రేషన్ బంద్ | Sakshi
Sakshi News home page

రేషన్ బంద్

Published Tue, Apr 28 2015 2:43 AM

Ration bandh

 తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం రాష్ట్రంలోని రేషన్ దుకాణాల్లో పనిచేసే సిబ్బంది ఆందోళనకు దిగారు. రేషన్ దుకాణాలకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల సరఫరా నిలిచిపోవడంతో కార్డుదారులకు ఇబ్బంది తప్పలేదు.
 
 సాక్షి, చెన్నై:అధికార పార్టీ నేతల ఒత్తిడి, అధికారుల వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ రేషన్ షాపు సిబ్బంది సమ్మెకు దిగారు. తద్వారా సరుకుల సరఫరా నిలిచిపోయింది. రాష్ర్టంలో 30 వేలకు పైగా రేషన్ దుకాణాలు ఉన్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత పథకాలు ఇక్కడి నుంచే లబ్ధిదారులకు అందుతున్నాయి. కోటి 97 లక్షల మంది కార్డుదారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. కొన్నిచోట్ల రేషన్ అక్రమాలు జోరుగా పెరుగుతున్నాయి. ఉచిత బియ్యం పక్కదారి పడుతున్నాయి. ఇందులో అధికార పక్షం నాయకులు, అధికారుల చేతివాటాలు బయట పడుతున్నాయి.
 
 అదే సమయంలో అధికారులు, అధికార   పక్షం నాయకుల వేధింపులు రేషన్ దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బందికి సంకటంగా మారాయి. ఈ పరిస్థితుల్లో అధికారుల వేధింపులు తాళలేక చెన్నై జేజే నగర్‌లోని రేషన్ దుకాణం సిబ్బంది ఇళంగో ఆత్మహత్య చేసుకోవడం రేషన్ దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బందిలో ఆగ్రహం రేపింది. అలాగే సేలం, నంగనల్లూరు తదితర ప్రాంతాల్లో అధికారుల వేధింపులు భరించలేక పలువురు సిబ్బంది ఆత్మహత్యాయత్నం చేయడం వెలుగులోకి వచ్చింది. అధికారుల తీరుకు నిరసనగా, తమ గోడును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా మొదటిసారిగా రేషన్ సిబ్బంది సోమవారం ఒక రోజు బంద్‌కు పిలుపునిచ్చారు.
 
 మూతపడ్డ రేషన్ దుకాణాలు
 బంద్ కారణంగా రాష్ట్రంలోని 30వేలకు పైగా ఉన్న రేషన్ దుకాణాలు మూతబడ్డాయి. ఉదయాన్నే దుకాణాలకు తాళం వేసిన సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల ఉదయం కాసేపు తెరిచినా సంఘం నాయకుల ఒత్తిడితో తాళం వేసుకోక తప్పలేదు. మరికొన్ని చోట్ల మధ్యాహ్నం వరకు తెరచి ఉంచి తర్వాత మూసి వేశారు. చెన్నైలో అన్ని దుకాణాలు మూతపడ్డాయి. సాయంత్రం వన్నార్ పేటలోని పౌరసరఫరాల విభాగం కార్యాలయం ఎదుట సిబ్బంది ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లను ఎత్తి చూపుతూ నినాదాలతో హోరెత్తించారు.
 
 రేషన్ షాపుల సిబ్బంది సంఘం నాయకుడు పల్లిపట్టి శక్తి వేల్ మాట్లాడుతూ అధికారుల వేధింపులు తమ మీద పెరిగాయని తెలిపారు. చాలీచాలనీ జీతాలతో విధులు నిర్వర్తిస్తున్న తమపై వేధింపులు తగదని మండిపడ్డారు. తమకు జీతాలు పెంచాలని, ఆత్మహత్య చేసుకున్న ఇలంగోవన్ కుటుంబానికి రూ.పది లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమను వేధిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలిపారు.
 

Advertisement
Advertisement