Sakshi News home page

కళ తప్పిన మంత్రాలయ

Published Thu, Mar 6 2014 10:52 PM

ministers not came to secretariat due to election code implement

సాక్షి, ముంబై: ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రాష్ట్ర పాలనకు కేంద్ర బిందువైన మంత్రాలయ బోసిపోయింది. రాష్ర్టంలో 48 లోక్‌సభ నియోజకవర్గాలకు మూడు దశల వారీగా ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మంత్రాలయవైపు మంత్రులు రావడం మానేశారు. గురువారం మంత్రాలయ పరిసరాలు బోసిపోయి కనిపించాయి. ఎన్నికల షెడ్యూల్‌ప్రకటించే అవకాశాలున్నాయని తెలుసుకున్న మంత్రులు ఇప్పటికే తమ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నారు. బుధవారం సాయంత్రం కేబినెట్ సమావేశం జరగాల్సి ఉన్నా రద్దు చేశారు.

దీనికితోడు రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం ఔరంగాబాద్‌కు రావడంతో అక్కడికి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తోపాటు కీలక శాఖల మంత్రులు కూడావెళ్లారు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తన కార్యక్రమాలన్ని రద్దుచేసుకుని మంత్రాలయకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండేందుకు ఇష్టపడ్డారు. లోక్‌సభ ఎన్నికలు ఫలితాలు వెలువడేంత వరకు మంత్రాలయలో పరిస్థితులు ఇలాగే కొనసాగుతాయని భద్రతా సిబ్బంది పేర్కొన్నారు.  

 బోసిపోయిన సందర్శకుల పాస్ కౌంటర్‌లు...
 వివిధ పనుల కోసం రాష్ట్రం నలుమూలల నుంచి నిత్యం వందలాది మంది మంత్రులతో భేటీ అయ్యేందుకు మంత్రాలయానికి వస్తుంటారు. అయితే ఎన్నికల కోడ్ కూయడంతో గురువారం మంత్రాలయ భవనం ప్రధాన ప్రవేశద్వారం వద్ద విజిటర్స్ పాస్‌లు జారీచేసే కౌంటర్లు బోసిపోయి కనిపించాయి. నిత్యం జనం రాకపోకలతో కిటకిటలాడే మంత్రాలయ పరిసరాల్లో గురువారం ఏమాత్రం రద్దీ కనిపించలేదు. తనిఖీ, భద్రతా సిబ్బందిని కూడా తగ్గించారు. మంత్రులు లేక క్యాబిన్లు, చాంబర్లు, బయట కుర్చీలన్నీ వెలవెలబోయాయి. మంత్రాలయ భవన్‌లోని ఆరు అంతస్తుల్లో ఉద్యోగులు, గేట్ల వద్ద పోలీసులు కనిపించారు.

 బుగ్గ కారుతో జాగ్రత్త!
 ప్రభుత్వ అధికారులతోపాటు  బీఎంసీ ఉన్నతాధికారులపై ఎన్నికల కోడ్ ప్రభావం కనబడుతోంది. బుగ్గ (బెకాన్) కారులు కేవలం ఇంటి నుంచి కార్యాలయానికి వెళ్లడానికి మాత్రమే వినియోగించాలని అధికారులకి ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయనుంది. తమ వ్యక్తిగత పనులకు, రాజకీయ పార్టీ కార్యక్రమాలకు వెళ్లేందుకు బుగ్గవాహనాలను వాడరాదని హెచ్చరించనుంది. లేనిపక్షంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద వారిపై కేసులు నమోదుచేసే ప్రమాదం ఉంది.

 కోడ్ అమలులో ఉన్నంత కాలం వ్యక్తిగత పనులకు బుగ్గ వాహనాలు వినియోగించకూడదని మేయర్, సభాగృహం నాయకుడు, బీఎంసీ ప్రతిపక్షనాయకుడు, న్యాయ శాఖ, ప్రత్యేక కమిటీ అధ్యక్షులకి సూచించనున్నట్లు అదనపు కమిషనర్ మోహన్ అడ్తాని చెప్పారు. దీనిపై మేయర్ సునీల్ ప్రభు మాట్లాడుతూ మేయర్ బంగ్లా నుంచి బీఎంసీ ప్రధాన కార్యాలయం వరకు బుగ్గ వాహనాన్ని వాడతానని స్పష్టం చేశారు. సొంత పనులకు, రాజకీయ, ఇతర కార్యక్రమాలకు బెస్ట్ బస్సు, లోకల్ రైలులాంటి ప్రజా రవాణా వ్యవస్థను వినియోగిస్తానని స్పష్టం చేశారు. బీఎంసీకి చెందిన వివిధ శాఖల్లో ఉన్నతాధికారులుగా పనిచేస్తున్న ఉద్యోగులందరూ సాధ్యమైనంత వరకు బుగ్గ వాహనాలకు దూరంగా ఉండాలని సూచించారు.

Advertisement
Advertisement