సౌధ సాక్షిగా అన్నదాత ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

సౌధ సాక్షిగా అన్నదాత ఆత్మహత్య

Published Thu, Nov 28 2013 3:35 AM

Movement witness suicide Annadata

 చెరకు రైతుల ఆందోళనలో అపశ్రుతి..
 = గిట్టుబాటు ధర కల్పించాలని విషం తాగిన రైతు
 = ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి
 = నివాళులర్పించిన సీఎం, మంత్రులు
 = అసెంబ్లీలో సీఎంపై యడ్డి వాగ్దాడి
 = తేరుకుని ఎదురు దాడికి దిగిన సిద్ధు
 = పరస్పర దూషణలతో దద్దరిల్లిన అసెంబ్లీ
 = స్పీకర్ జోక్యం.. సభ నేటికి వాయిదా
 
 సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బెల్గాంలోని సువర్ణ సౌధలో జరుగుతున్న శాసన సభ శీతాకాల సమావేశాల సందర్భంగా గిట్టు బాటు ధర కోసం సౌధ ఎదుట చెరకు రైతులు చేపట్టిన ఆందోళనలో బుధవారం అపశ్రుతి చోటు చేసుకుంది. విఠల అరభావి (60) అనే రైతు మధ్యాహ్నం విషం తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. హుటాహుటిన ఇతర రైతులు ఆయనను ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఈ విషయం తెలిసిన వెంటనే శాసన సభ వాయిదా పడింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇతర మంత్రులు ఆస్పత్రిలో విఠల భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
 
 రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా...
 
 సభ తిరిగి సాయంత్రం పునఃప్రారంభమైనప్పుడు ముఖ్యమంత్రి రైతు ఆత్మహత్యపై ప్రకటన చేస్తూ, ఆయన కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియాను   ప్రకటించారు. ఇప్పటికే ఆయన రూ.ఐదారు లక్షల అప్పుల్లో ఉన్నట్లు తమకు తెలిసిందని చెప్పారు. చక్కెర కర్మాగారాలు టన్ను చెరకు ధరను రూ.2,500 గా ప్రకటించగా, తమ ప్రభుత్వం మరో రూ.150 చొప్పున మద్దతు ధర ప్రకటించిందని తెలిపారు.

దీని కోసం రూ.500 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. గత రెండు రోజులుగా సభలో చెరకు రైతుల సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగిందని, దీనిపై తాను సమాధానం ఇవ్వాల్సిన తరుణంలో ఈ ఘోరం జరిగి పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఈ దశలో కేజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప లేచి నిల్చుని హరి కథలు చాలంటూ ఆగ్రహంతో పోడియం వద్దకు దూసుకు వచ్చారు. రైతులకు ఏం చేశారో చెప్పండంటూ ముఖ్యమంత్రిని నిలదీశారు.
 
  యడ్యూరప్పను ఇతర కేజేపీ, బీజేపీ సభ్యులు అనుసరించారు. ఆయన నేరుగా ముఖ్యమంత్రిపై వాగ్దాడికి దిగారు. కాసేపు బిత్తరపోయిన ముఖ్యమంత్రి అనంతరం తేరుకుని యడ్యూరప్పపై విమర్శలకు దిగారు. ముఖ్యమంత్రికి మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన చుట్టూ నిల్చున్నారు.
 
 మీకు సిగ్గు లేదంటే, మీకు సిగ్గు లేదంటూ ఒకరిపై మరొకరు దూషణలకు దిగారు. కేజేపీ, బీజేపీ సభ్యులు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. యడ్యూరప్ప వాగ్దాటిని ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి స్వరం పెంచి మాట్లాడారు.
 
 ‘శవాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. మీకు మానం, మర్యాద లేదు’ అంటూ తూలనాడారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప, రైతు మృతికి సంతాప సూచకంగా నిమిషం పాటు మౌనం పాటించాలని సభ్యులను కోరారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు. కాగా రైతు ఆత్మహత్య సంఘటనకు నిరసనగా బెల్గాం జిల్లాలో పలు చోట్ల రైతులు రాస్తారోకోను నిర్వహించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement