త్వరలో ముంబై హైవే విస్తరణ | Sakshi
Sakshi News home page

త్వరలో ముంబై హైవే విస్తరణ

Published Sat, Jan 11 2014 11:33 PM

Mumbai-Pune highway expansion soon

 సాక్షి, ముంబై: పాత ముంబై-పుణే హైవేను మరింత వెడల్పు చేయాలనే నిర్ణయం ఫలితంగా ముంబై-పుణే మార్గంలో వెళ్లేవాళ్లు మరింత త్వరగా గమ్యస్థానం చేరుకోవచ్చు. అంటే ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం మరింత తగ్గుతుంది. దాదాపు రూ.3,600 కోట్ల ఖర్చుతో కూడుకున్న ఈ ప్రతిపాదన అమలుకు రోడ్డు, రవాణా మంత్రిత్వశాఖ అంగీకారం తెలిపింది. అయితే తుది నిర్ణయం కోసం దీనిని మహారాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ (ఎమ్మెస్సార్డీసీ) బోర్డుకు కూడా పంపిస్తారు.

 ఎమ్మెస్సార్డీసీ చైర్మన్ జయదత్ క్షీర్‌సాగర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘పాత ముంబై-పుణే హైవే అభివృద్ధి ప్రణాళికకు  రోడ్డు, రవాణా మంత్రిత్వశాఖ ఇటీవలే ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఈ ప్రతిపాదనను ఎమ్మెస్సార్డీసీ బోర్డు పరిశీలనకు పంపిస్తాం’ అని తెలిపారు. ఈ రోడ్డు వెడల్పు పనులు 2017 వరకు పూర్తవుతాయని ఎమ్మెస్సార్డీసీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఖపోలీ, లోనావాలా రోడ్డును వెడల్పు చేస్తే ముంబై-పుణే మధ్య ప్రయాణం 30 నుంచి 45 నిమిషాల వరకు తగ్గనుంది.

 ప్రస్తుతం నాలుగు లేన్లుగా ఉన్న ఈ పాత హైవేను ఆరు లేన్లకు విస్తరిస్తారు. అంతేగాక ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ హైవేను కూడా ఆరు నుంచి ఎనిమిది లేన్లుగా మార్చనున్నారు. ఈ ప్రణాళిక విషయమై ఎమ్మెస్సార్డీసీ బోర్డుతో చర్చించిన తర్వాత టెండర్లను కూడా ఆహ్వానించనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు పేర్కొన్నారు. తదనంతరం పనులు ప్రారంభిస్తామన్నారు. అంతేకాకుండా పర్యావరణ మంత్రిత్వశాఖ కూడా ఈ ప్రణాళికకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది.

 దీనికితోడు ఖాలాపూర్ నుంచి లోనావాలా మధ్య సొరంగ మార్గాన్ని నిర్మించనున్నారు. దీని నిర్మాణం పూర్తయితే దేశంలోనే ఇది రెండో అతిపెద్ద సొరంగం అవుతుందని ఎమ్మెస్సార్డీసీ వర్గాలు తెలిపాయి. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగానే ఈ సొరంగ మార్గాన్ని నిర్మించనున్నారు. ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ హైవేపై భారీగా ప్రమాదాలు జరుగుతుండడాన్ని దృష్టిలో ఉంచుకొని దీనిని విస్తరించాలని ఎమ్మెస్సార్డీసీ నిర్ణయించింది. ప్రస్తుతం ఈ మార్గంపై ఐదు సొరంగ మార్గాలు ఉన్నాయి. పుణే సమీపంలో 1.5 కిలోమీటర్ల పొడవున కామ్‌శేత్ సొరంగం ఉంది. ఇది అన్నింటికంటే పెద్దది. అయితే 7.8 కిలోమీటర్ల మేర ఖాపోలీ, లోనావాలా మధ్య కొత్తగా నిర్మించనున్న సొరంగం రుషి డ్యామ్ కింది నుంచి నిర్మించాల్సి ఉంటుంది. ఇందుకు పర్యావరణ మంత్రిత్వశాఖ ఇందుకు అనుమతి ఇవ్వడం తప్పనిసరని ఎమ్మెస్సార్డీసీ అధికారులు చెబుతున్నారు.

Advertisement
Advertisement