హోదాపై కేంద్రం అబద్ధాలు | Sakshi
Sakshi News home page

హోదాపై కేంద్రం అబద్ధాలు

Published Tue, Feb 21 2017 1:47 AM

హోదాపై కేంద్రం అబద్ధాలు - Sakshi

చేనేత గర్జన సభలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌
చంద్రబాబు చేనేత కార్మికులకు హామీ ఇచ్చి మాట తప్పారని ధ్వజం

సాక్షి, గుంటూరు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తోందని సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఓట్లకు వచ్చినప్పుడు ఇచ్చిన హామీలపై పదవుల్లోకి వచ్చాక ఎందుకు నిలబడటంలేదని ప్రశ్నించారు. గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ ఎదుట రాష్ట్ర పద్మశాలీ సాధికారత సంఘం సోమవారం చేపట్టిన ‘చేనేత ఐక్య గర్జన’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా సంఘం నేతలు చేపట్టిన సత్యాగ్రహ దీక్ష శిబిరాన్ని సందర్శించి, సంఘం అధ్యక్షుడు కేఏఎన్‌ మూర్తికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

అనంతరం జరిగిన సభలో పవన్‌ మాట్లాడుతూ.. కేంద్రం ఇప్పుడు స్పెషల్‌ ప్యాకేజీ అంటోందని, దానికి చట్టబద్ధత కల్పిస్తామంటూ మరోసారి మోసగిస్తోందని అన్నారు.  ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతే నేరుగా చెప్పాలని, అప్పుడుæ వారిని ఏం చేయాలో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. పాదయాత్ర సమయంలో చంద్రబాబు చేనేత సమస్యలు తీరుస్తామని హామీలు ఇచ్చి ఎందుకు మాట తప్పారని ప్రశ్నించారు. తాను చేనేతలకు మద్దతు ఇస్తే వడ్డించే వాళ్లను వదిలేసి, ఎంగిలి విస్తర్లు ఏరుకునే వారి వద్దకు ఎందుకు వెళ్తారంటూ కొందరు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని చెప్పారు. తాను ఆ మాటలకు గర్వపడుతున్నానని అన్నారు.

Advertisement
Advertisement