Sakshi News home page

అమృతధారతో వచ్చిన ఆపద్బాంధవుడు

Published Sat, Dec 5 2015 7:01 PM

అమృతధారతో వచ్చిన ఆపద్బాంధవుడు

చెన్నై: భీకర వరదల్లో చిక్కుకున్న నగరంలో ఆకలిదప్పులతో అలమటిస్తున్న ప్రజలు. అన్నం మాట దేవుడెరుగు కనీసం గొంతు తడుపుకునేందుకు గుక్కెడు మంచినీళ్లు కూడా దొరక్క అల్లాడి పోతుంటే ఆపద్బాంధవుడిలా వచ్చారు బెంగళూరుకు చెందిన దినేశ్ జైన్. ఎలాంటి మురుకి నీరునైనా మంచి నీరుగా మార్చే ‘ప్యూరిఫికేషన్ ప్లాంట్’ ట్రక్కును తనతో తీసుకొచ్చారు.  ఔత్సాహిక వ్యాపారవేత్తయిన దినేష్ జైన్ వ్యాపారం కోసం కాకుండా కేవలం మానవతా దృక్పథంతోనే ఇక్కడికి వచ్చానని మీడియాకు తెలిపారు.

 ‘రివర్స్ ఓస్మోసిస్ (ఆర్వో) సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే తన ప్యూరిఫికేషన్ ప్లాంట్ ద్వారా 20 వేల లీటర్ల మురికి నీరును మంచినీరుగా మార్చవచ్చని ఆయన తెలిపారు. వివిధ రకాల ఫిల్టర్లు, ప్రెషర్ మెకానిజం ద్వారా వివిధ దశలో మురికిని తొలగించి మంచినీరుగా మారుస్తామని, అందులో 99.1 శాతం కలుషితాలు ప్రాసెస్లో తొలగిపోతాయని చెప్పారు. బెంగళూరు నుంచి నగరానికి శుక్రవారం నాడే దినేశ్ చేరుకున్నప్పటికీ వరద నీటిని మంచినీరుగా మార్చేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు.

చివరకు స్థానిక నాయకులు, ప్రజల ఒత్తిడి కారణంగా శనివారం నాడు తను వచ్చిన పనిలో నిమగ్నమయ్యారు. తొలుత కొన్ని లీటర్ల మంచినీటిని తయారుచేసి వాటి పరీక్షల కోసం ప్రభుత్వ ల్యాబ్కు పంపించారు. ల్యాబ్ రిపోర్ట్ రాగానే మంచినీటిని ప్రజలకు ఉచితంగా సరఫరా చేస్తానని చెబుతున్నారు. వరద నీరు, డ్రైనేజ్ నీరు కలసిపోయినందున ముందుజాగ్రత్తగా ల్యాబ్ టెస్ట్ చేయించడం తన బాధ్యతని ఆయన చెప్పారు. తన ప్యూరిఫికేషన్ ప్లాంట్కు ఆయన ‘అమృతధార’ అని పేరు పెట్టుకున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement