సమావేశానికి గైర్హాజరైన అధికారులపై మంత్రి ఆగ్రహం | Sakshi
Sakshi News home page

సమావేశానికి గైర్హాజరైన అధికారులపై మంత్రి ఆగ్రహం

Published Sat, Dec 14 2013 3:25 AM

minister fires on  leaders

 సాక్షి, బళ్లారి : జిల్లా ప్రగతి పరిశీలన సమావేశానికి ఉన్నత స్థాయి అధికారులు రాకుండా కింది స్థాయి అధికారులు హాజరు కావడంతో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరమేశ్వర నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా పంచాయతీ నజీర్ సభాంగణంలో జిల్లా ప్రగతి పరిశీలన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా పంచాయతీ అధ్యక్షురాలు బెండగేరి శోభ, ఉపాధ్యక్షురాలు మమతా సురేష్, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. సమావేశానికి జిల్లాలోని అన్ని శాఖలకు చెందిన ఉన్నత స్థాయి అధికారులు హాజరు కావాల్సి ఉండగా, కొందరు కిందిస్థాయి అధికారులను పంపారు. ఆ అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
  ఉన్నత స్థాయి అధికారులు రాకుండా కింది స్థాయి అధికారులు హాజరైతే గత సమావేశంలో జరిగిన చర్చలకు ఎవరు సమాధానం ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్యకు బాగో లేదని, తనకే జ్వరం వచ్చిందని, ఇతర ముఖ్యమైన పని ఉందని ఇలా రకరకాల సమస్యల కారణంగా హాజరు కాలేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే మంత్రి జోక్యం చేసుకుని సంబంధిత ఉన్నతస్థాయి అధికారులు తప్ప మిగిలిన వారంతా సమావేశం నుంచి బయటకు వెళ్లాలని ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పని చేసి జిల్లాను సమగ్రాభివృద్ధి చేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో అధికారులు ఎందుకు సఖ్యతగా ఉండటం లేదని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులతో కలిసి మెలిసి పని చేస్తేనే గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చేసేందుకు వీలవుతుందన్నారు. అలా కాకుండా ఎవరికి వారు పని చేయడంతో అభివృద్ధి సాధ్యం కాదన్నారు.
 
  ఒక్కో రేషన్ కార్డు (బీపీఎల్)కు రూ.3 వేలు తీసుకుని కార్డులు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని, వీటిని ఎందుకు నియంత్రించడం లేదని సంబంధిత ఉన్నతాధికారి మంటెస్వామిని ప్రశ్నించారు. దీనికి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మాట్లాడుతూ తమ శాఖ కార్యాలయంలో దళారులు ఎవరూ లేరని, పారదర్శకంగా పేదలకు కార్డులను అందజేస్తున్నామన్నారు. ఎవరైనా డబ్బులు తీసుకుంటున్నట్లు తన దృష్టికి తీసుకుని వస్తే కఠిన చ ర్యలు తీసుకుంటానని సమాధానమిచ్చారు. జిల్లా వ్యాప్తంగా 105 రేషన్‌షాపులు మంజూరయ్యాయని ఆయా తాలూకాలు, పట్టణాలు, గ్రామాలకు అర్హులను ఎంపిక చేస్తామన్నారు. బీపీఎల్ కార్డులకు డబ్బులు తీసుకుని కార్డులు అందజేస్తున్నారని, మళ్లీ నా దృష్టికి వస్తే సంబంధిత అధికారులే బాధ్యత వహించాలని మంత్రి హెచ్చరించారు.
 
  పేదల కోసం రూ.1 కేజీ బియ్యం ప్రభుత్వం అందజేస్తుంటే అదే పేదల నుంచి కార్డుకు రూ.3 వేలు తీసుకోవడం సరి కాదన్నారు. జిల్లాలో అంటు వ్యాధులు ప్రబలకుండా సంబంధిత అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. మంచినీటి సమస్య తీర్చేందుకు నిధుల కొరత లేదని, అధికారులు జిల్లాలో వేసవిలో మంచినీటి సమస్య పరిష్కరించేందుకు సవాల్‌గా తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ మృత్యుంజయ జినగ జోక్యం చేసుకుని జిల్లాలో చేళ్లగుర్కి గ్రామంలో బిందె మంచి నీరు రూ.10లు పెట్టి కొనుగోలు చేసుకుంటున్నారని, కుడితిని, మించేరి గ్రామాలతోపాటు బళ్లారి నగరానికి మంచినీరు అందించే అల్లీపురం రిజర్వాయర్‌కు పూర్తి స్థాయిలో మరమ్మతు పనులు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బళ్లారికి నీరందించే అల్లీపురం రిజర్వాయర్ 7.5 మీటర్లు నీరు ఉండాల్సి ఉండగా, ఐదు మీటర్లు మాత్రమే ఉందని, నీటి సమస్య ఎలా తీరుస్తారని మంత్రిని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి బళ్లారి నగరానికి దాహార్తి తీర్చాలన్నారు.
 
 ఎమ్మెల్యేలు నాగరాజు, భీమానాయక్‌లు మాట్లాడుతూ జిల్లాలో పలు అభివృద్ధి పనులు వేగవంతంగా జరగడం లేదని గుర్తు చేశారు. నిర్ణీత గడువు లోపు అభివృద్ధి పనులు పూర్తి చేయకపోతే సంబంధిత కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టాలని మంత్రికి సూచించారు. వెంటనే మంత్రి కలగజేసుకుని ఇందులో అధికారులది తప్పా? లేక కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా? అనేది తెలుసుకుని చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రగతి పరిశీలన సమావేశంలో చర్చించిన అభివృద్థి పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులతో సఖ్యతతో నడుచుకుంటూ జిల్లాను అభివృద్ధి పరచాలనే కనీస జ్ఞానం అధికారులకు ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మంచినీటి సమస్య తీర్చడంతో పాటు కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించి వలసలు వెళ్లకుండా నివారించాలన్నారు. పశువులకు మేత కొరత రాకుండా, ఆయా ప్రాంతాల్లో గడ్డి కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా ఈ జిల్లా నుంచి ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు గడ్డిని సరఫరా కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులకు అధికారులు దూరంగా ఉంటే పనులు జరగవని హెచ్చరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement