ఇక సమరమే 29న నరేంద్రమోడీ సభ | Sakshi
Sakshi News home page

ఇక సమరమే 29న నరేంద్రమోడీ సభ

Published Sun, Sep 8 2013 3:08 AM

Narendra Modi meeting on 29 Assembly Election

 సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల కసరత్తు పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే స్థానిక  కమిటీలు, ఆయా వర్గాల వారితో విడివిడిగా సమావేశాలు నిర్వహించిన కమలనాథులు మరో అడుగు ముందుకు వేయబోతున్నారు. మరికొద్ది నెలల్లో నిర్వహించనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నారు.కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో  శనివారం నిర్వహించిన సమావేశంలో బీజేపీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్, బీజేపీ ఢిల్లీప్రదేశ్ ఎన్నికల ఇన్‌చార్జి నితిన్‌గడ్కారీ దీనిపై ప్రత్యేకంగా చర్చించారు. ఈనెల 29న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సమావేశాన్ని విజయ వంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రముఖంగా చర్చ జరిగింది.
 
 సమావేశంలో పార్టీ రాష్ట్ర, జిల్లా, మండలస్థాయి నాయకులు పాల్గొన్నారు. వీరితోపాటు బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు, బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ మాజీ అధ్యక్షులు హర్షవర్ధన్, విజయేంద్రగుప్తా  సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా గడ్కారీ మాట్లాడుతూ...కాంగ్రెస్‌పార్టీ వైఫల్యాలను క్షేత్ర స్థాయిలో ఎత్తిచూపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గడపగడపకూ బీజేపీ పార్టీ భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలన్నారు. పార్టీ ఇప్పుడు సరైన దిశగా నడుస్తోందని, త్వరలోనే కాంగ్రెస్‌పార్టీ పాలన అంతమొందుతుందని అభిప్రాయపడ్డారు.‘ఈనెల 29న నిర్వహించనున్న సమావేశం పార్టీ నాయకులకు మరింత ఉత్సాహాన్ని ఇవ్వనుంది. మోడీ నేతృత్వంలో జరగనున్న సమావేశాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి.
 
 ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించాలి. ఇప్పటికే పార్టీ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నాయి. మరింత ఉత్సాహం పెంచుకోవాల్సిన అవసరం ఉంది’ విజయ్‌గోయల్ అన్నారు. ఈ నెల 14 నుంచి మండల స్థాయిలో 280 కార్యకర్త సమ్మేళనాలు నిర్వహించిన అనంతరం రెండో దశ ఏర్పాట్లు ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. నాలుగు నుంచి ఐదు పోలింగ్‌బూత్‌లను కలిపి కాంద్(అర్బన్ సెంటర్లు)గా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రతి యూనిట్‌లో ఐదు నుంచి ఆరుగురు సభ్యులు పర్యవేక్షిస్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇటీవల విడుదల చేసిన రిపోర్టు కార్డులోని అంశాలపైనా బీజేపీ నాయకులు చర్చించారు. అందులోని లోపాలను ప్రజలకు చేరేలా ప్రచారం నిర్వహించాలని పార్టీ శ్రేణులకు వారు పిలుపునిచ్చారు.
 

 

Advertisement

తప్పక చదవండి

Advertisement