‘దేహీ అని కేంద్రాన్ని దేబిరించాల్సిందే’ | Sakshi
Sakshi News home page

‘దేహీ అని కేంద్రాన్ని దేబిరించాల్సిందే’

Published Tue, Sep 20 2016 7:49 PM

raghuveera reddy slams central government

చెన్నై: ఆంధప్రదేశ్‌కు కల్పించాల్సిన ప్రత్యేక హోదాపై కేంద్రం డ్రామాలాడుతోందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు (ఏపీసీసీ) ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదాతో ఏపీ అనేక హక్కులను పొందువచ్చని, అదే ప్యాకేజీ వల్ల కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. చెన్నైలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాను కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం అన్ని చట్టాలను పక్కన పెట్టేసిందన్నారు.

ప్యాకేజీ వల్ల ప్రత్యేక హోదా కంటే ఎక్కువ మేలు జరుగుతుందని ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని చెప్పారు. తమ ఇష్ట ప్రకారం నడుచుకునేందుకు దేశానికి, రాష్ట్రానికి వారు మేనేజింగ్ డైరక్టర్లు కాదని అన్నారు. ప్రజలు నమ్మి ఓట్లేస్తే వారినే వంచిస్తారా అని నిలదీశారు. ప్యాకేజీ కింద లక్షలాది కోట్ల రూపాయలను ప్రకటించారని, అవన్నీ మంజూరు చేస్తారని గ్యారంటీ ఏమిటి, నిధుల మంజూరుకు దేహీ అంటూ ప్రతిసారీ కేంద్రం వద్ద దశలవారీగా దేబిరించాల్సిందేనని అన్నారు.

రాష్ట్రాన్ని విభజించినపుడే ప్రత్యేక హోదాపై స్పష్టమైన నిర్ణయాన్ని అప్పటి యూపీఏ ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదని రఘువీరాను విలేకర్లు ఈ సందర్భంగా ప్రశ్నించగా, కేంద్ర కేబినెట్‌లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ నిర్ణయాన్ని బీజేపీ ప్రభుత్వం తోసిపుచ్చిందని బదులిచ్చారు. ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదాను కేబినెట్ నిర్ణయంతోనే 2002లో బీజేపీ ప్రభుత్వం కల్పించిన సంగతిని ఆయన గుర్తుచేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ కేబినెట్ తీసుకున్న నిర్ణయం నేటీకి సజీవంగా ఉందని అన్నారు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఇటీవలే నియమితులైన తిరునావుక్కరసర్‌ను రఘువీరారెడ్డి కలుసుకుని అభినందించారు.

Advertisement
Advertisement