్టు రికార్డు చేసింది. అక్రమంగా వెలసిన ప్లేస్కూల్స్‌పై చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం ప్రకటించిన కారణంగా ఈ కేసుకు ముగింపు పలుకుతున్నట్లు న్యాయమూర్తులు ప్రకటించారు.
 

Advertisement
Advertisement