తగ్గిస్తేనే ‘పవర్’! | Sakshi
Sakshi News home page

తగ్గిస్తేనే ‘పవర్’!

Published Wed, Jan 1 2014 10:49 PM

Nirupam demands reduction in power tariff in Mumbai

నాగపూర్: అవమానకరమైన పరాభవం నుంచి కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో గట్టెక్కించాలన్నా, మళ్లీ అధికారంలోకి రావాలన్నా విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని రైతు సంఘాలు ముఖ్యమంత్రి చవాన్‌ను కోరాయి. మరోసారి కాంగ్రెస్‌కు అధికారం దక్కాలంటే విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని విదర్భ జనాందోళన్ సమితి అధ్యక్షుడు కిషోర్ తివారీ సూచించారు. కేవలం 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న ఢిల్లీ రాష్ట్రమే మంచినీటి బిల్లులు, విద్యుత్ బిల్లులలో ఆ రాష్ట్ర ప్రజలకు సబ్సిడీ ఇస్తోందని, రూ.1,60,000 కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో అటువంటి సబ్సిడీలు ఇవ్వడం ఎంతైనా అవసరమన్నారు.

ముఖ్యంగా ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్న విదర్భ ప్రాంతంలో ఢిల్లీ తరహా పథకాలను అమలు చేయాల్సిన అవసరముందన్నారు. ‘నయా ప్రపంచీకరణ ప్రచార కర్త చవాన్ కూడా కేజ్రీవాల్ తరహా పాలనను రాష్ట్ర ప్రజలకు అందించి, వచ్చే ఎన్నికల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తేవాల’ని తివారీ పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ను ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తిగాఅభివర్ణించారు. రాజకీయాల్లో వ్యాపారవర్గాల జోక్యంతో 1991 నుంచి విద్యుత్, జలరంగాలను అనేక రాష్ట్రాలు ప్రైవేటీకరించే దిశగా అడుగులేస్తున్నాయని, దీనిపై ఆయా రాష్ట్రాల్లో ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పేదలకు, గిరి జనులకు, రైతులకు ఉచితంగానే నీటిని సరఫరా చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. రైతుల కోసం బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు ఉండాలని, రైతు సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా ఆప్ తరహా పథకాలను అమలు చేయాలని తివారీ కోరారు.

Advertisement
Advertisement