Sakshi News home page

విద్యుత్ రంగంలో స్వావలంబనే ధ్యేయం

Published Fri, May 8 2015 11:53 PM

విద్యుత్ రంగంలో స్వావలంబనే ధ్యేయం

- కోల్‌ఇండియాలో భాగస్వామ్యంపై ఆప్ సర్కార్ చర్చలు
- ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలుతో ప్రభుత్వంపై భారం
- 2017 నాటికి డిమాండ్ 8,700 మెగావాట్లకు చేరుతుందని అంచనా
సాక్షి, న్యూఢిల్లీ:
విద్యుత్ రంగంలో ఢిల్లీ నగరం ఇతరులపై ఆధారపడకుండా తన కాళ్లపై నిలబడేలా ఆప్ సర్కార్ చేయాలనుకుంటోంది. ఇందులో భాగంగా కోల్ ఇండియా లిమిటెడ్ ఒడిశాలోని సుందర్‌గడ్ జిల్లాలో ఏర్పాటుచేయనున్న థర్మల్‌పవర్ ప్లాంటులో భాగస్వామ్యాన్ని కోరుకుంటోంది.

ఈ 1,600 మెగావాట్ల ప్లాంటులో భాగస్వామిగా మారడం వల్ల విద్యుత్తు కోసం ఇతరులపై ఆధారపడవలసిన అవసరం తగ్గుతుందని ఆప్ భావిస్తోంది. ఈ విషయమై ఆప్ సర్కారు కోల్ ఇండియా లిమిటెడ్ అధికారులతో చర్చలు జరుపుతోంది. అయితే ఈ విషయంపై ఇంతవరకు  నిర్ణయం వెలువడలేదు. విద్యుత్ రంగంలో ఢిల్లీకి స్వావలంబన కల్పిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది.

ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సి రావడం వల్ల ఢిల్లీ ప్రభుత్వంపై అధిక భారం పడుతోంది. సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసినట్లయితే నగర వాసులకు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేయవచ్చని ఆప్ సర్కారు భావిస్తోంది. ఇందుకోసం బొగ్గు బ్లాక్‌ను సొంతం చేసుకోవడంతో పాటు ఇతరులతో కలిసి విద్యుదుత్పాదన ప్లాంట్లు ఏర్పాటుచేయడానికి ఆసక్తి చూపుతోంది. కోల్‌బ్లాక్‌ను మంజూరుచేయాలని కోరుతూ ఢిల్లీ సర్కారు కేంద్రానికి ఇప్పటికే లేఖలు రాసింది. దీంతో పాటు కోల్ ఇండియా లిమిటెడ్‌తో కలిసి సుందర్‌గడ్ జిల్లాలో థర్మల్ పవర్ ప్లాంటు ఏర్పాటు చేయాలనుకుంటోంది.

రాజధానిలో విద్యుత్ డిమాండ్ 2017 నాటికి 8,700 మెగావాట్లకు చేరుతుందని కేంద్ర విద్యుత్ అథారిటీ అంచనా. గతేడాది నమోదైన పీక్ విద్యుత్ డిమాండ్ 5,925 మెగావాట్లు కాగా ఈ సంవత్సరం అది 6,500 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని విద్యుతుత్పాదన కేంద్రాల ద్వారా 1,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. నగరానికి సరఫరా అయ్యే విద్యుత్‌లో దాదాపు 70 శాతం బయటి నుంచి కొనుగోలు చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement