క్షమాభిక్షపై రగడ | Sakshi
Sakshi News home page

క్షమాభిక్షపై రగడ

Published Mon, Feb 24 2014 11:44 PM

క్షమాభిక్షపై రగడ - Sakshi

 చట్ట ప్రకారం తే ల్చుకుంటాం : జయ
 పునఃపరిశీలించాలంటూ కాంగ్రెస్ ఆందోళన
 
 మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసు ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడం రాష్ట్ర రాజకీయాల్లో రగడ సృష్టించింది. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించగా, కాంగ్రెస్ మాత్రం అమ్మ నిర్ణయంపై ఆగ్రహంతో కదం తొక్కింది. పునఃపరిశీలించాలని సోమవారం ఆందోళన చేపట్టింది.
 
 చెన్నై, సాక్షి ప్రతినిధి:
 రాజీవ్ గాంధీ హత్యకేసులో ఉరిశిక్ష అనుభవిస్తున్న ఖైదీలను జీవితఖైదీలుగా మార్చి శిక్షను తగ్గిస్తున్నట్లు సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది. శిక్ష తగ్గించడం కాదు ఏకంగా ఏడుగురినీ విడుదల చేస్తామని మరుసటిరోజే సీఎం జయలలిత ప్రకటించారు. అయితే అదే స్థాయి లో కాంగ్రెస్ వైపు నుంచి ప్రతిఘటన ఎదురైంది. మాజీ ప్రధాని హత్యకేసులోనే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటే సామాన్యుని గతేంటని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, రాజీవ్ తనయుడు రాహుల్‌గాంధీ తన నిరసన గళాన్ని వినిపించారు. అంతేగాక సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుతో స్టే మంజూరైంది. తమ పార్టీ నేతను హతమార్చిన వ్యక్తులకు క్షమాభిక్ష పెడతారా అంటూ తమిళనాడు కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డాయి.
 
 సోనియా గుర్తుకు రాలేదా?
 ఏడుగురు ఖైదీల విడుదలలో తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న  నిర్ణయం పూర్తిగా చట్టవిరుద్ధమని టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ పేర్కొన్నారు. తన భర్త హత్యకు కారకురాలైన నళినీకి క్షమాభిక్ష పెట్టిన సోనియా గాంధీ గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. చెన్నై  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కరాటే త్యాగరాజన్ అధ్యక్షతన వల్లువర్‌కూట్టం వద్ద సోమవారం భారీ ఎత్తున ధర్నా, ఆందోళనా కార్యక్రమాలను నిర్వహించారు. జ్ఞానదేశికన్ మాట్లాడుతూ, ఆ ఏడుగురు దోషులు కారని పేర్కొన్న పీఎంకే అధినేత వైగో అసలు దోషులెవరో బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. చెన్నై రాయపేటలో నివసించిన భాగ్యనాథన్, పద్మ, నళినీ, రాష్ట్రానికి చెందిన పేరరివాళన్‌లను సమర్థిస్తే సరే, రాష్ట్రానికి ఏమాత్రం సంబంధం లేని శాంతన్, మురుగన్‌లను కూడా వైగో వెనకేసుకురావడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. వేదికలపై నుంచి ప్రసంగించేపుడు పార్టీ నేతలు జాతీయ స్పృహ కలిగి ఉండాలని ఆయన హితవు పలికారు. సుప్రీం కోర్టు తీర్పు వెలువడేలోపే ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఆయన కోరారు.
 
 కాంగ్రెస్‌పై జయ కస్సుబుస్సు
 ఖైదీల విడుదల విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిపై సీఎం జయ కస్సుబుస్సుమంటున్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఉరిశిక్ష నుంచి తప్పించుకున్న నలుగురి విడుదలపై తాను చట్టపరంగా వ్యవహరించానని ఆమె సమర్థించుకున్నారు. తన నిర్ణయంపై కాంగ్రెస్ వారు కోర్టుకెళతారని ముందే తెలుసనంటూ వ్యాఖ్యానించారు. అయినా పరవాలేదు, చట్ట ప్రకారమే ఈ అంశాన్ని ఎలా అధిగమించాలో పరిశీలిస్తున్నానని అన్నారు.
 
 నళినీ పెరోల్ పిటిషన్ 17కు వాయిదా
 రాజీవ్ హత్యకేసులో జీవిత ఖైదీగా వేలూరు జైలులో ఉంటున్న నళినీ పెట్టుకున్న పెరోల్ పిటిషన్‌ను మార్చి 17కు వాయిదా వేశారు. తిరునెల్వేలీలో ఉంటున్న తన తండ్రి శంకరనారాయణన్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నందున చివరి రోజుల్లో ఆయనతో గడిపేందుకు నెలరోజుల పెరోల్‌ను మంజూరు చేయాలని నళినీ పెట్టుకున్న పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. నళినీ తదితరులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం, సుప్రీం కోర్టులో ఈ అంశం పెండింగ్‌లో ఉన్న పరిస్థితుల్లో పెరోల్ పిటిషన్‌ను వాయిదావేయాలని ప్రభుత్వ న్యాయవాది షణ్ముగ వేలాయుధం వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తులు రాజేశ్వరన్, ప్రకాష్ పెరోల్ పిటిషన్‌ను వచ్చేనెల 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement
Advertisement