బూజు దులిపారు | Sakshi
Sakshi News home page

బూజు దులిపారు

Published Mon, Sep 8 2014 1:46 AM

బూజు దులిపారు

  • తొలిసారిగా ఆదివారం విధులకు హాజరైన ప్రభుత్వ ఉద్యోగులు
  •   మూడేళ్లుగా పేరుకుపోయిన రెండు లక్షల ఫైళ్లు
  •   ఒక్క రోజులోనే 50 వేల ఫైళ్లు పరిష్కారం
  • సాక్షి ప్రతినిధి, బెంగళూరు : వినడానికి ఆశ్యర్యమనిపించినా ఇది నిజం. ఆదివారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవైనప్పటికీ, రాష్ర్ట సచివాలయం...విధాన సౌధ, వికాస సౌధతో పాటు ఎంఎస్ బిల్డింగ్‌లోని కార్యాలయాన్నీ పని చేశాయి. ఏళ్ల తరబడి గుట్టలుగా పేరుకుపోయిన ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించడానికి ఆదివారం కూడా పని చేయాలని గత మంత్రి వర్గ సమావేశంలో చేసిన తీర్మానం మేరకు వివిధ శాఖల అధికారులు ఆ ‘యజ్ఞం’లో నిమగ్నమయ్యారు.

    ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీ ఫైళ్ల పరిష్కార పనులను పర్యవేక్షించారు. రెవెన్యూ, ఆరోగ్య, విద్య, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, సహకార శాఖల అధికారులు ఫైళ్ల బూజు దులిపి, పరిష్కరించే పనిలో నిమగ్నమయ్యారు. పాలనా సంస్కరణలు, సిబ్బంది వ్యవహారాల శాఖ అధికారులు కూడా హాజరయ్యారు. గతంలో ఫైళ్ల సత్వర పరిష్కారానికి ఎన్నో కార్యక్రమాలను చేపట్టినా, ఆదివారం పని చేయడం ఇదే తొలిసారని చెబుతున్నారు.

    వివిధ శాఖల్లో అనేక ఫైళ్లు మూడేళ్ల నుంచి పెండింగ్‌లో పడి ఉన్నాయి. ఇలాంటి ఫైళ్లు సుమారు రెండు లక్షల వరకు ఉండవచ్చని అంచనా. పెండింగ్ ఫైళ్ల విషయంలో రెవెన్యూ, విద్యా శాఖలు ప్రథమ స్థానంలో ఉన్నాయి. దీని వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కన్నెర్ర చేశారు. ఆదివారం అని కూడా చూడకుండా ఫైళ్లను శీఘ్రగతిన పరిష్కరించాలని ఆయన అధికారులను ఇదివరకే ఆదేశించారు.
     
    50 వేల ఫైళ్ల పరిష్కారం

    ఆదివారం ఉదయం నుంచి సాయంత్రానికి సుమారు 50 వేల ఫైళ్లు పరిష్కారానికి నోచుకున్నాయని కౌశిక్ ముఖర్జీ తెలిపారు.  ప్రజలకు సంబంధించిన అత్యవసర ఫైళ్లను 48 గంటల్లోగా పరిష్కరించాలని అధికారులకు సూచించామని చెప్పారు. నిర్ణీత గడువులోగా ఫైళ్లను పరిష్కరించని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. న్యాయ స్థానాల్లో విచారణ దశలో ఉన్న వ్యవహారాలకు సంబంధించినవి మినహా, మిగిలిన అన్ని ఫైళ్లను పరిష్కరిస్తామని వివరించారు. వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల ఫైళ్లు పేరుకు పోతున్నాయని చెప్పారు. ఏదేమైనా మరో రెండు రోజుల్లో పెండింగ్ ఫైళ్లను పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు.
     

Advertisement
Advertisement