Sakshi News home page

చెత్త లేని చెన్నై

Published Fri, Jan 30 2015 12:59 AM

Mayor Saidai Duraisamy Waste Removal

చెత్త రహిత చెన్నైని తీర్చిదిద్దనున్నట్టు కార్పొరేషన్ మేయర్ సైదై దురై స్వామి తెలిపారు. చెత్త తొలగింపు వేళల్లో మార్పులు చేసి, పర్యవేక్షణకు అధికారుల బృందాన్ని, వేప నూనెతో దోమల నివారణకు చర్యలు చేపట్టనున్నామన్నారు. దీంతో మేయర్ ఆచరణ సాధ్యం కాని ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీఎంకే సభ్యులు కార్పొరేషన్ మీట్ నుంచి వాకౌట్ చేశారు.
 
 సాక్షి, చెన్నై :చెన్నై కార్పొరేషన్ పాలక మండలి సమావేశం గురువారం రిప్పన్ బిల్డింగ్‌లో జరిగింది. మేయర్ సైదై దురై స్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కమిషనర్ విక్రమ్ కపూర్, డెప్యూటీ మేయర్ బెంజమిన్ నేతృత్వం వహించారు. సభ ఆరంభం కాగానే, అమ్మ  జయలలిత జపాన్ని మేయర్ అందుకున్నారు. తమ అధినేత్రి జయల లిత బర్త్‌డేను కాలుష్య రహిత దినోత్సవంగా జరుపుకునేం దుకు నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా చెన్నై మహానగరాన్ని చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దబోతున్నామని ప్రకటించారు. ఇది వరకు ఉదయం ఆరున్నర గంటల నుంచి పదిన్నర గంటల వరకు, మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి ఐదున్నర గంటల వరకు నగరంలో చెత్త తొలగిస్తున్నారని గుర్తు చేశారు. ఈ వేళల్లో మార్పులు చేస్తున్నామని పేర్కొంటూ, ఇక ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చెత్త తొలగించనున్నట్లు చెప్పారు. చెత్త తొలగింపుల్లో నిమగ్నమయ్యే కార్మికులు కార్యాలయాలకు రావాల్సిన పని లేదని, నేరుగా విధులకు వెళ్లొచ్చని సూచించారు.
 
 చెత్త తొలగింపు ప్రక్రియను పరిశీ లించేందుకు వార్డు ఒకరు చొప్పున 200 వార్డులకు గాను 200 మంది ప్రత్యేక అధికారులను నియమించనున్నామని అన్నారు. మండలానికి ఒక ఐఏఎస్ అధికారి చొప్పున 15 మంది అధికారుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ సాగుతుందని వివరించారు. అధికారులు, కౌన్సిలర్లు తప్పని సరిగా తమ వార్డుల పరిధుల్లోని ప్రాంతాల్లో ప్రతి రోజు పర్యటించాల్సిందేనని, ఎక్కడైనా సరే చెత్త కనిపిస్తే చాలు తక్షణం ఆ ప్రాంత సిబ్బందిని హెచ్చరించి పనులు చేయించాలని హుకుం జారీ చేశారు. డీఎంకే వాకౌట్ : చెత్త రహిత నగరంగా చెన్నైను తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేసిన మేయర్ దోమల నివారణపై వ్యాఖ్యలు డీఎంకే సభ్యులను విస్మయానికి గురి చేశాయి.
 
 చెన్నై నగరాన్ని దోమల రహిత నగరంగా తీర్చిదిద్దామని, డెంగీ, మలేరియా వంటి వ్యాధుల్ని సమూలంగా తరిమి కొట్టామంటూ మేయర్ ప్రసంగిస్తున్న సమయంలో డీఎంకే సభ్యుడు సుభాష్ చంద్రబోస్ కలుగ చేసుకున్నారు. దోమల రహిత నగరంగా చెన్నైను ఎక్కడ తీర్చిదిద్దారో స్పష్టం చేయాలని, వ్యాధుల్ని ఎలా తరిమి కొట్టారోనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నగరంలో దోమలు స్వైర విహారం చేస్తున్నాయని, రోగాల బారిన జనం పడిన ఆస్పత్రుల్లో చేరుతున్నారంటూ ధ్వజమెత్తారు. దీంతో ఆయన మైక్ మూగ బోయింది. మళ్లీ ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దీంతో డీఎంకే సభ్యుల్లో ఆగ్రహం రేగింది. మేయర్ తీరును నిరసిస్తూ, ఆచరణకు సాధ్యం కాని ప్రకటనలు చేస్తున్నారని మండి పడుతూ సభ నుంచి వాకౌట్ చేశారు.
 
 వేప నూనెతో దోమల నివారణ
 డీఎంకే సభ్యుల వాకౌట్ అనంతరం మళ్లీ ప్రసంగాన్ని అందుకున్న మేయర్ దోమల సమూల నిర్మూలనకు వేప నూనెను, మూలికలను ప్రయోగించబోతున్నామని, ఇందుకు తగ్గ సరికొత్త పథకాన్ని త్వరలో ప్రవేశ పెడుతున్నామని ప్రకటించడం గమనార్హం. దోమలను నియంత్రించడం వల్లే, గతంలో కంటే, ఈ ఏడాది డెంగీ, మలేరియా వంటి వ్యాధుల్ని చెన్నై నుంచి తరిమి కొట్టామన్న విషయాన్ని ప్రతి పక్షాలు గుర్తెరగాలని హితవు పలికారు. దోమల నివారణకు 11 లక్షల నొచ్చి మొక్కలు నాటేందుకు నిర్ణయించామని పేర్కొంటూ, ఇప్పటి వరకు రెండు లక్షల మొక్కలు నాటినట్లు వివరించారు. రసాయన మందులతో దోమల్ని సమూలంగా నాశనం చేయడం సాధ్య పడటం లేదని, ఈ దృష్ట్యా, వేప నూనె, మూలికల్ని ప్రయోగించేందుకు నిర్ణయించామన్నారు. ఇందుకు తగ్గ పరిశోధనల్ని వేగవంతం చేశామన్నారు. కార్పొరేషన్ పాఠశాల్లో పది, ప్లస్‌టూ పరీక్షల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచే విద్యార్థులను ప్రోత్సహించే విధంగా రూ.8, రూ.9, రూ.10 వేలు చొప్పున ప్రోత్సాహక నగదు ఇవ్వనున్నామని ప్రకటించారు.  
 

Advertisement
Advertisement