ఖైదీలకు ధ్యానం కోర్సు | Sakshi
Sakshi News home page

ఖైదీలకు ధ్యానం కోర్సు

Published Tue, May 20 2014 10:15 PM

ఖైదీలకు ధ్యానం కోర్సు

 నాసిక్ రోడ్ కేంద్ర కారాగార అధికారుల యోచన

 నాసిక్: నాసిక్ రోడ్ కారాగారంలోని ఖైదీలకు ధ్యానంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం సంబంధిత ఉన్నతాధికారులు ఇగత్‌పురిలోని విపస్సన అంతర్జాతీయ అకాడమీ నిర్వాహకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఖైదీల ఆలోచనలు, ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి తాము ఈ ప్రయత్నం చేస్తున్నామని సూపరింటెండెంట్ జయంత్‌నాయక్ తెలిపారు. ఈ కారాగారంలో మొత్తం 2,200 ఖైదీలు ఉన్నారు. వీరిలో 70 శాతంమంది జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరంతా తమ కుటుంబసభ్యుల గురించి ఆలోచించడమే కాకుండా ఆందోళనకు కూడా గురవుతుంటారు. ఈ రకమైన ఒత్తిడి నుంచి బయటపడే యంతో, వారిలో సానుకూల శక్తిని పెంపొందించాలనే భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
 
రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కారాగార ప్రాంగణంలో ఓ హాలును నిర్మిస్తామన్నారు. అయితే తమ ప్రతిపాదనకు సంబంధించి విపస్సన సంస్థనుంచి ఇంకా ఎటువంటి స్పందనా రాలేదన్నారు. ఒకేసారి 30 మంది ఖైదీలు ధ్యానంలో కూర్చునేందుకు వీలుగా సదరు హాలును నిర్మించాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఇదే విషయమై విపస్సన కేంద్రం కోర్సు మేనేజర్ దిలీప్ దేశ్‌పాండే మాట్లాడుతూ 1990-94 మధ్యకాలంలో అనేకమంది ఖైదీలకు ధ్యానంపై శిక్షణ ఇప్పించామన్నారు. అయితే ఆ తరువాత కొంతమంది అధికారులు బదిలీ కావడం, పరిస్థితులు అనుకూలించకపోవడంతో కోర్సును నిలిపివేయాల్సి వచ్చిందన్నారు.  ఇందుకు సంబంధించి ప్రభుత్వంకూడా ఏదైనా జీఆర్ జారీ చేస్తే బాగుంటుందన్నారు. అలా అయితే మున్ముందు ఈ కోర్సు నిర్విఘ్నంగా కొనసాగేందుకు వీలవుతుందన్నారు.
 
లోక్‌సభ ఎన్నికలు ముగిసిపోయినందువల్ల జీఆర్ అంశాన్ని త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు. ఖైదీల్లో ఒత్తిడి విపరీతంగా ఉంటుందన్నారు. అందువల్ల వారికి ఇటువంటి కోర్సు అత్యంత అవసరమన్నారు. ప్రతిరోజూ ధ్యానం చేయడం వల్ల ఎన్నో సత్ఫలితాలు ఉంటాయన్నారు.

Advertisement
Advertisement