సీఎం దీపానే ! | Sakshi
Sakshi News home page

సీఎం దీపానే !

Published Sat, Jan 7 2017 6:36 AM

సీఎం దీపానే !

► అన్నాడీఎంకే కార్యకర్తల బ్యానర్లు
► దీప, భర్త మాధవన్ లపై ఒత్తిడి
► దీప ఇంటికి తండోపతండాలుగా అభిమానులు
► నా రాజకీయ పయనాన్ని ఏశక్తి అడ్డుకోలేదు : దీప


సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయాల్లోకి రావాలని జయలలిత అన్న కుమార్తె దీపపై రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతోంది. చెన్నై టీనగర్‌లోని దీప ఇంటికి ప్రతిరోజూ వేలాది మంది అన్నాడీఎంకే కార్యకర్తలు వస్తూ రాజకీయాల్లోకి రావాలని బతిమాలుతున్నారు. చేతులు పట్టుకుని మరీ వేడుకుంటున్నారు. అమ్మ ఆసుపత్రి పాలయ్యే వరకు దీప ఎవరో తెలియదు. అత్తను చూడాలని అపోలో ఆసుపత్రి వద్ద పడిగాపులు కాసినపుడు తొలిసారిగా దీప పేరు బాహ్య ప్రపంచానికి కొద్దిగా పరిచయమైంది. అమ్మ భౌతికకాయాన్ని సందర్శించేందుకు వచ్చిన  దీపను అడ్డుకోవడం, ఎంతో కష్టం మీద తన అత్తకు నివాళులర్పించాల్సి వచ్చిందని మీడియా వద్ద దీప మొరపెట్టుకున్నపుడు దీప పేరు మరింత ప్రచారంలోకి వచ్చింది.

జయలలిత ఆస్తికి, రాజకీయానికివారసులు ఎవరు, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఎవరికి అనే ప్రశ్నలు తలెత్తినపుడు శశికళతోపాటు దీప పేరు మార్మోగిపోయింది. అన్నాడీఎంకేలోని అగ్రనేతల ప్రాభవంతో శశికళ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టినా పార్టీ నేతలు, కార్యకర్తల్లో దీప ప్రభావాన్ని మాత్రం చెరిపివేయలేక పోయారు. జయ వారసురాలు దీప మాత్రమే అనే నినాదంతో చెన్నై టీనగర్‌లోని దీప ఇంటికి వేలాది మంది రావడం కొన్ని రోజులుగా కొనసాగుతోంది. దీప వారందరితో ఓపిగ్గా మాట్లాడుతూ నచ్చజెప్పి పంపుతున్నారు. దీప ఇంట్లో లేని సమయాల్లో ఆమె భర్త మాధవన్ కార్యకర్తలను కలుస్తున్నారు.

తనను కలుసుకునేందుకు వచ్చే కార్యకర్తల వివరాలను నమోదు చేసేందుకు దీప తన ఇంటి ముందు ఒక రిజిస్టర్‌ను ఏర్పాటు చేశారు. గురు, శుక్రవారాల్లో తిరునెల్వేలి, తూత్తుకూడి, దిండుగల్లు, మదురై, కోయంబత్తూరు, విళుపురం, ఈరోడ్, తిరువణ్ణామలై, తిరుప్పూరు 14 జిల్లాల నుంచి కార్యకర్తలు తరలివచ్చారు. జనం సాధారణ సంఖ్యలో ఉన్నపుడు ఇంటి ముంగిట, ఎక్కువగా ఉన్నపుడు మిద్దెపై బాల్కనీ నుంచి రెండాకుల గుర్తులా రెండువేళ్లను చూపడం ద్వారా మరింత ఉత్సాహపరుస్తున్నారు.

రాజకీయ పయనాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు
తన రాజకీయ పయనాన్ని ఏ శక్తులు అడ్డుకోలేవని దీప శుక్రవారం ప్రకటించారు. జయలలిత పేరు, ప్రతిష్టలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆమె అన్నారు. రాజకీయాల్లోకి  ప్రవేశించే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తానని పునరుద్ఘాటించారు. రాజకీయ ప్రవేశం గ్యారంటీ అనే ధోరణిలో దీప మాట్లాడగానే కార్యకర్తలు చప్పట్లు చరుస్తూ ఆనందంతో రెచ్చిపోయారు. జయలలిత ప్రాతినిథ్యంవహించిన ఆర్కేనగర్‌ నుంచి పోటీ చేస్తారా అనే ప్రశ్నకు కార్యకర్తలను సమావేశపరిచి నిర్ణయం తీసుకుంటానని అన్నారు. దీప రాజకీయాలకు తన పూర్తి అండదండలు ఉంటాయని భర్త మాధవ¯ŒS తన ఇంటికి వచ్చిన మీడియాతో చెప్పడం గమనార్హం.

అండగా మేమున్నామని కార్యకర్తల భరోసా
రాజకీయ ప్రవేశంపై ఇన్నాళ్లూ స్పష్టం చేయని దీప శుక్రవారం తనను కలిసేందుకు వచ్చిన వారితో తన రాజకీయ పయనాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని చెప్పడం వారిలోని ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఎంజీఆర్‌ హయాం నుంచి పార్టీలో ఉన్నాం, ఎవరి గురించి మీరు భయం పెట్టుకోవద్దు, దీపను చూస్తుంటే అమ్మను చూసినట్లే ఉంది, జయలలిత వారసురాలిగా దీప మాత్రమే ఉండాలని కార్యకర్తలు భరోసా ఇచ్చారు. కొందరు మహిళా కార్యకర్తలు దీప భర్త చేతులు పట్టుకుని కన్నీరుపెట్టుకున్నారు. దీప ఇంటి ముందు కాబోయే ముఖ్యమంత్రి అనే నినాదంతో బ్యానర్లు కట్టారు. ఎంజీఆర్, జయలలిత, దీప ఫొటోలను అమ్మే అంగడి సైతం దీప ఇంటి ముందు వెలిసింది. కార్యకర్తల సందడితో ఫొటోల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement