ప్యాకేజీల తో బాబు పాలన సాగుతోంది: రఘవీరా | Sakshi
Sakshi News home page

ప్యాకేజీల తో బాబు పాలన సాగుతోంది: రఘవీరా

Published Sun, Sep 18 2016 8:13 PM

Raghuveera slams  Chandrababu Naidu

రాష్ట్రంలో ప్యాకేజీలతో బాబు పాలన సాగుతోందని, రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ ఇచ్చిన వాగ్దానాలను మరిచి ప్రజలను వంచిస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘవీరారెడ్డి విమర్శించారు. కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలో డీసీసీ అధ్యక్షుడు ఎండీ రఫీవుల్లా బేగ్ స్వగృహంలో ఆదివారం జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ, మట్టి సత్యాగ్రహం స్ఫూర్తితో చంద్రబాబు అవినీతి పాలనపై మరో పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుందని చెప్పారు.

 

విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి కేంద్రమే నిర్మించాలని ఉన్నా, ఇప్పుడు దాని నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడం అన్యాయమని, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్యాకేజ్‌లు ముట్టజెప్పేందుకేనని విమర్శించారు. కేవలం తమ సొంత కాట్రాక్టర్లకు పనులు అప్పగించడానికే చంద్రబాబు ప్రత్యేక హోదాను కాదని ప్యాకేజ్ తీసుకోవడానికి సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. వచ్చిన అవినీతి డబ్బును 2019 ఎన్నికల్లో ఖర్చుచేయడానికి సిద్ధమవుతున్నారని ఆరోపించారు. నవ్యాంధ్రలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్యాకేజ్‌లతో కొనుగోలు చేస్తూ, తెలంగాణలో ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికి టీడీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు అమ్ముకున్నాడని విమర్శించారు.

 

రెండున్నరేళ్ల కాలంలో టీడీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని, దీంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఈనెల 28న తిరుపతి నుంచి ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. ఎన్నికల సమయంలో అధికారం కోసం చంద్రబాబు 600 హామీలు, కులాల ప్రాతిపదికన 150 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని గుర్తు చేశారు. వీటితోపాటు ప్రత్యేక హోదా అంశంపై ప్రజల వద్దకు వెళతామని వివరించారు.

 

తమ ప్రజాబ్యాలెట్‌లో ప్రత్యేకహోదా అవసరం లేదని ప్రజలు అభిప్రాయపడితే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి కాంగ్రెస్ పార్టీ తరఫున సన్మానం చేస్తామని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిశీలకులుగా మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మిని నియమించినట్లు రఘువీరా ప్రకటించారు. సమావేశంలో మాజీ మంత్రులు పనబాక లక్ష్మి, కనుమూరి బాపిరాజు, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అమర్ జహాబేగ్, పశ్చిమగోదావరి డీసీసీ అధ్యక్షుడు రఫీవుల్లాబేగ్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement