ఒబామా.. గో బ్యాక్! | Sakshi
Sakshi News home page

ఒబామా.. గో బ్యాక్!

Published Sun, Jan 25 2015 12:31 AM

ఒబామా.. గో బ్యాక్! - Sakshi

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనను నిరసిస్తూ వామపక్షాల నేతృత్వంలో నిరసనలు హోరెత్తాయి. ఒబామా...గో బ్యాక్ అన్న నినాదం మిన్నంటింది. చెన్నైలోని అమెరికా దౌత్య కార్యాలయం ముట్టడికి యత్నించారు. మదురై, తిరుచ్చిల్లో నిరసనలు వాగ్యుద్ధానికి దారి తీశాయి.
 
 సాక్షి, చెన్నై : భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరు కానున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఒబామా, భార త ప్రధాని నరేంద్ర మోదీల మధ్య పలు అంశాలకు సంబంధించిన ఒప్పందాలు కుదరనున్నాయి. అయితే, ఈ ఒప్పందాలన్నీ భారత్ మీద ప్రభావం చూపించేవిగా, దేశ ప్రజల నడ్డి విరిచే రీతిలో సంతకాలు చేయనున్నారన్న సంకేతాలు వెలువడ్డాయి. భారత్‌ను నిర్బంధించి మరీ ఈ ఒప్పందాలకు అమెరికా కసరత్తులు చేసినట్టుగా ప్రచారం సాగింది. దీంతో ఒబామా పర్యటనను వ్యతిరేకిస్తూ నిరసనలకు వామపక్షాలు పిలుపునిచ్చాయి. భారత్‌లో చిల్లర వర్తకంలోకి విదేశీ పెట్టుబడుల వ్యవహారంతో పాటుగా దేశ ప్రజల మీద తీవ్ర ప్రభావాన్ని చూపించే రీతిలో సాగనున్న ఒప్పందాల సంతకాలను వ్యతిరేకించే విధంగా ఒబా మా పర్యటనను అడ్డుకునేందుకు పరుగులు తీశారు.
 
 నిరసనల హోరు
 సీపీఎం, సీపీఐల నేతృత్వంలో రాష్ట్రంలో వారికి పట్టున్న అన్ని ప్రాంతాల్లో శనివారం నిరసనలు చేపట్టారు. చెన్నై లో అమెరికా దౌత్య కార్యాలయం ముట్టడికి యత్నిం చారు. మదురైలో ప్రధాన తపాలా కార్యాలయాన్నిముట్టడించారు. తిరుచ్చిలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మరీ నిరసన చోటు చేసుకుంది. ఉదయాన్నే సీపీఎం శాసన సభా పక్ష నేత సౌందరరాజన్, సీపీఐ నాయకుడు వీర పాండియన్‌ల నేతృత్వంలో  ఆ పార్టీ అనుబంధ విభాగాల నాయకులు కార్యకర్తలు ర్యాలీగా జెమిని వంతెన సమీపంలోని అమెరికా దౌత్య కార్యాలయం ముట్టడికి బయలు దేరారు. ముందుస్తుగా అనుమతి కోరినా, పోలీసులు నిరాకరించడంతో ఆగ్రహంతో నిరసన కారులు ముందుకు సాగారు. వీరిని సమీపంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
 
 అక్కడ కాసేపు నిరసనకు అనుమతి ఇచ్చారు. దీంతో ఒబామాకు వ్యతిరేకంగా ప్లకార్డులు, వ్యంగ్య చిత్రాలను చేత బట్టి నిరసన తెలియజేశారు. ఒబామా గో బ్యాక్ అని నినదిస్తూ కాసేపు నిరసన అనంతరం అక్కడి నుంచి వెను దిరిగారు.  నిరసనను ఉద్దేశించి సౌందరరాజన్ మాట్లాడుతూ, భారత్‌ను నిర్బంధించి మరి కొన్ని రకాల సంతకాలకు అమెరికా ఒడి గట్టిందని ఆరోపించారు. అమెరికాకు చెందిన కొన్ని మందుల్ని అధిక ధరలో భారత్‌లో విక్రయించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ప్రజల మనో భావాలకు వ్యతిరేకంగా, భారత ప్రజల నడ్డి విరిచే విధంగా ఒబామా పర్యటన సాగనుందని, అందుకే వ్యతిరేకిస్తున్నామన్నారు.
 
 వాగ్యుద్ధం : మదురైలో సీపీఎం, సీపీఐ నాయకులు భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. అక్కడి ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఒబామాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, గో బ్యాక్ అని హెచ్చరిస్తూ ఆ కార్యాలయంలోకి దూసుకెళ్లే యత్నం చేశారు. దీనిని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్యుద్ధం, తోపులాట చోటు చేసుకుంది. చివరకు ఆందోళన కారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. తిరుచ్చిలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. అయినా, నిరసనకు దిగారు. సీపీఎం అభ్యర్థి అన్నాదురై నేతృత్వంలో ఆ పార్టీ వర్గాలు ఒబామాకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాగ్యుద్ధం, తోపులాట చోటు చేసుకుంది. చివరకు ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement