రూ. 2 కోట్లకు ఆన్‌లైనేశాడు | Sakshi
Sakshi News home page

రూ. 2 కోట్లకు ఆన్‌లైనేశాడు

Published Tue, Feb 7 2017 4:27 PM

రూ. 2 కోట్లకు ఆన్‌లైనేశాడు - Sakshi

ఖాతాదారుల సొమ్ము సొంత అకౌంట్‌లోకి తరలింపు 
ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ పేరిట బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో మోసం 
ఆరు లక్షలతో కారు కొనుగోలు.. రూ.25 లక్షలు స్వాహా 
పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు 
 
షాద్‌నగర్‌ క్రైం: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పాత నోట్ల రద్దు నిర్ణయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నారు.. ఎలాగైనా డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచన వారిని పక్కదారి పట్టించింది. ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ అంటూ ఏకంగా బ్యాంకులోనే కౌంటర్‌ తెరిచారు. ఖాతాదారుల నుంచి నగదు తీసుకున్న వారు ఖాతాదారుల అకౌంట్లో జమ చేయకుండా తమ అకౌంట్లో వేసుకున్నారు. ఖాతాదారుల సొమ్ముతో ఖరీదైన కారు కొనుగోలు చేసిన ప్రబుద్ధులు చివరకు అడ్డంగా దొరికిపోయి పోలీసు విచారణలో ఉన్నారు.. వివరాల్లోకి వెళితే... ఫరూఖ్‌నగర్‌ మండల కేంద్రానికి చెందిన బుడ్డోల్ల శ్రీకాంత్‌ గౌడ్‌ పట్టణంలో గాంధీనగర్‌ కాలనీలో ఆన్‌లైన్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు.
 
కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్న కొందుర్గు మండలం రాంచంద్రాపూర్‌ గ్రామానికి చెందిన బుడ్డోళ్ల శ్రీకాంత్‌ను పనిలో పెట్టుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో బ్యాంకుల్లో రద్దీ బాగా పెరగడంతో పట్టణానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అధికారులు తమ బ్యాంకులోనే ఆన్‌లైన్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో బ్యాంకుకు వచ్చే ఖాతాదారులు చాలామంది గంటల తరబడి క్యూలో నిలబడలేక తమ వద్ద ఉన్న నగదును కౌంటర్‌లో ఉన్న బుడ్డోళ్ల శ్రీకాంత్‌కు ఇచ్చి కౌంటర్‌ ఫైల్‌ తీసుకుని వెనుదిరిగేవారు. ఈ తరహాలో నవంబరు 10 నుండి డిసెంబరు 21 వరకు 127 మంది ఖాతాదారులు మొత్తం రూ. 2 కోట్ల మేర ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ కోసం శ్రీకాంత్‌కు ముట్టజెప్పారు. ఇదిలా ఉండగా ఎంతకీ తమ డబ్బులు సంబంధిత అకౌంట్లలో జమకాకపోవడంతో ఖాతాదారులు బ్యాంకు మేనేజరును సంప్రదించి విషయం ఏంటని వాకబు చేయగా అసలు విషయం బయట పడింది.
 
ఖాతాదారుల నుండి తీసుకున్న నగదును వారి అకౌంట్లలో వేయకుండా శ్రీకాంత్‌ తమ సొంత సేవింగ్‌ ఖాతాలో జమచేసిన విషయాన్ని బ్యాంకు అధికారులు గుర్తించారు. వెంటనే అకౌంట్‌ ఫ్రీజ్‌ చేసి ఖాతాదారుల ఖాతాలకు డబ్బులు మార్పిడి చేశారు. ఖాతాదారుల నుంచి తీసుకున్న నగదులో రూ. 6 లక్షలను మహబూబ్‌నగర్‌కు చెందిన జై రామా మోటార్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో కారు కొనుగోలు కోసం ఆర్టీజీఎస్‌ ద్వారా నగదును ట్రాన్ఫ్‌ర్‌ చేసినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. శ్రీకాంత్‌ సేవింగ్‌ ఖాతాలో ఉన్న నగదును బ్యాంకు అధికారులు స్వాధీనం చేసుకోగా ఇంకా రూ. 25,91,694 లక్షల నగదు ఖాతాదారుల నుంచి తీసుకుని శ్రీకాంత్‌ తన సొంత అవసరాలకు వాడుకున్నాడని గుర్తించారు. ఈ మేరకు షాద్‌నగర్‌ పోలీసులకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సీనియర్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ సూర్యనారాయణ ఫిర్యాదు చేశారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు నిందితులను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు.
 
 

Advertisement
Advertisement