పర్యటనకు పన్నీరు | Sakshi
Sakshi News home page

పర్యటనకు పన్నీరు

Published Tue, May 2 2017 2:30 AM

పర్యటనకు పన్నీరు

► ఐదు నుంచి శ్రీకారం
► కాంచీపురం నుంచి ప్రారంభం
► మద్దతుదారుల అభిప్రాయ సేకరణకు నిర్ణయం
► విలీనానికి ఇక మంగళం


రాష్ట్ర పర్యటనకు మాజీ సీఎం పన్నీరు సెల్వం సిద్ధం అవుతున్నారు. అన్నాడీఎంకే కార్యకర్తల్ని తన వైపు తిప్పుకునే దిశగా ఈనెల ఐదో తేదీ నుంచి పయనానికి కార్యాచరణ సిద్ధం చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. కాంచీపురం నుంచి ఈ పర్యటనకు శ్రీకారం చుట్టేందుకు నిర్ణయించినట్టు ఆ శిబిరం వర్గాలు పేర్కొంటున్నాయి. పన్నీరు పర్యటన నేపథ్యంలో ఇక విలీనం చర్చలకు మంగళం పాడినట్టేనన్నది స్పష్టం అవుతోంది.

సాక్షి, చెన్నై: సీఎం పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే(అమ్మ)లోకి మాజీ సీఎం పన్నీరు సెల్వం నేతృత్వంలోని(పురట్చి తలైవి)శిబిరం విలీనం లక్ష్యంగా సాగిన ప్రయత్నాల గురించి తెలిసిందే. అదిగో.. ఇదిగో అని ఊపందుకున్న చర్చల నినాదం, తదుపరి రహస్య మంతనాలకు దారి తీసింది. అమ్మ శిబిరం ఆఫర్లు ఇచ్చినా పన్నీరు మెట్టు దిగలేదు.

శశికళ, దినకరన్‌ కుటుంబీకులందర్నీ శాశ్వతంగా పార్టీ నుంచి సాగనంపాల్సిందేనని, అమ్మ మరణం మిస్టరీ తేల్చడం లక్ష్యంగా విచారణకు ఆదేశించాల్సిందేనని పట్టుబట్టారు. ఇందుకు పళని అంగీకరించ లేదని చెప్పవచ్చు. సేలం పర్యటనలో పార్టీ వర్గాలతో సాగిన సమావేశంలో పళనిస్వామి వ్యాఖ్యలు పన్నీరు శిబిరంలో ఆగ్రహాన్ని తెప్పించినట్టు సమాచారం.

పళని వ్యాఖ్యలు:  సేలం వేదికగా ఆదివారం జరిగిన సమావేశంలో ఆ మేరకు  ఆ రెండు డిమాండ్లలో ఒకటి కోర్టులోనూ, మరొకటి ఎన్నికల కమిషన్‌ ముందు ఉండగా, తానెలా అడ్డుకట్ట వేయగలనని, నేరవేర్చేందుకు హామీ ఇవ్వగలనని సీఎం స్పందించినట్టు సమాచారం. తాను ఎలాంటి నిబంధనలు పెట్టలేదని, వారు మాత్రం మెట్టు దిగరని అసంతృప్తిని వ్యక్తం చేసి ఉన్నారు. అధికారం, పార్టీ తమ చేతుల్లోనే ఉందంటూ, బలం పెరుగుతున్నదే గానీ, తరగడం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, వస్తే లాభం, రాకుంటే ఏ ప్రయోజనం లేదంటూ  విలీన చర్చలపై పళని స్వామి స్పందించిన సమాచారం పన్నీరు శిబిరం చెవిన పడినట్టున్నాయి.

ప్రజల్లోకి పన్నీరు: పలువురు మంత్రులు చర్చల విషయంగా నోటికొచ్చింది వాగుతుండడాన్ని ఇన్నాళ్లు మౌనంగా భరించిన పన్నీరు శిబిరం, తాజాగా సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. పార్టీ సమావేశంలో సీఎం స్పందించిన సమాచారం తమ దృష్టికి రావడంతో ఇక చర్చలు అవసరమా అన్న ప్రశ్నను పన్నీరు మద్దతుదారులు తెర మీదకు తెచ్చి ఉన్నారు. సోమవారం గ్రీన్‌వేస్‌ రోడ్డులోని తన నివాసంలో మద్దతుదారులతో పన్నీరు సెల్వం సుదీర్ఘ మంతనాల్లో మునిగారు. సేలం వేదికగా మద్దతు దారుల నుంచి  విలీనం వద్దే వద్దన్న నినాదం తెర మీదకు రావడంతో ఇక, ఆచితూచి స్పందించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.

చర్చల విషయాన్ని పక్కన పెట్టి, కేడర్, ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు సిద్ధమైనట్టుంది. జిల్లాల వారీగా సభలు సమావేశాలకు తగ్గ కార్యాచరణను సిద్ధం చేసుకుని కాంచీపురం నుంచి ఈ నెల ఐదో తేదీ నుంచి రాష్ట్ర పర్యటనకు పన్నీరు రెడీ అవుతున్నారన్న సమాచారం బయటకు పొక్కింది. ఈ విషయాన్ని  అధికారికంగా ప్రకటించకున్నా, ఐదో తేదీ నుంచి పన్నీరు పర్యటన సాగడం ఖాయం అని ఆ శిబిరం వర్గాలు పేర్కొంటున్నాయి. పన్నీరు శిబిరానికి చెందిన ఎమ్మెల్యే సెమ్మలై మీడియాతో మాట్లాడుతూ సీఎం పళనిస్వామి మీద విమర్శనాస్త్రాలు సంధించడం గమనార్హం. ఇదిలా ఉండగా ప్రస్తుతానికి బెదిరింపులతో కాలం నెట్టుకువస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే తోపు వెంకటాచలంతోపాటుగా 13 మంది ఎమ్మెల్యేలు రహస్య మంతనాల్లో మునగడం గమనార్హం. సీఎం పళనిస్వామికి మరిన్ని బెదిరింపులు ఇచ్చే రీతిలో వీరి మంతనాలు సాగుతున్నట్టు సమాచారం.

Advertisement
Advertisement