డెబిట్ కార్డుతో పట్టుచీరలు కొన్న మంత్రి | Sakshi
Sakshi News home page

డెబిట్ కార్డుతో పట్టుచీరలు కొన్న మంత్రి

Published Fri, Dec 9 2016 11:50 AM

డెబిట్ కార్డుతో పట్టుచీరలు కొన్న మంత్రి

  • ఆ పాలసీకి అనుగుణంగా బడ్జెట్‌ను పెంచుతాం: కేటీఆర్‌
  • వస్త్రాలను నేరుగా కొనుగోలు చేస్తాం..
  • మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తామని వెల్లడి
  • చౌటుప్పల్‌: రాష్ట్రంలో త్వరలోనే నూతన చేనేత పాలసీని తీసుకువస్తామని చేనేత, టెక్స్‌టైల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. వారంలో ఒకరోజు ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల  అధికారులు విధిగా చేనేత దుస్తులు ధరించే విధంగా ఆదేశాలు జారీచేస్తామని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురంలోని అపెరల్‌ టెక్స్‌టైల్స్‌ పార్కును ఆయన గురువారం  సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

    తమ ప్రభుత్వం చేనేత రంగం అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. చేనేత, టెక్స్‌టైల్‌ రంగాలకు నూతన పాలసీని అమల్లోకి తెస్తామని.. ఆ పాలసీకి అనుగుణంగా బడ్జెట్‌ కేటాయింపులను సైతం పెంచుతామని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో మాదిరిగా కాకుండా వస్త్రాలను నేరుగా కొనుగోలు చేస్తామన్నారు. భూదాన్‌ పోచంపల్లి మండలం కనుముకల గ్రామంలోని హ్యాండ్లూమ్‌ పార్కులో ఉత్పత్తయ్యే వస్త్రాలకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.

    ఆదుకునే చర్యలు చేపడతాం..
    రాష్ట్రవ్యాప్తంగా 70 వేల పవర్‌లూమ్స్‌ ఉంటే ఒక్క సిరిసిల్ల ప్రాంతంలోనే 40 వేలు ఉన్నాయని కేటీఆర్‌ పేర్కొన్నారు.  పవర్‌లూమ్స్‌ నిర్వాహకులకు వర్క్‌ ఆర్డర్‌ ఇస్తామన్నారు. గతంలో హైదరాబాద్‌లో ఉన్న లేపాక్షి కొనుగోలు కేంద్రాన్ని ‘గోల్కొండ’ పేరుతో రీబ్రాండింగ్‌ చేశామని.. అలాంటి స్టోర్లను రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేస్తామని చెప్పారు. దండుమల్కాపురంలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన స్థలాలు ఉన్నాయని.. ఇక్కడికి భారీ కం పెనీలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

    అక్కడి చేనేత వస్త్రాలకు ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి  విద్యార్థులకు అందించనున్న పాఠశాలల యూనిఫారాల తయా రీని జనవరి నుంచే ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, చేనేత–జౌళి శాఖ  డైరెక్టర్‌ శైలజారామయ్యర్, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాముగోపాల్, కలెక్టర్‌ అనితారామచంద్రన్, చేనేత జిల్లా ఏడీ పద్మ తదితరులు ఉన్నారు.

    కార్డుతో చీరలు కొన్న కేటీఆర్‌
    భూదాన్‌ పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి మండల పరిధిలోని హ్యాండ్లూమ్‌ పార్క్‌ను గురువారం సందర్శించిన మంత్రి కేటీఆర్‌.. అక్కడ తయారైన పట్టు చీరలు, డిజైన్లను చూసి మంత్రముగ్ధులయ్యారు. తన తల్లి, చెల్లెలు, సతీమణి కోసం ప్రముఖ డిజైనర్‌ చెల్న దేశాయ్‌ రూపొందించిన మూడు పట్టు చీరలు, కుమార్తె కోసం రెండు పట్టు పావడాలు కొనుగోలు చేశారు. రూ.45 వేల బిల్లును డెబిట్‌ కార్డు  ద్వారా స్వైప్‌ చేసి ‘నగదు రహితం’గా చెల్లించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement