జయలలిత చికిత్స వీడియో దృశ్యాలు లేవు!! | Sakshi
Sakshi News home page

జయలలిత చికిత్స వీడియో దృశ్యాలు లేవు

Published Thu, Sep 20 2018 12:16 PM

No Video Footage To Jayalalitha treatment :  Apollo Hospital - Sakshi

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణ మిస్టరీ వీడేనా? పలువురిలో చోటుచేసుకున్న అనుమానపు మేఘాలు విచారణ కమిషన్‌ నివేదికతో తొలగిపోయేనా?.. అన్న ప్రశ్నలకు సమా«ధానం దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. జయ విచారణలో కీలకమైన జయకు చికిత్స వీడియో దృశ్యాలు చెరిగిపోయినట్లు అపోలో ఆస్పత్రి  చెప్పడంతో కమిషన్‌కు కొత్త చిక్కు వచ్చి పడింది.

సాక్షి ప్రతినిధి, చెన్నై: దేవుళ్లలా కొలుచుకునే రాజకీయ నేతలకు అస్వస్థత చేకూరినపుడు ప్రజలు తల్లడిల్లిపోవడం సహజమే. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడే ఎంజీ రామచంద్రన్‌ తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలయ్యారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో, ఆ తరువాత అమెరికాలో ఆయన చికిత్స పొందారు. ప్రజల కోరిక మేరకు ఆస్పత్రిలో ఎంజీఆర్‌ చికిత్స పొందుతున్న దృశ్యాలను మీడియాకు విడుదల చేశారు. అమెరికాలో చికిత్స పొందుతూనే ఎంజీఆర్‌ మరణించినా ప్రజలు ఎలాంటి అనుమానాలు వ్యక్తంచేయలేదు. అయితే అదే తీరులో జయలలిత సైతం ముఖ్యమంత్రి హోదాలోనే 2016 సెప్టెంబరు 22వ తేదీన అపోలో ఆస్పత్రిలో అడ్మిటయ్యారు. 

జ్వరం, డీహైడ్రేషన్‌ వంటి స్వల్ప అనారోగ్యమే, రెండు మూడు రోజుల్లో ఆమె డిశ్చార్జ్‌ అవుతారని వైద్యులు, ప్రభుత్వం ప్రకటించడంతో అమ్మ అభిమానులు ఊరట చెందారు. అయితే వైద్యులు చెప్పినట్లుగా అమ్మ విడుదల కాలేదు. జయ చికిత్స పొందుతున్న వీడియో లేదా ఫొటోలు విడుదల చేయాలని అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానులు అనేకసార్లు కోరారు. ఆరోగ్యం కుదుటపడిందనే రోజుల తరబడి ప్రచారాలు సాగుతుండగానే అదే ఏడాది డిసెంబరు 5వ తేదీన జయ కన్నుమూయడం చర్చనీయాంశమైంది. అన్నాడీఎంకేలోని వారేగాక ప్రతిపక్షాలు సైతం అనేక అనుమానాలు వ్యక్తంచేశాయి. సీబీఐ విచారణకు డిమాండ్‌ చేశాయి. పలుచోట్ల నుంచి ఒత్తిడి పెరగడంతో రిటైర్డు న్యాయమూర్తి ఆరుముగస్వామి చైర్మన్‌గా తమిళనాడు ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరు విచారణ కమిషన్‌ను నియమించింది.

జయ మరణంపై అనుమానాలు వ్యక్తం చేసిన సుమారు వందమందికి పైగా కమిషన్‌ ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. జయకు చికిత్స చేసిన అపోలో, ఢిల్లీ నిమ్స్‌ వైద్యులను సైతం కమిషన్‌ విచారించింది. ఈ దశలో అపోలో ఆస్పత్రిలో జయకు చికిత్స చేసిన వీడియో దృశ్యాలను కమిషన్‌ అనేకసార్లు కోరింది. అయితే వీవీఐపీలు చికిత్స పొందుతున్న గదుల్లో సీసీటీవీ కెమెరాలు ఉండవని అపోలో బదులిచ్చింది. అయితే  అపోలో మాటలకు భిన్నంగా ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల సమయంలో స్వతంత్య్ర అభ్యర్థి టీటీవీ దినకరన్‌ అనుచరుడు వెట్రివేల్‌ జయ చికిత్స పొందుతున్న వీడియో దృశ్యాలను విడుదల చేసి కలకలం రేపాడు. అవన్నీ గ్రాఫిక్‌ దృశ్యాలని కొందరు ఆక్షేపించినా శశికళే స్వయంగా చిత్రీకరించారని చెప్పడంతో అందరూ నమ్మారు. దీంతో అపోలో మరో వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

చెరిగిపోయాయని వివరణ
అపోలో ఆస్పత్రి న్యాయవాది మైనాబాష మాట్లాడుతూ, వీడియో దృశ్యాలపై కమిషన్‌కు వివరణ ఇచ్చామని తెలిపారు. ఆస్పత్రిలోని ముఖ్యమైన ప్రాంతాల్లో మాత్రమే సీసీటీవీ కెమెరాలు అమరుస్తామని, వీటిల్లోని దృశ్యాలు సైతం  వీవీఐపీలు ఉండేచోట కెమెరాలు ఉండవని తెలిపామని అన్నారు. ఈ కెమెరాల ద్వారా నమోదైన దృశ్యాలు నెలరోజులకు మించి ఉండవని, మరో దృశ్యాలు నమోదు కాగానే పాతవి ఆటోమేటిక్‌గా చెరిగిపోతాయని, ఇలానే జయ చికిత్స దృశ్యాలు సైతం చెరిగిపోయాయని పేర్కొంటూ ఈనెల 11వ తేదీన కమిషన్‌కు లిఖితపూర్వకంగా తెలియజేశామని అన్నారు.  

నిపుణులను పంపాలని నిర్ణయం
అపోలో ఇచ్చిన వివరణ, ఆస్పత్రిలో సీసీటీవీ సర్వర్లను పరిశీలించి చెరిగిపోయిన దృశ్యాలను సేకరించే వీలుందా తెలుసుకునేందుకు ఒక నిపుణుల బృందాన్ని అపోలో ఆస్పత్రికి పంపాలని కమిషన్‌ నిర్ణయించింది. వీవీఐపీలు చికిత్స పొందుతున్న చోట్ల సీసీటీవీ కెమెరాలు ఉండవని అపోలో ఇచ్చిన సమాధానంపై ఆస్పత్రి సిబ్బంది నుంచి సమాచారం రాబట్టాలని ఆదేశించింది. ఈ విషయపై అపోలో ఆస్పత్రి సీవోవో సుబ్బయ్య విశ్వనాథన్‌ను ఈనెల 25వ తేదీన మరోమారు హాజరు కావాలని కమిషన్‌ ఆదేశించింది. జయ మరణంపై ఇప్పటికే అనుమాన మేఘాలు కమ్ముకుని ఉండగా సీసీటీవీ దృశ్యాలు అందుబాటులో లేకపోవడం, శశికళ తదితరులను ఇంకా విచారించాల్సి ఉండడంతో మిస్టరీ వీడేనా అని ఆలోచనలో పడ్డారు.

Advertisement
Advertisement