సహకార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శ్యామ్‌భట్ | Sakshi
Sakshi News home page

సహకార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శ్యామ్‌భట్

Published Wed, Jun 22 2016 4:23 AM

Principal Secretary Cooperation As syambhat

బెంగళూరు:  బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ(బీడీఏ) కమిషనర్ శ్యామ్‌భట్‌ను రాష్ట్ర సహకార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదే సందర్భంలో విపత్తుల నిర్వహణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న డాక్టర్ రాజ్‌కుమార్ ఖాత్రీని బీడీఏ కమిషనర్‌గా బదిలీ చేసింది. కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్(కేపీఎస్‌సీ) అధ్యక్షుడిగా శ్యామ్‌భట్‌ను నియమించాలని స్వయంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే ప్రయత్నించారు. కేపీఎస్‌సీ అధ్యక్షుడిగా శ్యామ్‌భట్ పేరును సిఫార్సు చేస్తూ, ఇందుకు ఆమోదం తెలపాల్సిందిగా గవర్నర్‌కు సైతం సిఫార్సు లేఖను పంపారు. అయితే శ్యామ్‌భట్‌పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో గవర్నర్ ఆ ప్రభుత్వ సిఫార్సును తిరస్కరించారు. అయితే సీఎం పట్టు వీడకుండా రెండో సారి శ్యామ్‌భట్ పేరును కేపీఎస్‌సీ అధ్యక్ష పదవికి సిఫార్సు చేశారు.


రెండో సారి సైతం గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా ప్రభుత్వ సిఫార్సును  తిప్పిపంపారు. ఇదే సందర్భంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్యామ్‌భట్‌ను కేపీఎస్‌సీ అధ్యక్షుడిగా నియమించడం ఎంత మాత్రం సరికాదంటూ ఇతర పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు సైతం నినదించాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంపై ఇంకా పట్టుపడితే ప్రజల నుండి విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తుందని భావించిన సీఎం తన నిర్ణయాన్ని విరమించుకొని శ్యామ్‌భట్‌ను సహకార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement