కమలనాథులకు మోడీ ఉపదేశం | Sakshi
Sakshi News home page

కమలనాథులకు మోడీ ఉపదేశం

Published Mon, Oct 21 2013 6:50 AM

Modi guidance to BJP leaders

ఎన్నికల పొత్తులపై నోరు మెదపొద్దంటూ పార్టీ శ్రేణులను బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆదేశించారు. అధిష్టా నం అన్నీ చూసుకుంటుందని, ఎవరూ జోక్యం చేసుకోవద్దని హితవు పలికారు. ఏర్కాడు ఉప ఎన్నికల్లో డీఎంకేకు మద్దతు అంశాన్ని ఆయన తోసిపుచ్చారు.
 
 సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఢీలాపడ్డ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు మోడీ చర్యలు తీసుకుంటున్నారు. ఈ దిశగానే తిరుచ్చిలో సభ నిర్వహించారు. ఈ సభ విజయవంతం కావడంతో కమలనాథు ల్లో ఆనందం వెల్లివిరిసింది. అలాగే ఈ నెల 18న మోడీ చెన్నైలో పర్యటించి పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపారు. నగరంలోని కమలాలయంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గంటన్నర సేపు సాగిన ఈ సమావేశంలో తన ప్రసంగాన్ని మోడీ పక్కన పెట్టారు. ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితి, రాష్ట్ర పార్టీ నేతృత్వంలో చేపడుతున్న కార్యక్రమాలు, నేతల అభిప్రాయూలు వినేందుకే ఎక్కువ సమయం కేటారుుంచారు. 
 
 ఇది వరకు జరిగిన ఎన్నికల్లో బీజేపీని ద్రవిడ పార్టీలు చీదరించుకోవడాన్ని, ఒంటరిగా సాధించిన ఓటు బ్యాంక్ వివరాల్ని మోడీకి నేతలు వివరించారు. ప్రస్తుతం మీరు ప్రధాని అభ్యర్థి కావడంతో జత కట్టేందుకు అనేక పార్టీలు ముందుకు వస్తున్నట్లు వెల్లడించారు. ఎండీఎంకే,  డీఎండీకే గురించి ప్రస్తావిస్తున్న సమయంలో మోడీ మౌనంగానే ఉన్నారు. డీఎంకే విషయానికి వచ్చే సరికి అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రధానంగా ఏర్కాడు ఉప ఎన్నికలో మద్దతు ఇవ్వాలన్న డీఎంకే అధినేత కరుణానిధి ప్రతిపాదనను నేతలు మోడీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిని ఆయన నిర్మొహమాటంగా తోసిపుచ్చారు.
 
 నోరు మెదపొద్దు
 నాయకుల అభిప్రాయాల్ని ఓపిగ్గా విన్న మోడీ పొత్తుల గురించి ఇక ఎవరూ ప్రస్తావించ వద్దంటూ ఆదేశించారు. రెండు ముక్కల్లో ఇదే విషయాన్ని స్పష్టం చేసి ప్రసంగాన్ని ముగించారు. అనంతరం పార్టీ సీనియర్లు ఇలగణేషన్, రాధాకృష్ణన్, హెచ్.రాజా తదితరులు మోడీతో ప్రత్యేకంగా భేటీ అయినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో పొత్తుల అంశం గురించే పదేపదే మోడీ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ప్రధానంగా అన్నాడీఎంకేపై విమర్శలు చేయవద్దని సూచించినట్లు సమాచారం. జాతీయస్థాయిలో మూడో కూటమికి వామపక్షాలు చేస్తున్న ప్రయత్నాల్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వామపక్షాలు ఢిల్లీలో నిర్వహించే సమావేశానికి అన్నాడీఎంకేను ఆహ్వానించడాన్ని, ఏర్కాడు ఉప ఎన్నికలో ఆ పార్టీకి మద్దతు పలకడాన్ని తెలియజేశారు. ఈ నెల 30న జరిగే సమావేశంలో ఎవరి నేతృత్వంలో మూడో కూటమి ఏర్పాటు అనే విషయం స్పష్టతకు వచ్చే అవకాశాలు లేనందున, అన్నాడీఎంకే నిర్ణయం కోసం చివరి వరకు వేచి చూద్దామని ఆయన పేర్కొనడం గమనార్హం.
 
 అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం
 పొత్తులు, మద్దతు, చర్చలు తదితర విషయాల్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని, రాష్ట్ర పార్టీ నాయకులెవరూ జోక్యం చేసుకోవద్దని మోడీ స్పష్టం చేశారు. డిసెంబరులో వెలువడ నున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వరకు ఎలాంటి ప్రస్తావనా తీసుకు రావద్దని తేల్చి చెప్పారు. అలాగే నేతలు, కార్యకర్తలు జనంలోకి వెళ్లాలని, పార్టీ బలోపేతం లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏదేని కీలక  ప్రకటనలు చేయాల్సి వస్తే అధిష్టానంతో ఓ మారు చర్చించాకే నిర్ణయం తీసుకోవాలని ఉపదేశించారు.
 

Advertisement
Advertisement