మావోయిస్టులు.. పోలీసులు.. అరుదైన దృశ్యం | Sakshi
Sakshi News home page

మావోయిస్టులు.. పోలీసులు.. అరుదైన దృశ్యం

Published Sun, Oct 9 2016 12:49 PM

మావోయిస్టులు.. పోలీసులు.. అరుదైన దృశ్యం - Sakshi

విశాఖపట్నం: పోలీసులు, నక్సలైట్లు ఎదురుపడితే ఒకరినొకరు తుపాకులతో కాల్చుకుంటారన్నది తెలిసిందే. అయితే ఎదురుకాల్పుల్లో గాయపడ్డ మావోయిస్టులకు పోలీసులు రక్తదానం చేయడం మాత్రం అరుదు. అలాంటి దృశ్యమే విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

విశాఖ ఏజెన్సీలోని పెదపాడు, కుంకుమపూడిల మధ్య కూంబింగ్ నిర్వహిస్తోన్న స్పెషల్ పార్టీ పోలీసులకు బుధవారం రాత్రి గాలికొండ దళ సభ్యులు తారాసపడ్డారు. ఇరువైపుల నుంచి కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో గెమ్మెలి నర్సింగ్, మువ్వల అబ్బులు అలియాస్‌ అంబ్రి అనే మావోయిస్టు దళసభ్యులకు బుల్లెట్ గాయలయ్యాయి. మిగతావారు తప్పించుకుని పారిపోగా, అక్కడే పడి ఉన్న ఇద్దరు మావోయిస్టులను పోలీసులు కింగ్ జార్జి ఆసుపత్రికి తరలించారు. విశాఖ ఎస్పీ రాహుల్‌ దేవ్‌ నేతృత్వంలో స్పెషల్‌ పార్టీ పోలీసులు దగ్గరుండిమరీ మావోయిస్టులకు వైద్యం చేయిస్తున్నారు.

మావోయిస్టులకు పోలీసుల రక్తం దానం
బుల్లెట్‌ గాయాలైన గెమ్మెలి నర్సింగ్, మువ్వల అంబ్రిలకు కేజీహెచ్‌ వైద్యులు శనివారం ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ కు కావాల్సిన రక్తాన్ని స్పెషల్‌ పార్టీ పోలీసులు ఇవ్వడం విశేషం. శనివారం కేజీహెచ్‌ బ్లాడ్‌ బ్యాంకులో కానిస్టేబుల్స్‌ జి.రామునాయుడు,  టి. శ్రీనివాసురావులు తమ రక్తాన్ని దానంచేశారు. అనంతరం ఈ ఇద్దరు మావోయిస్టులకు ఆర్థోపెడిక్‌ డాక్టర్‌ ధర్మరావు ఆపరేషన్ నిర్వహించారు. కేజీహెచ్‌ ట్రామా కేర్‌ సెంటర్‌లో ఈ ఇద్దరిని కట్టుదిట్టమైన రక్షణ మధ్య ఉంచారు. వీరికి రక్షణగా స్పెషల్‌పార్టీ పోలీసులు ఎస్‌ఐ మన్మథరావు, ఇద్దరు ఏఎస్‌ఐలు, 20 మంది కానిస్టేబుళ్లు పహారా కాస్తున్నారు. వృత్తిపరమైన వైరాన్ని పక్కనబెట్టి..  తమ సొంత అన్నదమ్ముల మాదిరిగా చూసుకుంటున్నారు. అల్పహారంతో పాటు భోజనం కూడా దగ్గరుండి తినిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని చూసుకుంటూ వైద్యం చేయిస్తున్నారు.

 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement