మళ్లీ సాగేనా? | Sakshi
Sakshi News home page

మళ్లీ సాగేనా?

Published Wed, Sep 7 2016 3:10 AM

మళ్లీ సాగేనా?

 ఆగిన ఏఎన్-32 గాలింపు
 అధికారుల సమాలోచన
 చివరి ప్రయత్నానికి పరిశీలన
 పరిశోధనకు 54 వస్తువులు
 
 సాక్షి, చెన్నై: బంగాళాఖాతంపై అదృశ్యమైన ఏఎన్-32 విమానం గాలింపు ప్రక్రియ ఆగింది. చివరి ప్రయత్నానికి మరోమారు గాలింపునకు అధికార వర్గాలు పరిశీలన సాగిస్తున్నాయి. చెన్నైలోని ఎన్‌ఐవోటీలో అధికార వర్గాలు తీవ్ర సమాలోచనలో మునిగి ఉన్నాయి. ఇందుకు తగ్గట్టుగా  మంగళవారం సంకేతాలు వెలువడ్డాయి. ఇప్పటి వరకు జరిపిన తనిఖీల్లో 54 రకాల వస్తువులు లభించినట్టు, అవి విమాన శకలాలేనా అన్నది నిర్ధారించేందుకు తగ్గట్టుగా పరిశోధనలు వేగవంతం చేశారు.చెన్నై తాంబరం ఎయిర్ బేస్ నుంచి అండమాన్ బయలు దేరిన భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమానం జూలై 22న బంగాళాఖాతంపై అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ విమానం సముద్రంలో గల్లంతై ఉండొచ్చన్న అనుమానాలు నెలకొన్నాయి.
 
  ఇందులో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెంది న వారితో పాటు 29 మంది ఆచూకీ సంబంధించిన ఆశలు అడియాశలు అయ్యాయి.  విమానం గల్లంతైనప్పుడు ఎయిర్ బేస్‌కు అందిన సమాచా రం ఆధారంగా చెన్నైకు 150 నాటికన్ మైళ్ల దూరంలో సముద్రంలో కుప్పకూలి ఉండొచ్చన్న సంకేతాలు బయలు దేరాయి. దీంతో ఆ పరిసరాల్లో 20 నౌకలు, 18 విమానాలు, హెలికాప్టర్లు గాలింపును తీవ్రంగానే కొనసాగిస్తూ వచ్చాయి. ఆపరేషన్ తలాష్ పేరుతో సాగిన గాలింపులో చిన్న ఆధారం కూడా చిక్కని దృష్ట్యా, బాధిత కుటుంబాల్లో ఆందోళన, ఆగ్రహం బయలు దేరింది. దీంతో అమెరికా సాయం కోరేందుకు తగ్గ ప్రయత్నాల్లో కేంద్ర రక్షణ శాఖ నిమగ్నమైందని చెప్పవచ్చు.
 
 అదే సమయంలో జాతీయ సముద్ర తీర పరిశోధనా విభాగానికి చెందిన సాగర్ నిధి, భారత భౌగోళిక పరిశోధనా సంస్థకు చెందిన సముద్ర రత్నాకర్ నౌకలను రంగంలోకి దించారు. ఈ నౌకలు మూడు వారాలకు పైగా తీవ్రంగా గాలింపులో నిమగ్నం అయ్యాయి. శాస్త్రవేత్త  నాగేంద్రన్ నేతృత్వంలో ఎనిమిది మంది పరిశోధకులతో కూడిన బృందం సముద్ర రత్నాకర్‌లో ఉన్న టెక్నాలజీ ఆధారంగా తీవ్ర పరిశోధనలు సాగించారు. అయితే, పూర్తి స్థాయిలో ఆ విమానానికి సంబంధించిన ఆధారాలు చిక్కనట్టుంది. అదే సమయంలో తమకు చిక్కిన వస్తువుల్ని పరిశోధనకు తరలించి ఉన్నారు. ఈనేపథ్యంలో గాలింపు ఈనెల మూడో తేదీ నిలుపుదల చేసి ఉన్నారు. ఇందుకు తగ్గ సమాచారం వెలువడడంతో తదుపరి కసరత్తుల్లో అధికార వర్గాలు నిమగ్నమయ్యాయి.
 
 మళ్లీ సాగేనా: గాలింపులో ఉన్న నౌకలు, హెలికాప్టర్లు అన్ని వెనక్కు వచ్చేసినట్టు సమాచారం. సాగర్ నిధి చెన్నైకు, సముద్ర రత్నాకర్ ఫోర్ట్‌బ్లెయిర్‌కు తరలి వెళ్లినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో మంగళవారం చెన్నై పళ్లికరణైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ(ఎన్‌ఐవోటీ)లో అధికారులు సమాలోచనలో మునిగి ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఇందులో భారతనౌకాదళం, వైమానిక దళంలతో పాటు ఎన్‌ఐవోటీ, తదితర విభాగాల అధికారులు పాల్గొని ఉన్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు సాగిన గాలింపు, తమకు చిక్కిన వస్తువులపై పరిశోధనలు సాగించే దిశగా ఈ సమాలోచన సాగినట్టు తెలిసింది.
 
 ఇప్పటి వరకు సాగిన గాలింపులో 54 వస్తువులు బయట పడ్డట్టు, అయితే, ఇవి ఆ విమాన శకలాలు అన్నది నిర్ధారణ కాకున్నా, అందుకు తగ్గ పరిశోధన వేగవంతం చేయాలని నిర్ణయించారు. అలాగే, మలివిడతగా గాలింపు సాగించాలా, ఇక ఫుల్ స్టాప్ పెట్టాలా..? అన్న కోణంలోనూ ఈ సమాలోచనలో చర్చ సాగినట్టు సమాచారం. మానవ రహిత పరిశోధనా పరికరాల్ని సముద్ర గర్భంలో 3.5 కి.మీ దూరం మేరకు పంపించి, చివరి ప్రయత్నం చేపట్టే దిశగా ఆ సమాలోచన సాగినట్టుంది. ఇందుకు తగ్గ వివరాలను అధికార వర్గాలు బహిర్గతం చేయని దృష్ట్యా, మళ్లీ ఆపరేషన్ తలాష్ సాగేనా అన్న ఎదురు చూపులు పెరిగాయి.
 

Advertisement
Advertisement