ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే... | Sakshi
Sakshi News home page

ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే...

Published Fri, Jul 11 2014 3:11 AM

Reached in a few days ...

సాక్షి ప్రతినిధి, బెంగళూరు :  బెంగళూరులోని రెవెన్యూ స్థలాల్లో నివేశనాలను కొనుగోలు చేసి(బీ ఖాతా), ఏ ఖాతా కోసం ఎదురు చూస్తున్న వారు మరి కొద్ది రోజులు ఆగాల్సి ఉంది. బీ ఖాతాలు కలిగిన యజమానుల నుంచి బెటర్‌మెంట్ ఛార్జీలను వసూలు చేయడం ద్వారా ఏ ఖాతాలుగా మార్చనున్నట్లు బీబీఎంపీ ఇటీవల తెలిపింది.

అయితే వ్యవసాయ భూమిని వ్యవసాయేతరానికి ఉపయోగించుకోవడానికి ‘భూ పరివర్తన’ అనుమతి పొందిన వాటికి మాత్రమే ప్రస్తుతం ఏ ఖాతాలు మంజూరు చేయనున్నారు. నగరంలో భూ పరివర్తన అనుమతి పొందని నివేశనాలు 2.5 లక్షల దాకా ఉన్నాయి. వీటికీ ఏ ఖాతాలు మంజూరు చేస్తే బెటర్‌మెంట్ ఛార్జీల రూపంలో బీబీఎంపీకి రూ.500 కోట్ల వరకు ఆదాయం లభిస్తుంది.

అయితే కర్ణాటక ల్యాండ్ రెవెన్యూ చట్టం ప్రకారం ఇలాంటి సైట్లకు ఏ ఖాతా ఇవ్వడం కుదరదు. మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీల ఏర్పాటు ద్వారా ఏ ఖాతాలు ఇవ్వడానికి  మార్గం సుగమమవుతుంది. ఈ నెలాఖరుకు ఈ కమిటీలు ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. అప్పటి వరకు బీ ఖాతాలు పొందిన విడి  నివేశన స్థలాల యజమానులు వేచి ఉండాల్సిందే.
 

Advertisement
Advertisement