ఇంజెక్షన్‌ వేయడం రాదన్న ప్రభుత్వ వైద్యురాలు | Sakshi
Sakshi News home page

ఎంబీబీఎస్‌... ఏమిటి లాభం?

Published Thu, Dec 21 2017 6:32 AM

mbbs doctor said i don't know how to injection - Sakshi

ఈ వ్యవహారం తెలిస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే. ఎంబీబీఎస్‌ పూర్తిచేసి, నాలుగేళ్లుగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టరమ్మకు సూది వేయడం తెలియదట. ఎప్పు డూ సూదే వేయలేదట. ఎక్కడో మారుమూల కుగ్రామంలో కాదు.. రాజధానికి కూతవేటు దూరంలోనే ఈ వింత వెలుగుచూసింది.

దొడ్డబళ్లాపురం: ‘నాకు ఇంజెక్షన్‌ చేయడం రాదు. రేపు రండి. ఇవాళ నర్స్‌ రాలేదు. ఇంజక్షన్‌ ఎంతివ్వాలి, ఎలా ఇవ్వాలో నిజంగా నాకు తెలియదు.’ ఇలా అన్నది ఏ ప్రైవేట్‌ ఆస్పత్రి డాక్టరో, రోడ్డుపక్కన క్లినిక్‌ నడుపుకునే ఆర్‌ఎంపీనో కాదు. సాక్షాత్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నియమించిన ఎంబీబీఎస్‌ డాక్టరు.

బెంగళూరు సమీపంలో దేవనహళ్లి తాలూకా కొయిరా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రి వైద్యురాలు రశ్మి ఇంజక్షన్‌ చేయడం రాదని రోగులకు చెప్పడంతో పెద్ద గందరగోళమే రేగింది. సోమవారంనాడు గ్రామంలోని చిక్కేగౌడ నాలుగేళ్ల కూతురికి కుక్క కరిచింది. కూతురికి ఇంజెక్షన్‌ ఇప్పిద్దామని ప్రభుత్వాస్పత్రికి వచ్చాడు. అయితే డాక్టర్‌ రశ్మి తనకు సూది వేయడం రాదని, అందులోనూ కుక్క కరిచిన వారికి ఇంతవరకూ సూది వేయలేదని చెప్పారు. నర్స్‌ ఈరోజు రాలేదు..రేపు రండి అని చెప్పారు.

రెండోరోజూ అదే తంతు
మళ్లీ మంగళవారం కూతురిని తీసుకుని చిక్కేగౌడ ఆస్పత్రికి వెళ్లాడు. ఈసారి సూది వేయాల్సిందేనని చిక్కేగౌడ పట్టుబట్టడంతో డాక్టర్‌ రశ్మి ఏడుపు అందుకున్నారు. తాను ఇంతవరకూ ఎప్పుడూ ఇంజెక్షన్‌ చేయలేదని, మోతాదు వివరాలు కూడా తెలియవని చెప్పారు. ఆస్పత్రిలో ఇన్నాళ్లూ నర్సే ఇంజెక్షన్లు వేస్తోందని చెప్పడంతో చిక్కేగౌడ బిత్తరపోయాడు. ఇలా మంగళవారం కూడా ఆస్పత్రికి వచ్చిన రోగులను వెనక్కు పంపడం జరిగింది. చిక్కేగౌడ గ్రామస్తులకు విషయం చెప్పడంతో గ్రామస్తులంతా కలిసి ఆస్పత్రి ముందు బైఠాయించి వైద్యం చేయడం రాని డాక్టర్‌ను తక్షణం బదిలీ చేయాలని డిమాండు చేస్తూ ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న డీహెచ్‌ఓ రాజేశ్, పూర్తి వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటానని ఫోన్‌ ద్వారా హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. డాక్టర్‌ రశ్మి గత నాలుగేళ్లుగా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది.  

Advertisement
Advertisement