బాంబు ఉందంటూ జోక్.. మోడల్ అరెస్ట్ | Sakshi
Sakshi News home page

బాంబు ఉందంటూ జోక్.. మోడల్ అరెస్ట్

Published Sat, Mar 4 2017 8:50 AM

బాంబు ఉందంటూ జోక్.. మోడల్ అరెస్ట్ - Sakshi

ముంబై: తన స్నేహితురాలి దగ్గర బాంబు ఉందని అబద్ధం చెప్పి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు అనవసరంగా అధికారులను కంగారు పెట్టి, విమానం ఆలస్యంగా బయల్దేరడానికి కారణమైన ఓ మోడల్‌ను భద్రత సిబ్బంది ఆరెస్ట్ చేసింది. ఆమెకు మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది.

గురువారం రాత్రి కంచన్ ఠాకూర్ (27) అనే మోడల్ తన ముగ్గురు స్నేహితులతో కలసి ఎయిరిండియా విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చింది. ఆమె బోర్డింగ్ గేట్ దాటిన తర్వాత విమాన భద్రత సిబ్బంది దగ్గరకు వెళ్లి తన స్నేహితురాలి హ్యాండ్ బ్యాగ్‌లో బాంబు ఉందని, జాగ్రత్తగా తనిఖీ చేయాలని కోరింది. దీంతో అక్కడున్నవారు భయపడిపోయారు. భద్రత సిబ్బంది వెంటనే ఈ విషయాన్ని సీఐఎస్ఎఫ్, విమానాశ్రయ అధికారులకు తెలియజేశారు. సీఐఎస్ఎఫ్ అధికారులు వెంటనే వచ్చి మోడల్, ఆమె స్నేహితులను ప్రశ్నించారు. నలుగురిని, వారి లగేజీని  వదిలి వెళ్లాల్సిందిగా ఎయిరిండియా సిబ్బందికి సూచించారు. దీంతో కంగారు పడిపోయిన మోడల్ తాను జోక్ చేశానని, స్నేహితురాలి బ్యాగ్‌లో బాంబు లేదని చెప్పింది. ఈ దశలో సీఐఎస్ఎఫ్‌ సిబ్బందికి, మోడల్‌కు వాగ్వాదం జరిగింది. మోడల్‌తో పాటు ఆమె స్నేహితులను వదిలేసి గంట ఆలస్యంగా విమానం బయల్దేరింది. షెడ్యూల్ సమయం ప్రకారం రాత్రి 9 గంటలకు బయల్దేరాల్సిన ఉండగా, 10 గంటలకు వెళ్లింది.

పోలీసులు మోడల్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. తర్వాత ఆమె బెయిల్‌పై విడుదలైంది. ముంబై విడిచి వెళ్లవద్దంటూ మోడల్‌ను, ఆమె స్నేహితులను అధికారులు ఆదేశించారు. మోడల్ స్నేహితురాలు ఒకరు అనారోగ్యంతో ఉన్న బాధపడుతున్న తల్లిని చూసేందుకు వెళ్లాల్సివుంది.

Advertisement
Advertisement