మృగాళ్లపై గూండా చట్టం | Sakshi
Sakshi News home page

మృగాళ్లపై గూండా చట్టం

Published Tue, Jul 22 2014 2:42 AM

Mrgalla gangster law

  • హోం మంత్రి కె.జె.జార్జ్     
  •  చట్టానికి సవరణలు
  •  జిల్లాకొక మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు
  •  జార్జ్ రాజీనామాకు శెట్టర్ పట్టు
  •  అత్యాచార ఘటనలతో రాజకీయ లబ్ధి వద్దు : కుమార
  • సాక్షి ప్రతినిధి, బెంగళూరు : అత్యాచారాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు గూండా చట్టాన్ని ప్రయోగించనున్నట్లు హోం మంత్రి కేజే. జార్జ్ తెలిపారు. ప్రస్తుత గూండా చట్టం ప్రకారం అత్యాచారాలకు పాల్పడే వారిని శిక్షించే అవకాశం లేదని, కనుక ఈ చట్టానికి సవరణను తీసుకొస్తామని వెల్లడించారు. అత్యాచార ఘటనలకు సంబంధించి శాసన సభలో సోమవారం జరిగిన స్వల్ప వ్యవధి చర్చకు ఆయన సమాధానమిచ్చారు. అంతకు ముందు చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జోక్యం చేసుకుంటూ, అత్యాచారాల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిందని తెలిపారు. ఇందులో భాగంగా అత్యాచారాలకు పాల్పడిన వారిపై గూండా చట్టం కింద కేసులు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు.
     
    మహిళా పోలీసు స్టేషన్లు
     
    మహిళలపై లైంగిక దాడులు, దౌర్జన్యాలను అరికట్టడానికి ప్రతి జిల్లాలో మహిళా పోలీసు స్టేషన్లను ప్రారంభిస్తామని హోం మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే పది మహిళా పోలీసు స్టేషన్లు ఉన్నాయని, ఈ ఏడాది కొత్తగా పది పోలీసు స్టేషన్లను ప్రారంభిస్తామని వెల్లడించారు. వచ్చే ఏడాది మరో పది స్టేషన్లను ప్రారంభిస్తామన్నారు. ప్రతి జిల్లాలో కనీసం ఒక మహిళా పోలీసు స్టేషన్ ఉంటుందని ఆయన తెలిపారు.
     
    రాజీనామాకు పట్టు
     
    రాష్ట్రంలో వరుస లైంగిక దాడులను అరికట్టడంలో విఫలమైన హోం మంత్రి కేజే. జార్జ్ వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ డిమాండ్ చేశారు. లైంగిక దాడులపై శాసన సభలో ఆయన స్వల్ప వ్యవధి చర్చను ప్రారంభిస్తూ, పాలనా పరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో హోం మంత్రి విఫలమయ్యారని ఆరోపించారు.

    మహిళల్లో విశ్వాసం పెంచే కార్యక్రమాలు కూడా చేపట్టలేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో విఫలమయ్యారని ఆరోపించారు. పోలీసు అధికారులు ఏం  పని చేస్తున్నారో ఎవరికీ అంతుబట్టడం లేదని, పని చేయాలనే ఉత్సాహం అధికారుల్లో కొరవడిందని విమర్శించారు. పోలీసు శాఖకు చెందిన హొయ్సళ, చీటా వాహనాలు పని చేయడం లేదని ఆరోపించారు. లైంగిక దాడులకు నిరసనగా ప్రజలు రోడ్డుకెక్కినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని దుయ్యబట్టారు.

    తమపై జరిగే దౌర్జన్యాలపై ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్లకు వచ్చే మహిళల పట్ల పోలీసులు గౌరవప్రదంగా నడుచుకునేట్లు  చూడాలని సూచించారు. పోలీసులు ఎవరి పట్లా గౌరవంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. పాఠశాలల్లో లైంగిక దాడులు జరుగుతున్నా, విద్యా శాఖ ఏం చేస్తున్నదో అర్థం కావడం లేదని విమర్శించారు. విబ్‌గ్యార్ పాఠశాల యాజమాన్యంపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రతిపక్ష ఉప నాయకుడు ఆర్. అశోక్ ్రపభృతులు చర్చలో పాల్గొన్నారు.

    రాజకీయం చేయదలచుకోలేదు
     
    రాష్ర్టంలో లైంగిక దాడుల విషయంలో ప్రభుత్వం పట్ల జేడీఎస్ మెతకగా వ్యవహరిస్తోందంటూ వస్తున్న విమర్శలను తిప్పి కొట్టడానికి ఆ పార్టీ శాసన సభా పక్షం నాయకుడు హెచ్‌డీ. కుమారస్వామి ప్రయత్నించారు. చర్చలో పాల్గొన్న ఆయన జేడీఎస్, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ కొందరు తమను విమర్శిస్తున్నారని తెలిపారు. లైంగిక దాడుల సంఘటనలను అడ్డు పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూడడం ఏ పార్టీకీ తగదని హితవు పలికారు.

    పోలీసు శాఖ వైఫల్యంపై ఇదివరకే తమ పార్టీ గళం విప్పిందని గుర్తు చేశారు. లైంగిక దాడులపై గత మూడు రోజులుగా ృస్తత చర్చలు జరుగుతున్నాయని, అయితే ఎవరూ దీనికి పరిష్కార మార్గాలు చెప్పడం లేదని అన్నారు. గుజరాత్ సహా దేశంలోని ప్రతి రాష్ర్టంలోనూ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. అందరూ కూర్చుని ఈ లైంగిక దాడులను పూర్తిగా అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఓ నిర్ణయానికి రావాలని ఆయన అన్ని పార్టీలను కోరారు.
     

Advertisement
Advertisement