వరాల జల్లు | Sakshi
Sakshi News home page

వరాల జల్లు

Published Thu, Mar 6 2014 10:46 PM

Rahul Gandhi says RSS people killed Mahatma Gandhi

 భివండీ, న్యూస్‌లైన్: రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం నగరానికి వచ్చిన రాహుల్ గాంధీ భివండీపై వరాల జల్లులు కురిపించారు. నగర మౌలిక సదుపాయాలతోపాటు మరమగ్గాల పరిశ్రమకి పెద్దపీట వేస్తానని హామీని ఇచ్చారు. సోనాలేలో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రతిపక్షాల వైఖరిని ఎండగడుతూనే కాంగ్రెస్ పార్టీని మళ్లీ గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్న భివండీలో పవర్ లూమ్ ఇండస్ట్రీకి పెద్దపీట వేస్తామన్నారు. ఠాణే జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేస్తామని హామీని ఇచ్చారు.

 ఠాణేను ముంబైతోపాటు కలుపుతాం...
 ఠాణే, భివండీతోపాటు ఇతర ప్రాంతాలను ముంబైతో అనుసంధానం చేస్తామని రాహుల్  పేర్కొన్నారు. ఇక్కడ ఏర్పాటుచేయాలనుకుంటున్న మెట్రో ప్రాజెక్టుపై ఇప్పటికే ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తో మాట్లాడామని చెప్పారు. మరోవైపు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా 5.5 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని వివరించారు.  మెట్రో కారిడార్ ద్వారా 13 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తామని చెప్పారు. విరార్-అలీబాగ్‌లను కలిపే 126 కిలోమీటర్ల కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇలా అనేక పథకాల ద్వారా అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.  

 మా పార్టీ పేదల పార్టీ...
 మా పార్టీ పేదల పార్టీ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దేశం అభివృద్ధి సాధించాలంటే పారిశ్రామికవేత్తలతోపాటు సామాన్యులను ఆదరించాల్సిన అవసరముందన్నారు. బడుగు బలహీనవర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. 1960, 1970లో అత్యధికంగా ఉన్న పేదరికం శాతం ఇప్పుడు తగ్గిందని, ఇది ఏ ఒక్కరి ద్వారా సాధ్యం కాలేదని, అందరి కృషి వల్లే సాధ్యమైందన్నారు. రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారీ అనేక విషయాలను తెలుసుకుంటున్నానని తెలిపారు.

 మహిళలకు ప్రాధాన్యమివ్వండి...
 అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని రాహుల్ సూచించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో కూడా  మహిళలకు స్థానం కల్పించాలని ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేకు సూచించారు. దేశ జనాభాలో 50 శాతం మంది మహిళలున్నారు. దీనికి తగ్గట్టుగా వారికి ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. అదేవిధంగా కోలి, కున్‌బీ, ఆదివాసులందరికీ న్యాయం చేస్తామని చెప్పారు.

 అభివృద్ధి పనులే ప్రచార అంశాలు: సీఎం
 లోక్‌సభ ఎన్నికల్లో అభివృద్ధి పనులే తమ ప్రచార అంశాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు. భివండీ సభలో ఆయన మాట్లాడుతూ గత పదేళ్లుగా తాము చేసిన అభివృద్ధి పనులు, చేయబోనున్న అభివృద్ధి పనుల గురించి తెలిపి ప్రజలను ఓట్లు అడుగుతున్నామన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నేతృత్వంలో లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లను గెలుచుకుంటామన్న ధీమాను వ్యక్తం చేశారు.

 ఠాణేలో భిన్నమైన సమస్యలున్నాయి....
 ఠాణేలో సమస్యలు మిగతా జిల్లాలకంటే భిన్నంగా ఉన్నాయని సీఎం చవాన్ పేర్కొన్నారు. దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఠాణే జిల్లాలో పట్టణ, ఆదివాసి, గిరిజన ప్రాంతాలున్నాయి. వీటిలో పట్టణ భాగం వేగంగా అభివృద్ధి చెందుతుండగా, ఆదివాసి ప్రాంతాలకు సరైన సదుపాయాలు అందడం లేదన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ జిల్లా కోసం ప్రత్యేక పథకాలు ప్రకటించామన్నారు. వీటిలో క్లస్టర్ డెవలప్‌మెంట్ యోజన, అటవీ హక్కు చట్టం తదితరాలున్నాయని తెలిపారు. భివండీలోని గోడౌన్‌లని క్రమబద్ధీకరించే విషయాన్ని పరిశీలిస్తున్నామని వివరించారు.

 బీజేపీకి విజన్ లేదు..
 బీజేపీకి విజన్ లేదని సీఎం పృథ్వీరాజ్ చెప్పారు. తాము చేసిన అభివృద్ధి పనులతో ఎన్నికల్లోకి వెళుతున్నామని, బీజేపీ మాత్రం కేవలం ఆరోపణలు తప్ప విజన్ లేదని ఆరోపించారు. ఐక్యతతోపాటు దేశ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌కు ఓటేయాలని ఆయన కోరారు.

 కాంగ్రెస్‌తోనే భవిష్యత్: మోహన్ ప్రకాష్
 దేశ భవిష్యత్ కాంగ్రెస్‌తోనే ఉందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీ మోహన్ ప్రకాష్ తెలిపారు.   కేవలం ఆరోపణలు చేయడంకాదని, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మా పార్టీ అందరికీ న్యాయం చేస్తుందన్నారు. దీంతోనే నేడు అందరూ హక్కుల కోసం పోరాడగలుగుతున్నారని తెలిపారు.  ‘చాయ్ పే చర్చా..రూ 250 కోట్ల ఖర్చా...’ అని నరేంద్ర మోడీని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో రాహుల్ గాంధీ, మోహన్‌ప్రకాష్, పృథ్వీరాజ్ చవాన్, నారాయణ రాణేలతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

 మత్స్యకారుల సమస్యలను పరిష్కరిస్తా
 వర్సోవ, న్యూస్‌లైన్: మత్స్యకారులు ఎదుర్కొంటున్న పలు సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా గురువారం నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక గోమగలిలో వర్సొవ కోలి మచ్చిమార్ నక్స మండల్ ట్రావెలర్స్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభలో రాహుల్... ముందుగా మత్స్యకారులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు మత్స్యకారులు స్పందిస్తూ ‘మేము ఆదివాసులం. అత్యవసర సామగ్రి అందడం లేదు. అనేక తరాలుగా ఈ వృత్తిలోనే కొనసాగుతున్నాం. ఇందులో లాభం కంటే నష్టమే ఎక్కువ. మా పిల్లలకు ఉన్నత విద్య నేర్పించాం. అయినా ఏ ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం రాలేదు.

దీంతో వారు కూడా ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు. తాత ముత్తాల నుంచి ఇదే వృత్తిలో బతుకులీడుస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం డీజిల్ ధరలను అనేక పర్యాయాలు పెంచింది. లాంచీల పన్ను పెంచింది. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన వసతులను ప్రభుత్వం కల్పించలేదు. మీరు వర్సొవ ప్రాంతాన్ని చూశారు కదా. ఇక్కడ రోడ్డు చాలా చిన్నదిగా ఉంది . మాకు పెద్ద రోడ్డు కావాలి.  మా పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగావకాకాశాలు కల్పించాలి’ అని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఎంపీ గురుదాస్ కామత్, ఎమ్మెల్సీ బాలెధేవ్ కోసా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement