భిక్షమెత్తైనా భృతి ఇవ్వాల్సిందే: హైకోర్టు | Sakshi
Sakshi News home page

భిక్షమెత్తైనా భృతి ఇవ్వాల్సిందే: హైకోర్టు

Published Thu, Jul 14 2016 6:27 PM

భిక్షమెత్తైనా భృతి ఇవ్వాల్సిందే: హైకోర్టు - Sakshi

కేకే.నగర్: భార్యబిడ్డ జీవన భృతి కోసం భిక్షమెత్తి సంపాదించైనా డబ్బులు ఇవ్వాల్సిందేనని మదురై హైకోర్టు ఓ కేసులో సంచలన తీర్పు ఇచ్చింది. విరుదునగర్ జిల్లా శ్రీ విల్లిపుత్తూరుకు చెందిన సెల్వరాజన్‌కు, కోవిల్‌పట్టికి చెందిన రంగసుభద్ర భార్యాభర్తలు. వీరికి ఒక బిడ్డ ఉంది.  కాగా అభిప్రాయ భేదాల కారణంగా వీరిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో తనకు ఉండడానికి ఇల్లు, నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ రంగసుభద్ర కోవిల్‌పట్టి కోర్టులో పిటీషన్ వేసింది. దీనిపై విచారించిన కోర్టు ఇంటి అద్దె కింద రూ. పదివేలు, నష్టపరిహారంగా రూ. 50 వేలు ఇవ్వాలని సెల్వరాజన్‌ను ఆదేశించింది.

దీన్ని వ్యతిరేకిస్తూ సెల్వరాజన్ తూత్తుకుడి కోర్టులో అప్పీలు చేసుకున్నాడు. పిటీషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఇంటి అద్దెకు పదివేలు ఇవ్వాల్సిన అవసరం లేదని, రూ.10 వేల జీవన భృతి, రూ. 25 వేలు నష్టపరిహారంగా ఇస్తే చాలని ఆదేశించింది. కాగా ఈసారి ఆదేశాలను వ్యతిరేకిస్తూ సెల్వరాజన్ మళ్లీ మదురై హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి దేవదాస్ ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం ఈ విధంగా తీర్పునిచ్చాడు. ‘శారీరకంగా కంటే మానసికంగా పడే బాధ వర్ణనాతీతం. రంగసుభద్రను పిటిషన్ దారుడు మానసికంగా ఎన్నో కష్టాలను పెట్టాడు. ఇప్పుడు కేసు నుంచి తప్పించుకోవడానికి తాను ఇంజనీరింగ్ చదివినా నిరుద్యోగినని కుంటిసాకులు చెపుతున్నాడని కోర్టుకు అర్థమైంది. చట్ట ప్రకారం రంగసుభద్రకు పిటిషన్‌దారుని ఆస్తిలో భాగం ఇవ్వాల్సిందే. పిటిషన్‌దారుడు కూలీ పనిచేసైనా భార్యాబిడ్డకు జీవనభృతి చెల్లించాల్సిందే. లేని పక్షంలో భిక్షమెత్తై వారి భోజనానికి అయ్యే ఖర్చుల కింద జీవన భృతి ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదంటూ ’తీర్పు వెలువరించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement