తంబాకు నిషేధానికి అన్ని పార్టీలు సహకరించాలి | Sakshi
Sakshi News home page

తంబాకు నిషేధానికి అన్ని పార్టీలు సహకరించాలి

Published Sun, Feb 22 2015 3:39 AM

తంబాకు నిషేధానికి అన్ని పార్టీలు సహకరించాలి - Sakshi

సాక్షి, ముంబై: గుట్కా, తంబాకుపై నిషేధం విధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నించాలని ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్ పిలుపునిచ్చారు. ఎన్సీపీ ఆధ్వర్యంలో ముంబైలోని కేసీ కాలేజీలో దివంగత నేత ఆర్‌ఆర్ పాటిల్ సంతాప సభను శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఈ సభలో శరద్ పవార్‌తోపాటు ఏక్‌నాథ్ ఖడ్సే, దివాకర్ రావుతే, శివాజీరావ్ దేశ్‌ముఖ్, మాణిక్‌రావ్ ఠాక్రే, నారాయణరాణే, రామ్‌దాస్ ఆఠవలే, రాజేంద్ర గవయి, మెరాజ్ సిద్దికీ, కపిల్ పాటిల్ తదితర ప్రముఖ నాయకులందరు హాజరయ్యారు. నేతలందరూ పాటిల్‌కు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా శరద్‌పవార్ మాటాలడుతూ, పాటిల్ గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్రంలో కీలకనాయకునిగా ఎదిగారని చెప్పారు. మచ్చలేని నాయకుడైన ఆర్ ఆర్ పాటిల్ లేనిలేటు పూరించలేనిదని అన్నారు. పాటిల్ లేకపోవడంతో ఎన్సీపీలో అగాథం ఏర్పడిందన్నారు. పాటిల్‌తో తనకున్న అనుబంధంపై కొన్ని ఆసక్తికరమైన విషయాలను పవార్ సభికులతో పంచుకున్నారు. పాటిల్ మరణానికి కారణం తంబాకు అని, రాష్ట్రంలో పొగాకు సేవనంపై నిషేధం తెచ్చేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకమవ్వాలని శరద పవార్ పేర్కొన్నారు.
 
గ్రామీణప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ద వహించారు
ఆర్ ఆర్ పాటిల్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, అక్కడి ప్రజల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారని రెవెన్యూశాఖ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే పేర్కొన్నారు. దీంతో అనేక మంది మనస్సులో ఆబా (ఆర్ ఆర్‌పాటిల్) ఉన్నారన్నారు. పోలీసు శాఖలో భర్తీలు చేపట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించిన ఘనత ఆయనదేనన్నారు. గ్రామీణ స్థాయిలో అన్ని కోణాల్లో ఆలోచించే వ్యక్తిత్వం ఆబాది అని పేర్కొన్నారు. ఎంఎస్‌ఆర్‌టీసీ స్వచ్ఛత అభియాన్‌ను ఆబాను ప్రజెంట్ చేయాలని ఉంద ని శివసేన నాయకుడైన రవాణ శాఖమంత్రి దివాకర్ రావుతే   పేర్కొన్నారు. అయితే దీనికోసం అనుమతులు అవసరం ఉంటుందన్నారు.
 
క్యాన్సర్ వైద్యం కోసం ఓ ట్రస్ట్ ఏర్పాటు చేయాలి...
ఆర్‌పీఐ నేత రామ్‌దాస్ ఆఠవలే మాట్లాడుతూ మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ తార తెగిపోయిందని పేర్కొన్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న పేదల వైద్యం కోసం ఆర్ ఆర్ పాటిల్ పేరున  అన్ని పార్టీల నాయకులు ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. స్పీకర్‌శివాజీరావ్ దేశ్‌ముఖ్ ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు.
 
తంబాకు సేవనం మానేసిన ఎన్సీపీ నాయకులు.
ఆర్ ఆర్ పాటిల్ మరణానంతరం ఒక్కసారిగా తంబాకుపై నిషేధం విధించాలనే డిమాండ్ ముందుకు వచ్చింది. ఆర్ ఆర్ పాటిల్ తరచు తంబాకు సేవించేవారు. దీంతో ఆయనకు నోటి క్యాన్సర్ వచ్చింది. ఈ వ్యాధి కారణంగానే ఆయన మరణించారు. దీంతో ఆర్ ఆర్ పాటిల్‌కు నివాళిగా ఎన్సీపీ నాయకులందరు తంబాకు సేవనం మానేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆబాకు పలుమార్లు తంబాకు సేవనం మానేయాలని అనేక మంది సలహా ఇచ్చారు. దీంతో ఆయన కొంత కాలం తంబాకు నమలటం మానేశారని, కానీ మళ్లీ సేవనం ప్రారంభించడంతోనే మరణాన్ని కొని తెచ్చుకున్నారని ఎన్సీపీ నేతలు అభిప్రాయపడ్డారు.
 
తంబాకు మానేస్తున్నా: మంత్రి
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధిశాఖ మంత్రి ప్రకాష్ మెహతా ఆర్ ఆర్ పాటిల్‌కు నివాళిగా తాను గుట్కా తినడం మానేస్తున్నట్టు ప్రకటించారు. ‘‘ఆబా నేను ఇద్దరం తంబాకు సేవించేవాళ్లం, అయితే ఆయనను పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ఆబా నాతో తంబాకు, గుట్కాలు సేవించడం మానేయాలని ఒట్టేయించుకున్నారు’’ అని ప్రకాష్ మెహతా చెప్పారు. దీంతో తాను ఆయనకు నివాళిగా తంబాకు మానేస్తున్నట్టు ప్రకటించారు.

Advertisement
Advertisement