ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి | Sakshi
Sakshi News home page

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి

Published Fri, Aug 21 2015 2:11 AM

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి

ముంబై : మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ జయంతి రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగింది. దేశవ్యాప్తంగా జరుపుకునే సద్భావానా దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నతాధికారులతో సద్భావానా ప్రతిజ్ఞ చేయించగా, గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు.. రాజ్‌భవన్ కార్యాలయ సిబ్బంది, పోలీసు అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. కూపరాగే గ్రౌండ్‌లో ప్రతిఏటా జరిగే కార్యక్రమానికి ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ గురుదాస్ కామత్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు, మహిళా శాఖ కార్యకర్తలు, జిల్లా అధ్యక్షులు భారీ సంఖ్యలో చేరుకుని రాజీవ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. విధాన సభలో ప్రతిపక్షనేత రాధాకృష్ణ విఖే పాటిల్ తన కార్యాలయంలో, పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం తిలక్ భవన్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు రాష్ట్రవ్యాప్తంగా సద్భావనా దివాస్ జరుపుకున్నారు.

 కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు
 రాజీవ్ జయంతి సందర్బంగా కాంగ్రెస్ వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ముంబై కాంగ్రెస్ (ఎంఆర్‌సీసీ) అధ్యక్షుడు సంజయ్ బలప్రదర్శన చేయడం శోచనీయమంటూ కొందరు నేతలు బాహాటంగానే విమర్శించగా, వీధుల్లో తిరిగే వాళ్లను వెల్లగొట్టాలంటూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కామత్ ఎద్దేవా చేశారు. రాజీవ్ గాంధీ 71 జయంతి సందర్భంగా కూపరాగే గ్రౌండ్‌లోని రాజీవ్ విగ్రహం వద్దకు  ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ గురుదాస్ కామత్, నేతలు, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు, మహిళా శాఖ కార్యకర్తలు, జిల్లా అధ్యక్షులు భారీ సంఖ్యలో చేరుకున్నారు.

అయితే ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు (ఎంఆర్‌సీసీ) సంజయ్ నిరుపమ్ మాత్రం మహాలక్ష్మి రేస్‌కోర్స్ నుంచి కూపరాగే గ్రౌండ్ వరకు సద్భావనా మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పార్టీ సీనియర్ నేతలు కృపాశంకర్ సింగ్, భాయ్ జగ్తాప్, అమిన్ పటేల్, వర్షా గైక్వాడ్, మాజీ ఎంపీ ఏక్‌నాథ్ గైక్వాడ్ పాల్గొన్నారు. ఈ వ్యవహారంపై మండిపడ్డ నగరానికి చెందిన ఓ నేత మాట్లాడుతూ, ‘రాజీవ్ జయంతి రోజు సంజయ్ నిరుపమ్ బలప్రదర్శన చేయడం శోచనీయం. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేతలంతా ఉదయం 9 గంటలకే కూపరాగే గౌండ్‌కు చేరుకోవడం గత కొన్నేళ్లుగా వస్తున్న ఆనవాయితీ.

కానీ ఈ సందర్భాన్ని బలప్రదర్శన చేయడానికి నిరు పం ఉపయోగించుకున్నారు’ అని విమర్శించా రు. కార్యక్రమానికి మాజీ ఎంపీలు మిలింద్ డియోరా, ప్రియా దత్ గైర్హాజరయ్యారు. అంతకుముందు మాట్లాడిన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ గురుదాస్ కామత్ , ముంబై నుంచి హ్యాకర్ల (వీధుల వెంట తిరిగే అమ్ముకునే వాళ్లు)ను తరిమికొట్టాలని పరోక్షంగా సంజయ్ నిరుపమ్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. నిరుపం కూపరాగే వద్దకు రాకపోవడంపై స్పందించిన కామత్, ఎవరో రాకపోతే కాంగ్రెస్‌కు వచ్చిన ముప్పేమీ లేదని, కాంగ్రెస్ విలువలు, మనోభావాలకు వచ్చిన నష్టం లేదని పేర్కొన్నారు. ఇటీవల బృహన్‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కమిషనర్ అజోయ్ మెహతాను కలసిన సంజయ్ నిరుపం, వీధుల వెంట తిరిగి అమ్ముకునే వాళ్లను ముంబై నుంచి పంపేయాలని ఆదేశిస్తూ కార్పొరేషన్ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరారు.

 సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించిన గవర్నర్
 దేశ మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 71వ జయంతి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు రాజ్‌భవన్ సిబ్బంది, అధికారులతో సద్భావనా దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. రాజ్‌భవన్ సిబ్బంది, ప్రజాపనుల శాఖ సిబ్బంది, రాష్ట్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్లు, ముంబై పోలీసులతో గవర్నర్ ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిం చారు. ‘కుల, మత, భాష, ప్రాంతాలతో సం బంధం లేకుండా దేశ ప్రజలందరి కోసం సహభావంతో పని చేస్తాం’ అని ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి బీ వేణుగోపాల్ రెడ్డి, ఉప కార్యదర్శి పరిమళ్ సింగ్ పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ జయంతిని (ఆగస్టు 20) ‘సద్భాభావన దివాస్’గా ప్రతి ఏడు జరుపుకుంటున్న విషయం తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement