మూడో కూటమిలో పవార్ చేరరు: ముండే | Sakshi
Sakshi News home page

మూడో కూటమిలో పవార్ చేరరు: ముండే

Published Thu, Oct 31 2013 11:52 PM

pawar won't join in 3rd front : gopinath munde

 ముంబై: మూడో కూటమి పేరుతో పలు పార్టీల నేతలు ఒక్కచోట చేరడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కేంద్రంలో మద్దతునివ్వడమేగాకుండా మహారాష్ట్రలో కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్న రాష్ట్రవాది కాంగ్రెస్(ఎన్సీపీ) మూడో కూటమి నేతలతో సన్నిహితంగా మెలగడం రాష్ట్రంలో కొత్త రాజకీయ చర్చకు దారితీసింది. బుధవారం ఢిల్లీలో వామపక్షాలు నిర్వహించిన  కార్యక్రమంలో మూడో కూటమిలో చేరే సభ్యులుగా చెప్పుకుంటున్న పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎన్సీపీ నేత డీపీ త్రిపాఠి హాజరు కావడంతో మిత్రపక్షమైన కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్ష బీజేపీ కూడా స్పందించింది. బీజేపీ సీనియర్ నేత గోపీనాథ్ ముండే ఈ విషయమై గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
 
  ‘పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ మూడో కూటమిలో చేరదు. నా అంచనా ప్రకారం పవార్ మూడో కూటమిలో చేరే ఆలోచన చేయకపోవచ్చు. లోక్‌సభ ఎన్నికల  కోసం ఇరు పార్టీల మధ్య సీట్ల కేటాయింపు విషయమై ఈ మధ్య కాలంలో కొన్ని విభేదాలు తలెత్తాయి. తాము కోరినన్ని సీట్లను కాంగ్రెస్ ఇచ్చేలా, పాత పొత్తునే కొనసాగించేలా కాంగ్రెస్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకే ఎన్సీపీ మూడో కూటమి సభకు హాజరై ఉండవచ్చు. తమ పంతాన్ని నెగ్గించుకేనుందుకు, కాంగ్రెస్‌ను దారికి తెచ్చుకునేందుకే ఎన్సీపీ అధినేతఈ పాచిక వేశారని నేననుకుంటున్నా. ఇక  అత్యాచార నిందితులకు శిక్ష విషయంలో అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గతంలో కూడా అజిత్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. క్షమాపణ చెప్పే పరిస్థితి కొనితెచ్చుకున్నారు. మీడియా గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు క్షమాపణలు చెప్పాల్సిందిగా శరద్‌పవార్ ఆదేశించినా ఆయన చెప్పలేదు. పండగపూట విద్యుత్ కోతలు విధించడాన్ని కూడా అజిత్ పరిహాసం చేశారు. ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించడంలే’న్నారు. కాగా పవార్ స్పందిస్తూ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏలోనే కొనసాగుతామన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement