ఆప్ వైపు మైనారిటీల చూపు.. | Sakshi
Sakshi News home page

ఆప్ వైపు మైనారిటీల చూపు..

Published Fri, Mar 7 2014 10:34 PM

minorities ready to give support to aam aadmi party

ముంబై: ‘ముస్లింలు చాలా కోపంగా ఉన్నారు.. తమను ప్రస్తుత సంప్రదాయ పార్టీలేవీ పట్టించుకోవడంలేదని, కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఓట్లతో అధికారంలోకి వచ్చిన పాలకవర్గాలు ఆ తర్వాత వారి అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను ఇన్నాళ్లుగా మోసం చేస్తూ వస్తోన్న పార్టీలకు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వారు తమ ఆగ్రహాన్ని రుచి చూపించేందుకు ఉవ్విళ్లూరుతున్నార’..ని ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. మహారాష్ట్రలో ఆప్‌కు ముస్లింలు వెన్నుదన్నుగా నిలుస్తారనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.

 ‘బీడ్, మరఠ్వాడా, ఒస్మానాబాద్‌లలో ముస్లింలు ఆప్‌కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మౌలానా లేదా మౌల్వీ ఆదేశాలను పాటించేందుకు ఎవరూ ఇష్టపడటంలేదు..’ అని  ఆప్ మరఠ్వాడా యూనిట్ ఇన్‌చార్జి, సమాజసేవకుడు, న్యాయవాది అయిన షకీల్ అహ్మద్ తెలిపారు.‘భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతూ వస్తున్నారు.. అయితే ఇప్పుడు వారి పరిస్థితి అప్పటికంటే ఇంకా అధ్వానంగా ఉంది..’ అని ఆయన వ్యాఖ్యానించారు. తుల్జాపూర్‌లోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్‌లో డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేస్తున్న అబ్దుల్ షాబన్ మాట్లాడుతూ అభివృద్ధికి సంబంధించిన అంశాలపైనే ప్రస్తుత ఎన్నికల్లో ముస్లింల డిమాండ్లు ఆధారపడి ఉంటాయని విశ్లేషించారు. ముస్లింల కోసం ముఖ్యమంత్రి వేసిన కమిటీలో సభ్యుడు కూడా అయిన షాబన్ ఇంకా మాట్లాడుతూ.. ‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత డీఎఫ్ ప్రభుత్వం మాత్రమే మొదటిసారి అభివృద్ధి అంశాల్లో ముస్లింలకూ చోటిచ్చింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల జీవన విధానాన్ని మెరుగుపరచడంలో విఫలమైందనే చెప్పొచ్చు.

 కేవలం కాంగ్రెస్‌పై కోపంతోనే ముస్లింలు ఆప్‌కు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓటే సేందుకు సిద్ధపడుతున్నారు..’ అని వివరించారు. ఆప్ జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యుడైన మయాంక్ గాంధీ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే సచార్ కమిటీ నివేదికను అమలులోకి తెస్తామని చెప్పారు. కొన్ని మతాల వారు తమ మాతృదేశంలోనే రక్షణ లేదని భావిస్తున్నారని ఆప్‌లో చేరిన సామాజిక కార్యకర్త సలీం అల్వారే చెప్పారు. ‘ఆప్ ముస్లింలను మభ్యపెట్టే ప్రకటనలేవీ చేయడంలేదు.. వారి అభివృద్ధికి హామీ ఇస్తూ తమ మానిఫెస్టోలో పలు పథకాలను పొందుపరిచింది..’ అని వివరించారు. బాంద్రా మురికివాడల్లో నివసించే ముస్లింలలో ఎక్కువమంది బీజేపీకి గాని, కాంగ్రెస్‌కు గాని ఓటేసేందుకు సిద్ధంగా లేరని పర్యావరణవేత్త సుమారియా అబ్దులాలీ చెప్పారు. కాగా, కాంగ్రెస్ హయాంలో ముస్లింలు అభివృద్ధి చెందలేదనే వాదనను ఆ పార్టీ నాయకులు తిప్పి కొడుతున్నారు.

 ఆ పార్టీ నేత యూసుఫ్ అబ్రహాని మాట్లాడుతూ.. గత 60 ఏళ్ల చరిత్ర పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీని మించిన లౌకిక పార్టీ ఏదీలేదనే విషయం అర్థమవుతుందన్నారు. తమ పార్టీ హయాంలోనే ముస్లింలకు ఎక్కువ రక్షణ లభిస్తోందని ఆయన వివరించారు. ముస్లింలు సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కూడా కాంగ్రెస్ పాలనలోనే ఎక్కువ లబ్ధిపొందారని వ్యాఖ్యానించారు. ఆప్‌ను ‘అబద్ధాల కోరు’గా ఆయన అభివర్ణించారు. ఆప్‌కు ఓటేయడమంటే బీజేపీకి ఓటేసినట్లేనని ఆయన హెచ్చరించారు. కాగా, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఖాదర్ చౌదరీ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ ఓటు బ్యాంక్‌లను కొల్లగొట్టడం ఆప్ వల్ల సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. తమపై ఆప్ ప్రభావం ఉండబోదని ఆయన జోస్యం చెప్పారు.

Advertisement
Advertisement