సంధికి యత్నం! | Sakshi
Sakshi News home page

సంధికి యత్నం!

Published Thu, Apr 10 2014 2:17 AM

Rift with Stalin on politics, nothing can divide family: Alagiri

సాక్షి, చెన్నై : డీఎంకేలో అన్నదమ్ముళ్ల మధ్య సాగుతూ వచ్చిన వారసత్వ పోరు ఇటీవల ముదిరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డీఎంకే నుంచి అళగిరిని బహిష్కరించారు. దీంతో స్టాలిన్‌ను టార్గెట్ చేసి అళగిరి ఆరోపణాస్త్రాలను సంధిస్తూ వస్తున్నారు. డీఎంకే అధిష్టానంపై విమర్శలు గుప్పిస్తూ, అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా పావులు కదిపే పనిలో ఆయన పడ్డారు. ఇది డీఎంకే అధిష్టానానికి శిరోభారంగా మారింది. అళగిరి చర్యలు ఎక్కడ పార్టీ అభ్యర్థులకు గడ్డు పరిస్థితులను సృష్టిస్తాయోనన్న బెంగ నెలకొంది. అదే సమయంలో తన స్వరం పెంచడం ద్వారానైనా డీఎంకే అధిష్టానం దిగి వస్తుందన్న ధీమాతో అళగిరి ఉన్నట్టుగా ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు. వేరు కుంపటి పెట్టను, డీఎంకేను చీల్చను, కరుణానిధిని మాత్రం రక్షించు కుంటానంటూ చెప్పుకొచ్చిన అళగిరి తన దూతను ఆయన వద్దకు రాయబారం సాగించేందుకు పంపిన విషయం వెలుగు చూసింది. 
 
 రాయబారం : తన మద్దతుదారుడు, పార్టీ వ్యవసాయ విభాగం నేత కేపీ రామలింగంను అళగిరి ఠదూతగా ఎంపిక చేసుకున్నారు. కరుణానిధి వద్దకు ధైర్యంగా వెళ్లగల నేత రామలింగం కావడంతో ఆయన్ను ఎంపిక చేసుకుంటే, తాను ఆశించినవి జరగొచ్చన్న ధీమాతో అళగిరి ఉన్నట్టున్నారు. ఈరోడ్‌లో మంగళవారం ప్రచారం నిర్వహించిన కరుణానిధిని కేపీ రామలింగం కలుసుకున్నట్టు తెలిసింది. గురువారం మదురైలో పర్యటించనున్న దృష్ట్యా, పెద్దకుమారుడు అళగిరి ఇంటికి వెళ్దామా? అన్నట్టుగా కేపీ రామలింగం వేసిన బాణం కరుణకు చిర్రెత్తించినట్టు సమాచారం. తానెందుకు వెళ్లాలి? అని రామలింగంను కరుణ ప్రశ్నించినట్టు తెలిసింది. ఆయన వైపు ఉన్న న్యాయం కూడా చూడాలిగా అంటూ పరోక్షంగా కేపీ ఇచ్చిన సమాధానంతో కరుణానిధి ఆగ్రహానికి లోనైనట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలయ్యే వరకు ఓపిక పట్టాలని చెబితే, 
 
 ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, డీఎంకేను చీల్చిన బద్ద శత్రువు వైగోను ఆహ్వానించడం ఏమిటంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. అలాగే, కేపీ రామలింగం తీరును ఎండగడుతూ తీవ్రంగా క్లాస్ పీకినట్టు డీఎంకే వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అళగిరితో కలసి తమరు ఒలకబెడుతున్నదేంటో తనకు తెలుసని, పంథా మార్చుకోకుంటే, అందరికీ వేటు పడుతుందని రామలింగంను హెచ్చరించి పంపారు. అయితే, కరుణానిధి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆగ్రహంగా ఉన్నా, ఎన్నికలయ్యే వరకు ఓపిక పట్టరా?, పంథా మార్చుకోండంటూ ఆయన చేసిన హెచ్చరికను అళగిరి పరిగణనలోకి తీసుకున్నట్టున్నారు. తన పంథాను మార్చుకోవడంతో పాటుగా ఎన్నికలయ్యే వరకు ఓపిక పట్టేందుకు సిద్ధమైనట్టుంది. బుధవారం అళగిరి చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి. 
 
 మారిన స్వరం : ఇన్నాళ్లు స్టాలిన్‌ను టార్గెట్ చేసిన ఘాటైన పదాల్ని ఉపయోగిస్తూ వచ్చిన అళగిరి బుధవారం స్వరం మార్చారు. తేనిలో మీడియాతో మాట్లాడిన అళగిరి సిద్ధాంత పరంగా తామిద్దరం వేర్వేరు అని వ్యాఖ్యానించారు. సిద్ధాంత పరంగా తామిద్దరు ఢీ కొడుతున్నామేగానీ, స్టాలిన్ తన తమ్ముడన్న విషయాన్ని గుర్తుంచుకోండని మీడియాకు హితవు పలికారు. ఆయనతో తనకు ఉన్న బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరని, అన్నదమ్ముళ్ల బంధం అంటే అదే అని వ్యాఖ్యానించి అందర్నీ విస్మయంలో పడేశారు. కరుణానిధి లేకుంటే, డీఎంకే లేదని, తాను కొత్త పార్టీ పెట్టే ప్రసక్తే లేదని ముందుకు కదిలారు. 
 
 అదే సమయంలో తేని ఎండీఎంకే అభ్యర్థి అళగు సుందరం, కాంగ్రెస్ అభ్యర్థి జేఎం హారుల్ అళగిరికి ఎదురు పడ్డారు. తమకు మద్దతు ఇవ్వాలని కోరగా, అళగిరి చిరునవ్వుతో ముందుకు సాగడం గమనార్హం. అయితే, అళగిరిలో ఉన్నట్టుండి బంధం గుర్తుకు రావడం వెనుక స్టాలిన్‌కు లభిస్తున్న ఆదరణ కారణం అని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దక్షిణాదిలో అన్నాడీఎంకే అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ శ్రేణుల పనితీరు అస్తవ్యస్థంగా ఉండటం డీఎంకేకు కలిసి వస్తున్నట్టుగా వస్తున్న సంకేతాలతోనే స్వరం మార్చే పనిలో అళగిరి ఉన్నట్టున్నారని డీఎంకే నేత ఒకరు పేర్కొన్నారు. అయితే, అళగిరి దిగి వచ్చినా, కరుణానిధి ఆదరించేనా? స్టాలిన్ అక్కున చేర్చుకునేనా? అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది.    
 

Advertisement
Advertisement