స్థానిక ‘ఉప’ నగారా | Sakshi
Sakshi News home page

స్థానిక ‘ఉప’ నగారా

Published Thu, Aug 28 2014 11:43 PM

Mayors of corporations, 8 municipalities by elections in Chennai

 సాక్షి, చెన్నై : స్థానిక సంస్థల ఉప సమరానికి గురువారం నగారా మోగింది. మూడు కార్పొరేషన్లకు మేయర్లు, 8 మునిసిపాలిటీల చైర్మన్లతోపాటుగా మరో వెయ్యి పదవుల నామినేషన్ల పర్వానికి శ్రీకారం చుట్టారు. సెప్టెంబరు 18న ఉప ఎన్నిక జరగనున్నది. రాష్ర్టంలోని తిరునల్వేలి కార్పొరేషన్ మేయర్ విజిలా సత్యానందన్, తూత్తుకుడి మేయర్ శశికళ పుష్ప ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఎంపీలుగా బాధ్యతలు చేపట్టిన వీరు మేయర్ పదవులకు రాజీనామా చేశారు. కోయంబత్తూరు మేయర్ సేమా వేలుస్వామి పార్టీ అధినేత్రి జయలలిత ఆగ్రహానికి గురై పదవిని కోల్పోవాల్సి వచ్చింది. దీంతో మూడు కార్పొరేషన్లకు మేయర్ల పదవులు ఖాళీ ఏర్పడ్డాయి. మంత్రి కరుప్పు స్వామి మరణంతో శంకరన్ కోవిల్ మునిసిపాలిటీ చైర్మన్‌గా ముత్తు సెల్వి ఎన్నికయ్యూరు.
 
 పుదుకోట్టై ఉప ఎన్నిక ఆ మునిసిపాలిటీ చైర్మన్  కార్తిక్ తొండైమాన్ గెలిచారు. అరుుతే ముత్తుసెల్వి, కార్తిక్ తొండైమాన్‌లు ఎమ్మెల్యేగా అసెంబ్లీ మెట్లు ఎక్కారు. దీంతో ఈ రెండు మునిసిపాలిటీలకు చైర్మన్ పదవులు ఖాళీ అయ్యాయి. కడలూరు మునిసిపల్ చైర్మన్ సుబ్రమణ్యం సీఎం జయలలిత ఆగ్రహానికి గురి కాక తప్పలేదు. రామనాథపుర ం, విరుదాచలం, అరక్కోణం, కొడెకైనాల్, కున్నూరు, మునిసిపాలిటీలకు చైర్మన్ పదవులు ఖాళీ ఏర్పడ్డాయి. వీటితో పాటుగా పట్టణ పంచాయతీలు, యూనియన్ పంచాయతీల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, వార్డు మెంబర్ల పదవులు వెయ్యి వరకు ఖాళీ ఏర్పడి ఉన్నాయి. ఈ పదవుల భర్తీకి ఉప ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం చర్యలు చేపట్టింది.
 
 నగారా :  మూడు మేయర్లు, 8 మునిసిపాలిటీ చైర్మన్లు, మరో వెయ్యి పదవుల భర్తీకి ఉప ఎన్నికల నగారా గురువారం మోగింది. గురువారం నుంచి నామినేషన్లను స్వీకరించే పనిలో ఆయా కార్పొరేషన్ల కమిషనర్లు, మునిసిపాలిటీల కమిషనర్ల నేతృత్వంలోని ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టారు. నామినేషన్లను సెప్టెంబరు నాలుగో తేదీ వరకు స్వీకరించనున్నారు. సెప్టెంబరు 18న ఉప ఎన్నిక, 22న ఫలితాల లెక్కింపునకు నిర్ణయిస్తూ రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం ప్రకటించింది. నగారా మోగడంతో నామినేషన్ల సమర్పణలో ఆయా ప్రాంతాల్లోని నాయకులు నిమగ్నమయ్యారు.
 
 వార్డు పదవుల నిమిత్తం స్థానికంగా ఉండే నాయకులు పోటీలు పడుతున్నా, మేయర్లు, మునిసిపల్ చైర్మన్ల పదవులకు ఆయా పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించేనా అన్నది వేచి చూడాల్సి ఉంది. ఈ  ఉప ఎన్నికను ఇతర పార్టీలు బహిష్కరించిన పక్షంలో అధికార అన్నాడీఎంకే అభ్యర్థులు ఏకగ్రీవాలు అయ్యే అవకాశాలు ఎక్కువే. మేయర్ల పదవులు, చైర్మన్ల పదవులకు తమనంటే తమను అభ్యర్థిగా జయలలిత ప్రకటిస్తారన్న ఆశాభావంతో ఆయా ప్రాంతాల్లోని అన్నాడీఎంకే నాయకులు ఎదురుచూపుల్లో పడ్డారు. ఇది వరకు ఓ రోజు రాత్రికి రాత్రి ఉప సమరం నోటిఫికేషన్‌ను వెలువరించి ఉదయాన్నే రద్దు చేసిన విషయం తెలిసిందే.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement