రాక్షసుడు! | Sakshi
Sakshi News home page

రాక్షసుడు!

Published Mon, Dec 4 2017 7:47 AM

Mother of rape case accused murdered  - Sakshi

కామాంధుడు నరరూప రాక్షసుడయ్యాడు. కొన్ని నెలల క్రితం ఏడేళ్ల హాసినిపై అత్యాచారం చేసి  అగ్నికి ఆహుతి చేసిన ఈ కిరాతకుడు, తాజాగా, కన్న తల్లినే కడతేర్చాడు. చట్టంలో ఉన్న రంధ్రాల్ని  అనుకూలంగా మలచుకుని హాసిని కేసు నుంచి బయటకు తీసుకొచ్చిన తండ్రికి ఆ తనయుడు మంచి పాఠమే నేర్పించాడు. ఇది కిరాతక దశ్వంత్‌ నేర చరిత్ర...! 

సాక్షి, చెన్నై :   పది నెలల క్రితం ఓ చిన్నారిని హతమార్చిన ఆ యువకుడు.. చివరకు జన్మనిచ్చిన తల్లినే పొట్టనపెట్టుకున్నాడు. ఈ సంఘటన చెన్నైలో కలకలం రేపింది. ఫిబ్రవరి ఐదో తేదీ చెన్నై పోరూరు సమీపంలోని మౌళివాక్కం మదనందపురం మాతానగర్‌లోని బహుళ అంతస్తుల భవనంలో నివాసం ఉన్న  బాబు, శ్రీదేవి దంపతులు తమ కుమార్తె హాసిని(7) కనిపించడం లేదని పోలీసుల్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. నాలు గు రోజుల అనంతరం  మదురవాయిల్‌ రహదారిలో  సగం కాలిన స్థితిలో హాసినిæ మృతదేహాన్ని గుర్తించారు. ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి జరిపి హతమార్చినట్టు విచారణలో తేలింది. బాబు, శ్రీదేవి దంపతులు నివాసం ఉన్న భవనం పైఅంతస్తులో ఉన్న ఇంజినీరింగ్‌ పట్టభద్రుడు  దశ్వంత్‌   కామాంధుడుగా తేలింది. 

 అతన్ని అరెస్టు చేసిన సమయంలో సామాజిక కార్యకర్తలు, యువతీ, యువకులు చితకొట్టేందుకు దూసుకెళ్లారు. ఉరితీయాలన్న నినాదాన్ని హోరెత్తించారు. అతగాడి మీద గుండా చట్టం నమోదైంది. ఇక, అతడు బయటకు వచ్చేప్రసక్తే లేదని సర్వత్రా భావించారు. అయితే, చట్టంలో ఉన్న రంధ్రాల్ని తమకు అనుకూలంగా మలచుకుని నాలుగు గోడల మధ్య జైలులో మగ్గాల్సిన కామాంధుడిని తండ్రి శేఖర్‌ ఆరు నెలల్లో బయటకుతీసుకొచ్చాడు. ఈ సమయంలో నేరాల్ని ప్రోత్సహించే రీతిలో నిందితుడ్ని  బెయిల్‌ మీద జనావాసంలోకి  వదలిపెడతారా..? అంటూ న్యాయలోకాన్ని నిలదీసినా వాళ్లూ ఉన్నారు.

మారని కిరాతకుడు
సెప్టెంబరులో బెయిల్‌ మీద తనయుడ్ని బయటకు తీసుకొచ్చిన క్రమంలో దశ్వంత్‌ తండ్రి శేఖర్‌ సంబరపడ్డారు. తన కుమారుడ్ని కేసు నుంచే బయటకు తీసుకొస్తానని సవాల్‌ చేశాడంటూ మీడియా ముందు హసిని తండ్రి బాబు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. తమిళనాట తమకు న్యాయం లభించని దృష్ట్యా, సొంత రాష్ట్రానికి వెళ్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోరూర్‌ నుంచి శేఖర్‌ కుటుంబం కుండ్రత్తూరుకు మకాం మార్చింది. ఇదిలా ఉండగా బెయిలుపై వచ్చిన తనయుడిలో మార్పు దిశగా తల్లి సరళ(45) తీవ్రంగానే ప్రయత్నించినా, ఉల్లాస జీవితాన్ని అలవాటుపడ్డ ఆ కిరాతకుడు మరింత రాక్షసుడిగా మారడం మొదలెట్టినట్టున్నాడు. మద్యానికి చిత్తై, వ్యసనాల బాట పట్టాడు.

తల్లినే కడతేర్చాడు
కుండ్రత్తూరు సంబంధం నగర్‌ శ్రీరామ్‌ రోడ్డులోని ఇంటి నుంచి శనివారం ఉదయం శేఖర్‌ తాను పనిచేస్తున్న సంస్థకు విధుల నిమిత్తం వెళ్లాడు. సాయంత్రం మూడున్నర గంటల సమయంలో భార్య సరళకు శేఖర్‌ ఫోన్‌చేశాడు. ఎంతకు ఆమె ఫోన్‌తీసుకోక పోవడంతో దశ్వంత్‌కు ఫోన్‌చేశాడు. తాను బయట ఉన్నట్టు, కాసేటి తర్వాత ఇంటికి వెళ్తానని చెప్పి ఫోన్‌కట్‌చేశాడు. ఎంతకు భార్య ఫోన్‌ తీసుకోక పోవడంతో అనుమానం వచ్చిన శేఖర్‌ సమీపంలోని బంధువుల్ని ఆశ్రయించారు. సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ఇంటికి వెళ్లిన బంధువు అక్కడ బెడ్‌ రూమ్‌లో రక్తపు మడుగులో పడి ఉన్న సరళను చూసి ఆందోళనలో పడ్డాడు. శేఖర్‌ అక్కడికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుండ్రత్తూరు పోలీసులు  విచారణ చేపట్టారు. ఆమె ఒంటి మీదున్న తాళి బొట్టుతో సహా ఇంట్లో ఉన్న నగలు, నగదు మాయం కావడంతో తొలుత దొంగల పనిగా భావించారు. 

అయితే, దశ్వంత్‌ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉండడం, అతడి మిత్రుల వద్ద సాగిన విచారణలో ఉల్లాస జీవితం కోసం రాక్షసుడిగా మారిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో నగదు, నగల కోసం కన్నతల్లిని ఇంట్లో ఉన్న రాడ్డు సాయంతో హతమార్చి ఉండొచ్చని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అజ్ఞాతంలో ఉన్న దశ్వంత్‌ ఫోన్‌కాల్‌ను ట్రేస్‌ చేసి అరెస్టు చేయడానికి రెండు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పుళల్‌ జైల్లో ఉన్న సమయంలో దశ్వంత్‌ కొందరు నేరగాళ్లతో సన్నిహితంగా మెలిగినట్టు విచారణలో తేలింది. 

Advertisement
Advertisement