సరికొత్త బాంబు | Sakshi
Sakshi News home page

సరికొత్త బాంబు

Published Sun, Aug 17 2014 1:06 AM

New bomb in Chennai

 చెన్నై, సాక్షి ప్రతినిధి: స్వాతంత్య్ర దినోత్సవానికి ముందురోజు రాత్రి బస్సులో పేలుడు సంభవించడం పోలీసు వర్గాల్లో కలవరం పుట్టించింది. ఈ పేలుడులో 9మంది ప్రయాణికులు గాయాలతో తప్పించుకున్నా కుట్ర వెనుక భారీ లక్ష్యమే ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. వారి అనుమానం నిజమేననే రీతిలో కొన్ని విషయాలు వెలుగుచూశాయి.  చెన్నై శివారు పెరంబలూరు నుంచి దురైయూరుకు ఈనెల 14వ తేదీ రాత్రి 60 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సులో రాత్రి 8.15 గంటల సమయంలో ఈచ్చంపట్టిలాడపురం వద్ద పేలుడు సంభవించింది.
 
 ఈ పేలుడు సీటు కింద జరిగినట్లు పోలీసులు గుర్తించారు. తొమ్మిది మంది గాయపడ్డారు. పేలుడు      జరిగిన చోట దొరికిన ఆనవాళ్లను బట్టి పెట్రో బాంబుగా నిర్ధారించారు. అనేక వైర్లతో ఛిద్రమై ఉన్న ప్లాస్టిక్ పెట్టె, బ్యాటరీ, బాటిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుచ్చి ఐజీ రామసుబ్రమణియన్, డీఐజీ సెందామరై నేతృత్వంలో ఏర్పాటైన విచారణ బృందం పేలుడు జరిగిన ప్రదేశంలో దొరికిన పదార్థాలను బట్టి పరిస్థితిని విశ్లేషించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రయోగించిన కొత్తరకం బాంబుగా పోలీసులు గుర్తించారు. ఈ బాంబు కొద్దిపాటి శబ్దం మాత్రమే చేస్తుం దని, అయితే ఇందులో అమర్చిన ద్రవం చుట్టుపక్కల అల్లుకుని భారీగా మంటలు వ్యాపిస్తాయని చెప్పారు.
 
 అలాగే అందులో నుంచి నల్లని పొగలు వెలువడి సమీపంలోని ప్రజల శ్వాస ఆడకుండా చేసి స్పృహ కోల్పోయేలా చేస్తాయి. అంటే మంటల నుంచి వారు తప్పించుకోకుండా చేయడానికి ఈ ద్రవం ఉపయోగించారు. బాంబు అమర్చిన పద్ధతిని పరిశీలిస్తే, ఇదంతా బస్సులో జరిగి ఉండాలని పోలీసులు భావిస్తున్నారు. అయితే అదృష్టవశాత్తు బాంబు సరిగా పేలకపోవడం ఈ ఉపద్రవం తప్పింది. అమాయకులు ప్రాణాలు దక్కించకుని బయటపడ్డారు. ఈ బాంబుపై మరిన్ని వివరాలు వెలుగురావాలంటే ఈ కుట్రవెనుక ఉన్న ముఠాలోని ఒక్క సభ్యుడైనా పట్టుబడాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. నిందితుల ఆచూకీ కోసం తిరుచ్చీ, అరియలూరు, కడలూరు, విళుపురం జిల్లాలకు పోలీసు బృందాలు పయనమయ్యూయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement